Saturday, April 27, 2024

Logo
Loading...
google-add

లేని నియోజకవర్గానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్ధి

P Phaneendra | 15:49 PM, Thu Mar 28, 2024

Congress candidate files nomination for non-existent constituency

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మణిపూర్‌లో ఒక విచిత్రం చోటు చేసుకుంది. ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అంగోమ్‌చా బిమొల్ అకోయ్‌జామ్ నామినేసన్‌ను తిరస్కరించాలంటూ బీజేపీ అభ్యర్ధి తొనావ్‌జామ్ బసంతకుమార్ సింగ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ తప్పుల తడకగా ఉందన్నది ఆయన ఫిర్యాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏమిటో తెలుసా? లోక్‌సభా స్థానానికి నామినేషన్ వేయవలసిన దరఖాస్తులో లేని సీటు పేరు రాయడమే.

బసంత్‌కుమార్ ఫిర్యాదు ప్రకారం, డాక్టర్ అకోయ్‌జామ్ తన నామినేషన్ పత్రాలను తప్పుగా నింపి దాఖలు చేసారు. లోక్‌సభ ఎన్నికలకు పోటీచేస్తూ తన దరఖాస్తులో ఆయన ఎంపీ సీటుగా ఉనికే లేని నియోజకవర్గం పేరు రాసారు. మార్చి 27న అంటే నిన్న దాఖలు చేసిన పత్రాల్లో కాంగ్రెస్ అభ్యర్ధి అకోయ్‌జామ్ ‘‘12 కెయిషామ్‌తాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం’’ అని పేరు రాసారు. దానికీ ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకూ సంబంధమే లేదు.

తప్పుడు పత్రాలు దాఖలు చేయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ అకోయ్‌జామ్ ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 లోని పలు నిబంధనలను అకోయ్‌జామ్ ఉల్లంఘించారని బసంతకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అకోయ్‌జామ్ దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాల్లోనే అవే తప్పులు పునరావృతం అయ్యాయి. అన్నింటిలోనూ అసెంబ్లీ నియోజక వర్గం పేరునే రాసారు. ‘ఇన్నర్ మణిపూర్’ అని లోక్‌సభ నియోజకవర్గం పేరు రాయవలసిన చోట తప్పు పేరు రాయడం, అది కూడా నాలుగు సెట్ల పత్రాల్లోనూ ఒకేలా రాయడం విశేషం.

బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుతం మణిపూర్ విద్యాశాఖ మంత్రి అయిన బసంతకుమార్, అది కేవలం సాధారణ తప్పిదం కాదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందనీ ఆరోపించారు.

ఈ వ్యవహారంపై వివరణ కోసం డాక్టర్ అకోయ్‌జామ్‌తో మాట్లాడడానికి ప్రయత్నించిన మీడియాకు నిరాశే మిగిలింది. ఆయన ఫోన్ స్విచాఫ్‌లో ఉంది, ఆయన అందుబాటులో లేరు. అయితే అకోయ్‌జామ్ న్యాయబృందం, తప్పులను సవరించామని, పూర్తి వివరాలు త్వరలో చెబుతామనీ హామీ ఇచ్చింది.

మణిపూర్‌లో రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. అవి... ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్. ఇన్నర్ మణిపూర్‌కు, ఔటర్ మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలకూ ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్‌లోని మిగతా ప్రాంతాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది.

google-add
google-add
google-add

Badi Baat

లేటెస్ట్ అప్‌డేట్

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add