కివీస్ పై విజయం సాధించిన భారత జట్టు
మూడోసారి ఛాంపియన్స్ విజేతగా టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ లో కివీస్ పై భారత్ విజయం సాధించింది. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ వేదికగా జరిగాయి. సెమీ ఫైనల్ లో ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు వెళ్ళిన భారత్, కివీస్ పై అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించి టైటిల్ విజేతగా అవతరించింది.
ఫైనల్ లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు సాధించింది. న్యూజీలాండ్ విధించిన లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్ల నష్టానికి 49 ఓవర్లలో 254 పరుగులు సాధించి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఏ మాత్రం తీసిపోని ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరులో భారత్ కూసంత కూడా తడబడలేదు. నింపాదిగా ఆడి ఘన విజయం సాధించి మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీని దేశానికి అందించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ ఇన్నింగ్స్ కీలకంగా నిలిచింది. రోహిత్ 83 బంతుల్లో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. శుభమన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ అద్భుతంగా ఆడాడు. గిల్ 50 బంతుల్లో 31 పరుగులు చేసి వెనుదిరిగాడు.

విరాట్ కోహ్లీ రెండు బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కలిసి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. శ్రేయస్ 62
బంతుల్లో 48 పరుగులు చేశాడు. అక్షర్ 40 బంతులు ఎదుర్కొని 29 పరుగులు చేసి వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ మరోసారి చివరివరకు క్రీజులో ఉండి భారత్ కు విజయాన్ని అందించాడు. 33 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాండ్యా మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 18 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా ఆరు బంతుల్లో 9 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర, జేమీసన్ లకు చెరొక వికెట్ దక్కగా మిచెల్ శాంథర్, మైఖేల్ బ్రేస్ వెల్ చెరో రెండు వికెట్లు తీశారు.
న్యూజీలాండ్ ఇన్నింగ్స్ లో డారిల్(63), బ్రాస్‌వెల్(53*) అర్ధశతకాలతో రాణించారు. రచిన్(37), ఫిలిప్స్(34) లను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. కెప్టెన్ శాంట్నర్(8) రనౌట్ గా వెనుదిరిగాడు.
భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా షమీ, జడేజా ఒక్కో వికెట్ తీశారు.
