Friday, May 10, 2024

Logo
Loading...
google-add

ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించిన ఐఎంఎఫ్

P Phaneendra | 11:46 AM, Sat Apr 20, 2024

IMF lauds India’s fiscal discipline amid election year

ఆర్థిక సుస్థిరత విషయంలో భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ అభినందించింది. ఎన్నికలు జరుగుతున్న సంవత్సరం అయినప్పటికీ ఆర్థిక పటుత్వం, తిరిగి పుంజుకునే శక్తి కలిగి ఉండడాన్ని ప్రశంసించింది.

ఐఎంఎఫ్ ఆసియా పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ భారతదేశం ఆర్థికంగా పురోగమిస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 6.8శాతం వృద్ధి రేటు నమోదవడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండడం, స్థూల ఆర్థిక విధానాలు విస్తృతస్థాయిలో అమలవుతుండడం దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సూచనలని ఆయన వివరించారు. నిరంతర పురోగతి, సంక్షేమం సాధించే దిశగా బడ్జెట్‌కు కట్టుబడి ఉండడం, అదికూడా ఎన్నికల వేళ అదుపులో ఉండడం కీలకమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నో ఆర్థిక అడ్డంకులు ఉన్నప్పటికీ భారతదేశం ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా తన ప్రత్యేకత నిలబెట్టుకుంది.  తన పురోగతితో ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం కారణంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే విధమైన ప్రగతిని భారత్ నిలకడగా సాధించగలుగుతుందని కృష్ణ శ్రీనివాసన్ అంచనా వేసారు. భారతదేశపు ఆర్థిక నియంత్రణను ఐఎంఎఫ్ సమర్థించడం మన దేశపు ఆర్థిక నిల్వల పటిష్టతను, స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్నీ గుర్తించినట్లే. దేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణగా ఉండడం ద్వారా నిలకడగా పురోగమిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

భారతదేశపు విదేశీమారకద్రవ్య నిల్వలు ఏప్రిల్ 5తో ముగిసే వారం నాటికి రికార్డు స్థాయిలో 648.562 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇది ఇప్పటివరకూ భారతదేశపు గరిష్ట స్థాయి. విదేశీమారకద్రవ్య నిల్వల పెరుగుదల... ప్రపంచంలో భారతదేశపు ఆర్థికవ్యవస్థ సుస్థిర స్థాయిని చేరుకుంది, ఈ సుస్థిరత మరింత పెరుగుతుంది అనడానికి నిదర్శనం.   

వస్తువుల ధరల్లో ఒడుదొడుకులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల వంటి స్వల్పకాలిక రిస్కులను భారత్ తట్టుకోగలదని ఐఎంఎఫ్ భావిస్తోంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వంటి దీర్ఘకాలిక ప్రమాదాల విషయంలో భారత్ మరింత జాగ్రత్తగా ఉండాలని కృష్ణశ్రీనివాసన్ సూచించారు. ఆ సవాళ్ళ సంగతి ఎలా ఉన్నా, భారత్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడంలో ప్రబలమైన శక్తిగా అవతరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 6.8 ఉండవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌-డిపిఐలో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని ఐఎంఎఫ్ గుర్తించి అభినందించింది. దానివల్ల ఉత్పాదకత పెరిగి, ప్రజలు బాగా పనిచేస్తారని, సృజనాత్మకంగా కొత్తకొత్త ఆలోచనలతో ముందుకొస్తారనీ ఆమె అంచనా వేసారు. ఆర్థిక సమీకరణను ప్రచారం చేయడం వల్ల ప్రతీఒక్కరికీ నగదు అందుబాటులో ఉంటుంది. డిపిఐ వల్ల ప్రభుత్వరంగ సంస్థల్లో సమర్థత పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి మరింత ఎదుగుతుంది.

ప్రతీయేటా సుమారు కోటిన్నర మంది ప్రజలు అందుబాటులోకి వస్తుండడం ద్వారా భారతదేశపు యువ జనాభా దేశ ఆర్థికాభివృద్ధి అవకాశాలకు దోహదం చేస్తోంది. అయితే ఆ యువశక్తి పూర్తి సామర్థ్యాన్ని వినియోగంలోకి తీసుకురావడం చాలా ముఖ్యం. దానికి విద్య, వైద్యం, లేబర్ మార్కెట్ రంగాల్లో సమగ్ర సంస్కరణలు రావలసిన అవసరం ఉందని ఐఎంఎఫ్ సూచించింది. యువతరానికి కృత్రిమ మేధ వంటి సాంకేతికతల్లో నైపుణ్యాలు పెంచాలి. అప్పుడే సరైన నైపుణ్యాలు కలిగిన యువతరం జాబ్‌మార్కెట్‌లో అందుబాటులో ఉండగలదు.

మానవ వనరుల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, లేబర్ మార్కెట్ సంస్కరణలను కూడా అమల్లోకి తేవాలని ఐఎంఎఫ్ ప్రముఖంగా సూచించింది. దానివల్ల సామర్థ్యం పెరిగి, బ్యురోక్రటిక్ సమస్యలు తగ్గుతాయని వివరిస్తోంది. నియమ నిబంధనలను వ్యవస్థీకరించడం, వాణిజ్యనియంత్రణలను తగ్గించడం ద్వారా భారత్‌లో వాణిజ్య అవకాశాలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయడం ముఖ్యం. అప్పుడు దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో నిదానంగా జరిగే పేపర్‌వర్క్, యువజనాభాను సమర్థంగా వాడుకోలేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించుకుంటే సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించడం సులభమే.  

ప్రస్తుతం భారత్ సాధిస్తున్న 6.5 శాతం అభివృద్ధి రేటు ప్రోత్సాహకరంగానే ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం, మరింత పెంచుకోవడం దిశగా ప్రయత్నాలు కొనసాగించాలి. అప్పుడే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నిలకడగా ఎదుగుదల సాధించగలదని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add