రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ విద్యార్ధి సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ కొత్త రికార్డు సృష్టించింది. గతేడాది భారీస్థాయిలో సభ్యత్వాలు నమోదు చేసిన ఏబీవీపీ, ఈ యేడాది అంతకంటె ఎక్కువమందిని సభ్యులుగా చేర్చుకుంది. ఈ సంవత్సరం ఏబీవీపీలో ఏకంగా 55,12,470 మంది సభ్యత్వం స్వీకరించారు. దాంతో, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్ధి సంస్థగా ఉన్న తన రికార్డును తానే అధిగమించింది.
ఏబీవీపీ 70వ జాతీయ సదస్సు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో శుక్రవారం జరిగింది. ఆ సదస్సులో సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి యాజ్ఞవల్క్య శుక్లా ప్రసంగిస్తూ, కొత్త సభ్యత్వ రికార్డు గురించి వెల్లడించారు.
‘‘క్షేత్రస్థాయిలో ఏబీవీపీ నిరంతరంగా పనిచేస్తున్న తీరు విద్యార్ధుల విశ్వాసాన్ని చూరగొంది. దేశంలోని అన్ని విద్యాసంస్థలలోనూ విద్యార్ధుల సమస్యలను ప్రస్తావించడం, వాటి పరిష్కారం కోసం ప్రయత్నించి విజయాలు సాధించడంతో విద్యార్ధుల్లో ఏబీవీపీ మీద విశ్వాసం గణనీయంగా పెరిగింది. ఏబీవీపీ విద్యాసంస్థల్లో మహిళా సాధికారతకు, మహిళల భద్రతకూ కట్టుబడి ఉంది. ఏబీవీపీ ప్రయత్నాల వల్ల దేశంలోని విద్యాసంస్థల్లో మహిళలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది’’ అని యాజ్ఞవల్క్య శుక్లా వెల్లడించారు.