Friday, March 01, 2024

Logo
Loading...
upload

దేశ రాజకీయాలు

వైరల్ పోస్ట్: చైనా భాషలో తమిళనాడు సీఎంకు బర్త్ డే విషెస్

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం రేపిన ‘చైనా ఫ్లాగ్ స్టిక్కర్’ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇస్రో కు సంబంధించిన వార్తాపత్రిక ప్రకటనలో చైనా జెండారంగుల స్టిక్కర్ ను అచ్చు వేయించిన స్టాలిన్ ప్రభుత్వం, విపక్షాల నుంచి దేశ ప్రజల నుంచి వ్యతరేకత వ్యక్తం కావడంతో చెంపలేసుకుంది. అనుకోకుండా జరిగిన పొరపాటు అంటూనే భారత్-చైనా మధ్య విభేదాలు ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది.

డీఎంకే ప్రభుత్వం తీరును సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ఏకిపారేస్తున్నారు. ఈ విషయంలో తమిళనాడు బీజేపీ కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ కు చురకలు అంటించింది. ముఖ్యమంత్రి స్టాలిన్, పుట్టినరోజు(మార్చి1) సందర్భంగా చైనా జాతీయభాష(మాండరిన్) లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చైనా జపం చేస్తోన్న డీఎంకే ప్రభుత్వ సారథి స్టాలిన్ కు ఆయనకు ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు అంటూ వ్యంగ్యం ప్రదర్శించింది.  ‘‘మీరు(స్టాలిన్) కలకాలం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’’ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టణంలో ఇస్రో రెండో రాకెట్ లాంచ్ ప్యాడ్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా దినపత్రికలో డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో రాకెట్ కు చైనా జెండా రంగులు ఉన్నాయి. మంత్రి అనితా రాధాకృష్ణన్ పేరిట ఈ యాడ్ జారీ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ కూడా డీఎంకే ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశప్రజలను భారతీయశాస్త్రవేత్తలను అవమానించేలా స్టాలిన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.

దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఘటనకు తమిళనాడు మంత్రి రాధాకృష్ణన్ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. ప్రకటనలో పొరపాటు జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. తమకు వేరే ఉద్దేశం లేదని భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉందన్నారు.

పత్రికాప్రకటనలో చైనా జెండాను చూడగల్గిన ప్రధాని మోదీకి గత పదేళ్ళలో భారత భూభాగంలో చైనా అడుగుపెట్టిందనే నివేదికలు కనబడటం లేదా అని డీఎంకే ఎంపీ విల్సన్ విమర్శించారు.

T Ramesh | 16:32 PM, Fri Mar 01, 2024

మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు

Opposition Alliance Deals Seat Sharing in Maharashtra

2024 లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి ‘మహా వికాస్ ఆఘాడీ’లోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. అధికారిక ప్రకటన మాత్రం ఒకట్రెండు రోజుల్లో వెలువడవచ్చు.

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కుదిరిన పొత్తు ప్రకారం శివసేన (యుబిటి) 20 స్థానాల్లోను, కాంగ్రెస్ 18 స్థానాల్లోను, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లోనూ పోటీ చేస్తాయి.

కూటమిలోని చిన్న పార్టీ వంచిత్ బహుజన్ ఆఘాడీ అనే పార్టీకి, శివసేన (యుబిటి) తమకు కేటాయించిన సీట్లలోనుంచి రెండింటిని ఇస్తుంది. అలాగే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాజు శెట్టికి ఎన్సీపీ మద్దతునిస్తుంది.

ముంబై మహానగరంలోని 6 నియోజకవర్గాల్లో శివసేన (యుబిటి) పోటీ చేసే 4 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ నాలుగింటిలో ముంబై ఈశాన్యం టికెట్ వంచిత్ బహుజన్ ఆఘాడీ పార్టీకి కేటాయించే అవకాశాలున్నాయి.

గతవారం 39 స్థానాలపై చర్చలు జరిగాయి. ముంబై దక్షిణ మధ్య, ఆగ్నేయ స్థానాలు తమకే కావాలని కాంగ్రెస్, ఉద్ధప్ పట్టు పట్టారు. ఆ సమస్య ఎలా పరిష్కారమైందో తెలియరాలేదు.

2019 ఎన్నికల్లో శివసేన 23 స్థానాల్లో పోటీ చేసి 18చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 25చోట్ల పోటీ చేసి ఒకే ఒక్క స్థానంలో గెలవగలిగింది. ఎన్సీపీ 19చోట్ల పోటీ చేసి 4 గెలుచుకుంది. ఇక బీజేపీ 25 స్థానాల్లో పోటీ పడి 23 గెలుచుకుంది.

P Phaneendra | 12:58 PM, Fri Mar 01, 2024

తెల్లవారేవరకూ బీజేపీ సమావేశం, నేడు వందమంది అభ్యర్ధులను ప్రకటించే అవకాశం

BJP likely to announce 100 candidates for LS elections 2024

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సుమారు వంద మంది అభ్యర్ధుల పేర్లను ఇవాళ ప్రకటించే అవకాశముంది. నిన్న గురువారం రాత్రి 11గంటలకు ప్రారంభమైన బీజేపీ అగ్రనేతల సమావేశం ఇవాళ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకూ కొనసాగింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... బీజేపీ సిట్టింగ్ ఎంపీల గురించి క్షేత్రస్థాయి కార్యకర్తలు, నియోజకవర్గ ఓటర్లతో సైతం చర్చించి అభ్యర్ధులను ఖరారు చేయాలని భావిస్తోంది. అవసరమైన చోట అభ్యర్ధులను వ్యూహాత్మకంగా మార్చడానికి సైతం వెనుకడుగు వేయడం లేదు. ప్రజావ్యతిరేకతకు ఎలాంటి అవకాశమూ లేకుండా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్ధులను ఖరారు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది.  

ఎన్నికల కమిషన్, 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూలును విడుదల చేయడం కంటె ముందే కొంతమంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించివేయాలని బీజేపీ భావిస్తోందని సమాచారం. ఎన్‌డీయే మిత్రపక్షాల అభ్యర్ధులను కాకుండా, బీజేపీ అభ్యర్ధులను మాత్రమే ప్రస్తుతానికి ప్రకటించాలని బీజేపీ యోచిస్తోందట. దానివల్ల, ప్రత్యర్ధి కూటమి అయిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి కంటె ఒక అడుగు ముందే ఉండాలని కమలదళం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండీ కూటమిలో ఇంకా సీట్లు పంచుకునే విషయం ఇంకా తేలలేదు. వారికంటె ముందుగానే తమ అభ్యర్ధులను ఖరారు చేయడం ద్వారా ఒక అడుగు ముందుండాలని బీజేపీ భావిస్తోందని సమాచారం.

గతరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకూ సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ప్రధానంగా హిందీబెల్ట్ రాష్ట్రాల్లో అభ్యర్ధుల అంశంపైనే ప్రధానంగా బీజేపీ చర్చించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్. రాజస్థాన్‌లతో పాటు ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ అభ్యర్ధులపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అలాగే దక్షిణాదిలో ఉనికి కోసం బీజేపీ శ్రమిస్తున్న కేరళ, తెలంగాణ రాష్ట్రాల పైనా దృష్టి సారించినట్లు సమాచారం.  

ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయం పెండింగ్‌లో ఉన్నందున అక్కడ అభ్యర్ధుల విషయాన్ని పక్కన పెట్టారని తెలుస్తోంది. పంజాబ్‌లో అకాలీదళ్, తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలతో సంబంధాలను పునరుద్ధరించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో పొత్తు ఉన్నా, ఆ పార్టీ తెలుగుదేశంతో కలిసిరావాలని కోరుతోంది. మరోవైపు అధికార వైఎస్సార్‌సీపీతో కూడా పెద్ద విభేదాలేమీ లేవు. అందువల్ల ఆంధ్రాలో బీజేపీ ఎటువైపు అడుగు వేస్తుందన్న విషయం ఆసక్తికరంగా నిలిచింది.

ఇవాళ మధ్యాహ్నం తర్వాతే జాబితా విడుదల ఉండవచ్చు. నరేంద్ర మోదీ వారణాసి నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మోదీ 2014లో 3.7లక్షల మెజారిటీతోను, 2019లో 4.8లక్షల ఓట్ల మెజారిటీతోనూ గెలిచారు. మోదీని అడ్డుకోడానికి వారణాసి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రియాంకాగాంధీ వాద్రాను మోహరిస్తుందన్న ఊహాగానాలున్నాయి. పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఆఢ్వాణీ, వాజ్‌పేయీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్‌ నుంచి అమిత్ షా 2019 ఎన్నికల్లో పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్ధి చతురాయిన్ చావ్డా మీద 5న్నర లక్షల ఓట్లతో విజయం సాధించారు.

ఇంకా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి, పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా మధ్యప్రదేశ్‌లోని గుణ-శివపురి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లక్నో బీజేపీ కంచుకోట. వాజ్‌పేయీ 1991 నుంచి 2004 వరకూ అక్కడినుంచి పోటీచేసి విజయం సాధించారు, ఆయన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ 2014, 2019 ఎన్నికల్లో లక్నో నుంచి గెలిచారు. ఇంక గుణ స్థానం సిందియా కుటుంబానికి అంకితమైపోయిన స్థానం. 1952లో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటివరకూ మొత్తం 14 సార్లూ సిందియా రాజకుటుంబమే ఆ స్థానంలో విజయం సాధిస్తోంది. జ్యోతిరాదిత్య సిందియా 2002లోను, 2014లోనూ గుణ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలిచి గెలిచారు. అయితే బీజేపీలోకి మారిన తర్వాత ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2019లో గుణలో బీజేపీ అభ్యర్ధి కృష్ణపాల్ యాదవ్ గెలిచారు.

బీజేపీ మొదటి జాబితాలో ఉండే అవకాశమున్న పేర్లు ఇలా ఉన్నాయి.... అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి పోటీ చేయవచ్చు.అస్సాంలో బీజేపీ 11 స్థానాల్లో పోటీ చేస్తుంది, 3 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నిన్ననే వెల్లడించారు. అక్కడ అసోం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అనే రెండు పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లో ఈసారి భోపాల్ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌కు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఆ సీటును మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇస్తారని సమాచారం. అయితే చౌహాన్, తన సొంత జిల్లాలోని విదిశ స్థానం ఆశిస్తున్నారు. అక్కడినుంచి ఆయన ఐదుసార్లు గెలిచారు. అలాగే, విదిశలో గెలుపు బీజేపీకి నల్లేరు మీద బండి నడకే. అక్కడ 1989 నుంచి బీజేపీయే గెలుస్తోంది.

నిన్నటి సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షాల గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఆ రాష్ట్రంలో అప్నాదళ్, రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీలు బీజేపీతో పొత్తులో ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే, మార్చి 10లోగా కనీసం 50శాతం స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

P Phaneendra | 11:24 AM, Fri Mar 01, 2024

టీఎంసీ నుంచి షాజహాన్ సస్పెన్షన్, లాయర్‌కు రానున్న పదేళ్ళూ  తీరికుండదన్న జడ్జి

సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు,  భూ కబ్జాలకు పాల్పడిన కేసులో నిందితుడు, ఈడీ అధికారులపై దాడి కేసులో అరెస్టైన టీఎంసీ నేత షాజహాన్ పై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆరేళ్ళ పాటు సస్పెండ్ చేసింది. సందేశ్ ఖాలీలో షాజహాన్ బలమైన నేత. టీఎంసీ విభాగ అధ్యక్షుడిగా ఉన్న షేక్ షాజహాన్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల కంటే ఎక్కువ బలమైన నేతగా ఉన్నారు.

1999 లో కూలీగా తర్వాత కూరగాయల విక్రేతగా జీవితాన్ని గడిపిన షాజహాన్, ఆ తర్వాత సీపీఎంలో చేరారు. ఆ పార్టీలో కొనసాగుతూ అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాల కల్పన పేరిట యువతను చెప్పుచేతల్లో పెట్టుకున్న షాజహాన్, శుభకార్యాల సమయంలో ఆర్థిక సాయం చేయడం ద్వారా స్థానికులకు దగ్గరయ్యారు.

2013లో టీఎంసీలో చేరి మాజీ మంత్రి జ్యోతిప్రియో మాలిక్ పంచన చేరారు. రేషన్ కుంభకోణంలో మాలిక్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో సోదాలకు వచ్చిన అధికారులపై షాజహాన్ అనుచరులు దాడి చేశారు. అప్పటి నుంచి షాజహాన్ తప్పించుకు తిరుగుతున్నాడు. నేటి ఉదయం పోలీసులకు చిక్కాడు. స్థానికుల నుంచి భూములు లాక్కోవడంతో పాటు అతడి అనుచరులు మహిళలపై లైంగికదాడులకు పాల్పడ్డారని, అపహరించారని కేసు నమోదైంది.

షాజహాన్ కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది  చేసిన వినతి సందర్భంగా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం కీలక వ్యాఖ్యలు చేశారు. షాజహాన్ విషయంలో సానుభూతి లేదన్నారు. షాజహాన్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది కోరగా ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు. పిటిషన్ ను సోమవారం విచారిస్తామన్నారు. షాజహాన్ పై 43 కేసులు ఉన్నాయని ఆయన తరఫున వకాల్తా పుచ్చుకునే న్యాయవాది వచ్చే పదేళ్ళు బిజీగా ఉంటారని వ్యాఖ్యానించారు. 

T Ramesh | 16:38 PM, Thu Feb 29, 2024

పోలీసుల కస్టడికీ టీఎంసీ నేత షేక్ షాజహాన్‌, సందేశ్‌ఖాలీలో సంబరాలు

ఈడీ అధికారులపై దాడి కేసులో అరెస్టైన టీఎంసీ నేత షేక్ షాజహాన్‌కు రిమాండ్ విధించిన బసిర్‌హాట్ న్యాయస్థానం, పదిరోజుల పోలీసుల కస్టడికీ అప్పగించింది. పోలీసులు 14 రోజుల కస్టడీకి కోరినప్పటికీ న్యాయస్థానం పదిరోజులకే అనుమతించిందని షాజహాన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రాజా భౌమిక్ తెలిపారు. పోలీసు కస్టడీ అనంతరం, మార్చి 10న కోర్టులో హాజరుపరచాలని జడ్జి ఆదేశించినట్లు తెలిపారు.

రేషన్ కుంభకోణం కేసు విచారణలో భాగంగా సోదాలు నిర్వహించేందుకు బెంగాల్ వెళ్ళిన ఈడీ అధికారులు కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీఎంసీ నేత, షేక్ షాజహాన్ ను నేటి ఉదయం పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సందేశ్‌ఖాలీ లో మహిళలపై లైంగికదాడి, భూకబ్జా కేసులో షాజహాన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కూడా నిందితుడిగా షాజహాన్ ను చేర్చారు.

గడిచిన 55 రోజులుగా పరారీలో ఉన్న షాజహాన్ ను గురువారం ఉదయం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో రిమాండ్ కు ఆదేశించిన న్యాయస్థానం, పదిరోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.

షాజహాన్ అరెస్టుపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ స్పందించారు. ఈ ఘటన అక్రమార్కులకు కనువిప్పు లాంటిదన్న ఆనంద బోస్, ఇది ఆరంభం మాత్రమే అన్నారు. బెంగాల్ లో హింస, దౌర్జన్యాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరైన చర్యలు తీసుకోవాలన్నారు. పశ్చిమబెంగాల్ లోని వివిధ ప్రాంతాల్లోని గుండారాజ్యానికి తగిన చర్యలతో అడ్డుకట్ట వేయాలన్నారు.

షాజహాన్ అరెస్టుతో సందేశ్‌ఖాలీలో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.  మహిళలు రోడ్లపైకి వచ్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.

T Ramesh | 14:09 PM, Thu Feb 29, 2024

జైత్రయాత్ర: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలు

పలు రాష్ట్రాల పరిధిలో నిన్న15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా, బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఉత్తరప్రదేశ్ లో 10, కర్ణాటకలో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్ లో ఒక స్థానానికి పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, 8 రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకోగా, మిగతా రెండు స్థానాలు విపక్ష సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకుంది.

రాజ్యసభ ఎన్నికలతో బీజేపీ విజయ యాత్ర మొదలైందన్న ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, లోక్‌సభ ఎన్నికల్లోనూ జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు.   కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా...  కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు హస్తంగతం చేసుకోగా ఓ  స్థానంలో బీజేపీ  విజయం సాధించింది.

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులిద్దరికీ సమానంగా 34 ఓట్లు లభించాయి. దాంతో 'టాస్' విధానాన్ని అనుసరించగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజేతగా నిలిచారు.

T Ramesh | 10:48 AM, Wed Feb 28, 2024

upload
upload

రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీ ప్రభుత్వం: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఏపీ సర్కారు పై విమర్శలు గుప్పించిన రాజ్‌నాథ్ సింగ్, కేంద్రం కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా దోచుకుతింటున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ, ఏలూరు, విశాఖలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. వైసీపీ పాలనలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుందన్నారు. పోర్టులు, హైవేలు నిర్మించి ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చేందుకు కేంద్రప్రభుత్వం దోహదపడిందని వివరించారు. జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం రూ.4 వేల కోట్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం పేదలకు తాగునీరు సరఫరా చేయడం విఫలమైందని విమర్శించారు.

బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్, కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఒక్క అవినీతి ఆరోపణ లేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమన్నారు.  వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 370 సీట్లు రావడం ఖాయమన్నారు. అవినీతి నిర్మూలనకు, దుష్టులను శిక్షించేందుకు బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరాలని చెప్పారు. పెట్టుబడులు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా బీజేపీ పాలన అవసరమన్నారు. అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించాలంటే దేశంలో బీజేపీ అధికారంలో ఉండాల్సిందేనన్నారు.

T Ramesh | 10:29 AM, Wed Feb 28, 2024

కేరళలో ప్రధాని మోదీ పర్యటన: కాంగ్రెస్, లెఫ్ట్ రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల రాజకీయాలను ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో స్నేహం చేసే పార్టీలు కేరళలో మాత్రం విరోధులంటూ దెప్పిపొడిచారు. కేరళ పర్యటనలో భాగంగా తిరువనంతపురంలో బీజేపీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

తిరువనంతపురంలో ఓ వైఖరి, దిల్లీలో మరోవైఖరి అనుసరించే పార్టీలంటూ కాంగ్రెస్, లెఫ్ట్ పక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. కేరళలో ప్రత్యర్థులుగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ(ఎం).. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం  మిత్రపక్షాల పేరిట రాజకీయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పరస్పర రాజకీయ వైరుధ్యాలున్నపార్టీలు ఇండియా కూటమి పేరిట పలు రాష్ట్రాల్లో సీట్లు చేసుకుంటున్నాయన్నారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ అవినీతిపరుడన్న ప్రధాని మోదీ, కేరళలో గత కమ్యూనిస్ట్‌ ప్రభుత్వాలు,  కాంగ్రెస్‌ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశాయని గుర్తు చేశారు. కమ్యూనిస్ట్‌ నేతలు పలు కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. ప్రతిపక్షాల ‘ఇండీ కూటమి’లో మాత్రం ఇరుపార్టీల(కాంగ్రెస్, లెఫ్ట్) నేతలు దిల్లీలో కూర్చొని బిస్కెట్లు, సమోసాలు తింటూ చాయ్‌ తాగుతారన్నారు. కేరళలో ఒకలా, దిల్లీలో మరోలా మాట్లాడే పార్టీలకు తగినబుద్ధి చెప్పాలని కేరళ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. కేరళలో బీజేపీకి డబుల్‌ డిజిట్‌ సీట్లు ఇవ్వాలన్నారు.

T Ramesh | 17:51 PM, Tue Feb 27, 2024

దిల్లీ లిక్కర్ స్కామ్: కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసు...

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్  డైరక్టరేట్(ED) ఎనిమిదోసారి నోటీసులు జారీ చేసింది. దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఏడుసార్లు సమన్లు పంపింది. ఈడీ తాఖీదులు భేఖాతరు చేసిన అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరుకావడం లేదు. దీంతో తాజాగా నోటీసులు జారీ చేసిన ఈడీ, మార్చి 4న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఈడీ ఇన్ని సార్లు తాఖీదులు ఇవ్వడం ఇదే మొదటిసారి.

ఈడీ, నవంబర్ 2న మొదటిసారి కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేయగా,  రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తమ అధినేతను అరెస్టు చేసి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వకుండా తమపై నింధలు వేసి తప్పించుకోవడం ఏంటని, ఆప్ అధినేతను బీజేపీ నిలదీసింది. సమన్లకు కేజ్రీవాల్ స్పందించకపోవడంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. మార్చి 16న ఈ పిటిషన్ విచారణకు రానుంది.

గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 22న నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో ఈ ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో తాఖీదులు పంపినా విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ తాజాగా ఎనిమిదో సారి నోటీసులు పంపింది.

T Ramesh | 15:06 PM, Tue Feb 27, 2024

రాహుల్ గాంధీ పోటీపై నో క్లారిటీ, అమేఠి, వయనాడ్ నుంచి కష్టమేనట...?

లోక్‌సభ ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా, కాంగ్రెస్ అగ్రనేతలు పోటీ చేసే స్థానాలపై స్పష్టత లేకపోవడంతో హస్తం శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఇండీ కూటమి పక్షాలతో సీట్ల పంపకాల లెక్కల పంచాయితీ కూడా ఓ పట్టాన తెగని పరిస్థితి. మరో వైపు ఆ పార్టీ అగ్రనేతలు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది కూడా అగమ్యగోచరంగా మారింది.

గతంలో ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సోనియాగాంధీ, ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో ఇప్పటి వరకు స్పష్టత లేదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓ చోట గెలిచిన రాహుల్, ఈ దఫా ఎన్నిచోట్ల, ఏ ఏ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.

గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ, అమేఠి(ఉత్తరప్రదేశ్), వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేయగా, ఈ సారి ఆ రెండు స్థానాల్లో పోటీపై ఇంకా డోలాయమానంలో ఉన్నారు. అమేఠిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిన రాహుల్, వయనాడ్ లో మాత్రం సీపీఐ అభ్యర్థిపై భారీ మెజారటీతో గెలిచారు. ఈ సారి వయనాడు నుంచి సీపీఐ మహిళ నేత పోటీ చేస్తున్నారు.

కేరళ లోని ఎల్డీఎఫ్ కూటమిలో ప్రధాని భాగస్వామిగా ఉన్న సీపీఐ ఈ సారి వయనాడులో పోటీ చేయబోతుంది. సీపీఐ అగ్రనేత యానీ రాజా వయనాడ్ నుంచి పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. దీంతో రాహుల్ గాంధీ మరో సీటు వెతుక్కోక తప్పనసరి పరిస్థితి నెలకొంది. అమేఠిలో పోటీకి  ఇండీ కూటమి లో భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ ఆసక్తి చూపుతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాహుల్ పోటీ చేస్తారనే విశ్లేషణలు ఉన్నాయి.  ఇండియన్ ముస్లింలీగ్, వయనాడ్ సీటు కోసం పట్టుబట్టింది. గతంలో కేరళలో రెండు స్థానాల్లో పోటీ చేసిన ఇండియన్ ముస్లిం లీగ్, ఈ సారి మూడో సీటుగా వయనాడ్ ను డిమాండ్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అలెప్పి నుంచి పోటీ చేస్తున్నారు. ఒకే రాష్ట్రం నుంచి ఇద్దరు అగ్రనేతలు పోటీ చేయడానికి బదులు రాహుల్ వేరే రాష్ట్రం నుంచి పోటీ చేస్తే పార్టీ మేలు జరుగుతుందనే ఆ పార్టీ వ్యూహమనే వాదన కూడా ఉంది.  రాయబరేలి నుంచి పోటీకి  గాంధీ కుటుంబానికి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఇష్టపడటం లేదని సమాచారం. 2019లో యూపీలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్నే గెలుచుకుంది. రాయబరేలీ నుంచి సోనియా ఒక్కరే  విజయం సాధించారు.

T Ramesh | 12:45 PM, Tue Feb 27, 2024

upload