దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. అంతకుముందే కాంగ్రెస్ పార్టీ రాజకీయం మొదలుపెట్టేసింది. ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించాలని, ఆ ప్రదేశంలోనే అంత్యక్రియలు నిర్వహించాలనీ రాజకీయం మొదలుపెట్టింది.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరుగుతాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఆయనకు స్మారకం నిర్మించేందుకు స్థలం కేటాయించాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తమ అభ్యర్ధనను ప్రభుత్వం గౌరవించలేదని కాంగ్రెస్ ఆరోపణ చేసిన కొన్ని గంటలకే కేంద్ర ప్రభుత్వం ప్రకటన వచ్చింది. అయితే, నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు చేయాలన్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘‘శుక్రవారం ఉదయం మన్మోహన్ స్మారకానికి స్థలం కేటాయించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభుత్వాన్ని అర్ధించారు. క్యాబినెట్ సమావేశం తర్వాత హోంమంత్రి అమిత్ షా, మన్మోహన్ స్మారకం కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని వెల్లడించారు. కానీ దానికి ఒక ట్రస్ట్ ఏర్పడాలి, స్థలం ఎంపిక చేయాలి. ఆలోగా అంతిమ సంస్కారాలు, ఇతర లాంఛనాలు పూర్తిచేయవచ్చు. నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తాం’’ అని ప్రకటించారు.
ఆలోగానే కాంగ్రెస్ నాయకులు కేంద్రప్రభుత్వం మీద విమర్శలు గుప్పించేసారు. దేశపు మొట్టమొదటి సిక్కు ప్రధానమంత్రిని ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారంటూ అభాండాలు వేసారు. నిగమ్‌బోధ్ ఘాట్‌ల్ అంత్యక్రియలు నిర్వహించాలన్న నిర్ణయం పైన కూడా విమర్శలు చేసారు. మన్మోహన్ సింగ్‌ను ఎన్డీయే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవమానిస్తోంది అనేలా ప్రకటనలు చేసారు.
విచిత్రం ఏంటంటే, మన్మోహన్ సింగ్ రాజకీయ గురువు, ఆయన కంటె ముందు ప్రధానమంత్రిగా చేసిన పీవీ నరసింహారావును ఇదే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఆయన మరణించే సమయానికి కేంద్రంలో యూపీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆయన ఆర్థిక మంత్రిగా నియమించిన మన్మోహన్ సింగే ప్రధానిగా ఉన్నారు. అయినా ఆనాటి ప్రభుత్వం పీవీ స్మారకం కాదు కదా, కనీసం అంత్యక్రియలైనా ఢిల్లీలో జరగనీయకుండా అడ్డుకుంది. ఆయన పార్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి సైతం రానీయలేదు. పీవీ మరణించిన కొన్ని గంటలకే ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ పంపించేసారు. అక్కడ సైతం ఆయన అంత్యక్రియలు సరిగ్గా జరపలేదు. మృతదేహం పూర్తిగా కాలకముందే అక్కడ ఎవరూ లేకుండా వెళ్ళిపోయారు. చివరికి పీవీ భౌతిక దేహం సరిగ్గా కాలలేదన్న విమర్శలు సైతం తలెత్తాయి.
అలా, భారతదేశపు మొట్టమొదటి దక్షిణాది, మొట్టమొదటి తెలుగు ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మీద కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా వివక్ష చూపించింది. ఎందుకంటే ఆయన గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందని, మొట్టమొదటి కాంగ్రెస్ ప్రధానమంత్రి. సోనియాగాంధీ అడుగులకు మడుగులొత్తకుండా స్వతంత్రంగా వ్యవహరించారు. దేశం మేలు కోసం మాత్రమే పనిచేసారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసింది పీవీ నరసింహారావే. పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా కృషి చేసినప్పటికీ పీవీకి ఆ క్రెడిట్ ఏనాడూ ఇవ్వలేదు. ఆర్థిక సంస్కరణల ఫలితాల కీర్తిని సైతం తమ ఖాతాలో నిస్సిగ్గుగా వేసుకున్నారు. పీవీ శిష్యుడే అయిన మన్మోహన్ పదేళ్ళు ప్రధానిగా ఉన్నా, సోనియా మాటను కాదని పీవీకి ఢిల్లీలో స్మారకం నిర్మించే సాహసం చేయలేకపోయారు. చివరికి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక, 2015లో ఆయనకు ఢిల్లీలో స్మారకం నిర్మించారు. అంతేకాదు, 2024లో ఆయనకు భారతరత్న పురస్కారం ప్రదానం చేసింది కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వమే.
అంతలా మాజీ ప్రధానమంత్రిని, తమ పార్టీకే చెందిన అత్యుత్తమ శ్రేణి నాయకుణ్ణి అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ మీద ప్రేమ ఒలికిపోతున్నట్లు తెగ బాధ పడిపోతోంది. చిత్రమేమంటే ఇక్కడ మన్మోహన్‌కు జరగుతున్న అవమానం ఏమీ లేదు. ఆయనకు ఢిల్లీలో స్మారకం నిర్మిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోంది. వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అవేవీ పట్టించుకోకుండా తాము చెప్పిన చోట, తాము చెప్పిన విధంగా చేయకపోతే మన్మోహన్ సింగ్‌ను అవమానిస్తున్నారంటూ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం చీదర పుట్టిస్తోంది.