Sunday, April 28, 2024

Logo
Loading...

క్రీడా వార్తలు

Loading...
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ : విజేతగా నిలిచిన బెలారస్ స్టార్

    ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ : విజేతగా నిలిచిన బెలారస్ స్టార్

    బెలారస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అరినా సబలెంక ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఫైన్లల్లో అరినా చైనా క్రీడాకారిణి జెంగ్ కిన్వెన్‌తో పోరాడి గెలిచారు. సబలెంక 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో గెలిచి టైటిల్ గెలుచుకుంది. తొలి సెట్‌లో జెంగ్ పోరాడినా, తరవాత సబలెంక ముందు నిలవలేకపోయింది. 2013 నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన మొదటి మహిళగా సబలెంక నిలిచారు.

    లీ తరవాత దశాబ్ధకాలంలో మొదటిసారి గ్రాండ్‌స్లామ్ ఆడిన తొలి చైనా ప్లేయర్ జెంగ్ కావడం విశేషం. 21 ఏళ్ల జంగ్ సబలెంక ముందు నిలవలేకపోయింది. సెరెనా తరవాత వరుసగా రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు (australian open title) నెగ్గి సబలెంక రికార్డు నెలకొల్పారు.

    K Venkateswara Rao | 16:57 PM, Sat Jan 27, 2024

  • చదరంగంలో భారత నెంబర్ వన్ ఆటగాడిగా ప్రజ్ఞానంద

    Praggnananda sets record and becomes India’s top ranker in Chess

    చదరంగపు చిచ్చరపిడుగు ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చదరంగంలో భారత నెంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో అతను విశ్వనాథన్ ఆనంద్‌ను కూడా అధిగమించాడు.

    టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్‌ నాలుగో రౌండ్‌లో వరల్డ్ చాంపియన్ అయిన చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించి, ప్రజ్ఞానంద ఈ ఘనత సాధించాడు. భారతదేశంలో చదరంగ క్రీడాకారుల్లో అగ్రస్థానానికి ఎగబాకాడు.

    ప్రస్తుతం ప్రజ్ఞానంద ఫిడే ర్యాంకింగ్స్‌లో 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో విషీని ప్రజ్ఞానంద అధిగమించినట్లయింది. అలాగే, భారతదేశపు చదరంగ క్రీడాకారుల్లో అగ్రస్థానంలో నిలిచినట్లయింది. పైగా, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద అవతరించాడు.

    అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ప్రజ్ఞానంద సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ఈ అద్భుతమైన విజయం దేశానికి గర్వకారణమని అభినందించారు. గతేడాది నుంచీ ప్రజ్ఞానందకు అదానీ గ్రూప్ సహాయ సహకారాలు అందిస్తున్నసంగతి తెలిసిందే.

    P Phaneendra | 13:02 PM, Wed Jan 17, 2024

  • బజరంగ్, సాక్షి, వినేష్‌లకు వ్యతిరేకంగా యువ మల్లయోధుల నిరసన

    Young wrestlers protest against Bajrang, Sakshi and Vinesh

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు (Wrestling Federation of India) వ్యతిరేకంగా పోరాడుతున్న మల్లయోధులు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్‌లకు (Bajrang Punia, Sakshi Malik, Vinesh Phogat) నిరసన సెగ తగిలింది. రెజ్లింగ్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలనూ వాళ్ళు అడ్డుకుంటూ తమ భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ వందలాది యువ రెజ్లర్లు నిరసన ప్రదర్శన (Young Wrestlers Protest) చేపట్టారు.

    వందల సంఖ్యలో యువ మల్లయోధులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీనియర్ రెజ్లర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దేశంలో రెజ్లింగ్ క్రీడ పరిస్థితిని నాశనం చేసారంటూ బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

    ‘‘ఆ ముగ్గురూ రెజ్లింగ్ ఫెడరేషన్ తాము కోరుకున్నట్టు నడవాలని భావిస్తున్నారు. ఫెడరేషన్ ఎన్నికలు జరిగాయి. తమ కుటుంబం నుంచి ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయబోరని ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ (Brijbhushan Singh) ప్రకటించారు. ఇద్దరు అభ్యర్ధులు పోటీపడ్డారు. అయితే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధి బ్రిజ్‌భూషణ్ అనుచరుడు అనే ఉద్దేశంతో వాళ్ళు (బజరంగ్, సాక్షి, వినేష్)  ఎన్నిక మళ్ళీ జరగాలి అనుకుంటున్నారు. వాళ్ళు దేశంలో రెజ్లింగ్ క్రీడని, మా భవిష్యత్తునీ నాశనం చేసారు. మేము ఏడాది నుంచీ ప్రాక్టీస్ చేస్తున్నాం. రోజూ తెల్లవారక ముందే అభ్యాసం ప్రారంభిస్తున్నాం. కంటినిండా నిద్రపోకుండా, సరిగ్గా తిననైనా తినకుండా నానా అవస్థలూ పడుతున్నాం. ఎందుకంటే మేం ప్రాక్టీస్ మీదనే ధ్యాస పెట్టాం. కానీ వాళ్ళు (బజరంగ్, సాక్షి, వినేష్) వాళ్ళ నిరసనలతో మొత్తం నాశనం చేసారు. ఇంక రెజ్లింగ్ క్రీడను మళ్ళీ మొదలుపెట్టాలి’’ అంటూ నిధి అనే క్రీడాకారిణి తన ఆవేదన వ్యక్తం చేసింది.

    రాబోయే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ, వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ల కోసం సీనియర్ రెజ్లర్లకు జాతీయ శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తామని  రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్‌హాక్‌ కమిటీ సోమవారం ప్రకటించింది. దానితో పాటుగా రెజ్లింగ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌ కూడా త్వరలో నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పోటీ ఫిబ్రవరి 2 నుంచి 5 వరకూ జైపూర్‌లో జరుగుతుంది. అందులో భాగంగా సీనియర్ ఫ్రీస్టైల్, గ్రీకో రోమన్, మహిళా కేటగిరీల్లో పోటీలు జరుగుతాయి.

    ఆ ఈవెంట్ తర్వాత జాతీయ శిక్షణా శిబిరం ఫిబ్రవరి 9 నుంచీ మొదలవుతుంది. పురుషుల క్యాంప్ సోనేపట్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో జరుగుతుంది. మహిళల క్యాంప్ పాటియాలాలోని సాయ్ సెంటర్‌లో జరుగుతుంది. పారిస్ ఒలింపిక్స్ మొదలయ్యే వరకూ ఆ క్యాంప్ కొనసాగుతుంది.

    ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ టోర్నమెంట్స్‌లో తొలుతగా ఆసియన్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ జరుగుతుంది. ఏప్రిల్ 19 నుంచి 21 వరకూ కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్ నగరంలో ఆ పోటీలు నిర్వహిస్తారు. వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌లో మే 9 నుంచి 12 వరకూ జరుగుతుంది. ఇంకా, సీనియర్ ఆసియన్ ఛాంపియన్‌షిప్స్ ఏప్రిల్ 11 నుంచి 16 వరకూ కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్‌లో జరుగుతాయి.

    సీనియర్ రెజ్లింగ్ క్రీడాకారుల నిరసనల తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ అనుచరుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) విజయం సాధించాడు. దాంతో బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్ మళ్ళీ తమ నిరసనలు మొదలుపెట్టారు. తమకు వచ్చిన అవార్డులు వెనక్కి ఇచ్చేసారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేంద్రక్రీడా శాఖ రెజ్లింగ్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసింది. దాని స్థానంలో అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఆ తాత్కాలిక కమిటీయే రెజ్లింగ్ వ్యవహారాలు చూస్తోంది.

    P Phaneendra | 18:38 PM, Wed Jan 03, 2024

క్రికెట్

  • ఆసీస్‌తో టీ-20 సీరీస్‌కు భారతజట్టు ప్రకటన

    BCCI ANNOUNCES INDIA SQUAD FOR T-20 SERIES WITH AUSTRALIA

    భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 23న మొదలవబోయే టీ-20 సీరీస్‌కు బీసీసీఐ మన దేశపు జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ సంరంభం ముగిసిన కొద్దిరోజులకే పొట్టి క్రికెట్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి.

    ఐదు మ్యాచ్‌ల ఈ సీరీస్‌కి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తాడు. హార్దిక్ పాండ్య గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్‌గా మొదటి మూడు మ్యాచ్‌లకు రుతురాజ్ గైక్వాడ్, చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ ఉంటారు.

    భారత జట్టులో వారు ముగ్గురితో పాటు ఇషాన్ కిషన్, యశస్వి జైపాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ ఉన్నారు.

     మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో నవంబర్ 23న జరగనుంది. 26న కేరళ తిరువనంతపురంలో రెండో మ్యాచ్ జరుగుతుంది. మూడవది గువాహటిలో 29వ తేదీన ఆడతారు. డిసెంబర్1న రాయ్‌పూర్‌, డిసెంబర్ 3న బెంగళూరు నగరాల్లో చివరి రెండు మ్యాచ్‌లూ జరుగుతాయి.

     వరల్డ్ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా సేన అద్భుత ప్రదర్శన చూపింది. ఆతిథ్య భారత జట్టుపై ఘనవిజయం సాధించింది. దాంతో ఈ సీరీస్ గెలుచుకోవడం భారతదేశానికి తప్పనిసరిగా మారింది. 

    P Phaneendra | 10:33 AM, Tue Nov 21, 2023

  • దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం : బంగ్లా-శ్రీలంక మ్యాచ్ అనుమానమే

    ప్రపంచకప్ వన్డే(ODI)ల్లో భారత్ జోరు కొనసాగిస్తోంది. వరుసగా ఎనిమిదో వన్డే కూడా సొంతం చేసుకుంది. ఆదివారం నాడు కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత జట్టు 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 121 బంతుల్లో 101 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 87 బంతుల్లో 77 పరుగులు, రోహిత్ శర్మ 40, జడేజా 29 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ (virat kohli) అందుకున్నారు. వన్డేల్లో 49 సెంచరీలు చేసిన కోహ్లీ, సచిన్ రికార్డును సమం చేశాడు.

    327 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లకే ఆలౌటైంది. జడేజా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టును కుప్పకూల్చాడు. షమి 2, కుల్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా జట్టు 83 పరుగులకే ఆలౌటైంది. వచ్చే ఆదివారం చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది.

    సోమవారం ఢిల్లీలో బంగ్లాదేశ్, శ్రీలంక (bangladesh VS Srilanka ) మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై కాలుష్యం మబ్బులు కమ్ముకున్నాయి. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీలంక జట్టు నిన్న ఇండోర్స్‌కే పరిమితం కాగా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాస్కులు ధరించి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ప్రాక్టీస్ చేశారు.

    K Venkateswara Rao | 09:41 AM, Mon Nov 06, 2023

  • CWC SA vs NZ: న్యూజీలాండ్‌ను చితగ్గొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఆఫ్రికా

    Cricket World Cup Match South Africa Vs New Zealand

     న్యూజీలాండ్‌తో పుణేలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టోర్నీలో ఆరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మళ్ళీ దక్కించుకుంది. న్యూజీలాండ్ జట్టు వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయి సెమీస్‌కు చేరుకోడానికీ చెమటోడ్చాల్సిన స్థితికి పడిపోయింది.

     టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 357 పరుగులు చేసింది. డసెన్ 133, డికాక్ 114 పరుగులు సాధించారు. డికాక్ అయితే ప్రస్తుత వరల్డ్ కప్‌లో 4 సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

     దక్షిణాఫ్రికా బౌలింగ్‌కు న్యూజీలాండ్ పూర్తిగా లొంగిపోయింది. మూడో ఓవర్లో కాన్వే (2) ఔట్ అవడంతో కివీస్ పతనం మొదలైంది. రచిన్ కూడా 9 పరుగులకే ఔట్ అయిపోయాడు. 45 పరుగులకు 2 వికెట్ల నష్టంలో ఉన్న కివీస్, 100 పరుగులు పూర్తయేసరికి ఏకంగా 6 వికెట్లు నష్టపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లను న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ప్రతిఘటించలేకపోయారు. ఆ సమయంలో ఫిలిప్స్ ధాటిగా ఆడి 60 పరుగులు సాధించడంతో ఆ మాత్రం స్కోరయినా నమోదయింది. మొత్తం మీద 35.3 ఓవర్లలో కేవలం 167 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.

    దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీసాడు. మార్కో జాన్సన్ 31 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. కొయెట్జీ 41 పరుగులిచ్చి 2 వికెట్లు తీసాడు. 133 పరుగులు సాధించిన వాండర్ డసెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

    ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 6 గెలిచి, 2.290 నెట్‌రన్‌రేట్‌తో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. న్యూజీలాండ్ వరుసగా మూడో ఓటమితో పట్టికలో దిగజారింది. ఆడిన 7 మ్యాచ్‌లలో 4 గెలిచి పటిష్టంగా ఉన్న కివీస్ జట్టు, తర్వాత వరుసగా 3 మ్యాచ్‌లూ ఓడిపోయి, 4వ స్థానానికి చేరుకుంది.


    P Phaneendra | 10:42 AM, Thu Nov 02, 2023

  • Cricket World Cup: Afg Vs SL: శ్రీలంకపై ఆప్ఘనిస్తాన్ సంచలన విజయం

    Afghanistan defeated Sri Lanka 


    ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం పుణేలో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ జట్టు శ్రీలంకపై సంచలన విజయం నమోదు చేసింది. 7 వికెట్ల ఆధిక్యంతో లంకేయులను మట్టి కరిపించింది.

    టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఆప్ఘనిస్తాన్ పేస్ బౌలర్ ఫారూఖీ, స్పిన్ బౌలర్లు ముజీబ్, రషీద్ ఖాన్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్ ముందునుంచీ తడబడుతూనే ఉన్నారు. టీమ్ స్కోర్ 22 పరుగుల దగ్గర ఉండగా ఆరో ఓవర్లో కరుణరత్నె 15 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔట్ అయ్యాడు. తర్వాత ఓపెనర్ నిశాంక, కుశల్ మెండిస్ కొంతసేపు బాగానే ఆడారు. రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించి, నిశాంక 46 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. తర్వాత కుశల్ మెండిస్, సమరవిక్రమ జోడీ కొంతసేపు బాగానే నిలదొక్కుకుంది. ఆప్ఘన్ బౌలర్ ముజీబ్ రెండు వరుస ఓవర్లలో నిశాంక, సమరవిక్రమలను ఔట్ చేసాడు. అక్కడినుంచీ శ్రీలంక క్రమంగా వికెట్లు కోల్పోయింది. 40 ఓవర్లు ముగిసేసరికి 185 పరుగులతో కష్టాల్లో ఉన్న లంక జట్టును మాథ్యూస్, తీక్షణ కొద్దిసేపు నిలబెట్టగలిగారు. 8వ వికెట్‌కు 45 పరుగులు జోడించి, స్కోర్ 230కి చేర్చారు. తర్వాత లంక జట్టు కేవలం 11 పరుగులు చేసి మిగిలిన రెండు వికెట్లను కోల్పోయింది.

    తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆప్ఘనిస్తాన్, ఆట మొదలవుతుండగానే ఓపెనర్ గుర్బాజ్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్, రహమత్ షాతో కలిసి జట్టు స్కోరును 73కు తీసుకువెళ్ళాడు. 17వ ఓవర్లో 39 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఇబ్రహీం పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత వచ్చిన హష్మతుల్లాతో కలిసి రహమత్ షా నిలకడగా పరుగులు తీసాడు. 28వ ఓవర్లో టీమ్ స్కోర్ 131 పరుగుల వద్ద రహమత్ షా 62 పరుగుల వ్యక్తిగత స్కోరుతో పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అజ్మతుల్లా ఒమర్‌జాయ్ మొదటినుంచీ ధాటిగా ఆడాడు. అప్పటికే నిలదొక్కుకున్న హష్మతుల్లాతో కలిసి చెలరేగిపోయాడు. వారిద్దరూ కలిసి 93 బంతుల్లో వంద పరుగులు సాధించారు. అజ్మతుల్లా 50 బంతుల్లో 50 పరుగులు చేసాడు. అప్పటికే హష్మతుల్లా హాఫ్ సెంచరీ పూర్తయింది. హష్మతుల్లా 58, అజ్మతుల్లా 73 వ్యక్తిగత స్కోర్ సాధించి... 45.2 ఓవర్లలోనే 242 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసారు. శ్రీలంక బౌలర్లు ఏ దశలోనూ ఆప్ఘనిస్తాన్‌ను నియంత్రించలేకపోయారు.

    P Phaneendra | 10:43 AM, Tue Oct 31, 2023

ఫుట్‌బాల్