Friday, May 10, 2024

Logo
Loading...
google-add

బజరంగ్, సాక్షి, వినేష్‌లకు వ్యతిరేకంగా యువ మల్లయోధుల నిరసన

P Phaneendra | 18:38 PM, Wed Jan 03, 2024

Young wrestlers protest against Bajrang, Sakshi and Vinesh

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు (Wrestling Federation of India) వ్యతిరేకంగా పోరాడుతున్న మల్లయోధులు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్‌లకు (Bajrang Punia, Sakshi Malik, Vinesh Phogat) నిరసన సెగ తగిలింది. రెజ్లింగ్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలనూ వాళ్ళు అడ్డుకుంటూ తమ భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ వందలాది యువ రెజ్లర్లు నిరసన ప్రదర్శన (Young Wrestlers Protest) చేపట్టారు.

వందల సంఖ్యలో యువ మల్లయోధులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీనియర్ రెజ్లర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దేశంలో రెజ్లింగ్ క్రీడ పరిస్థితిని నాశనం చేసారంటూ బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.

‘‘ఆ ముగ్గురూ రెజ్లింగ్ ఫెడరేషన్ తాము కోరుకున్నట్టు నడవాలని భావిస్తున్నారు. ఫెడరేషన్ ఎన్నికలు జరిగాయి. తమ కుటుంబం నుంచి ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయబోరని ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ (Brijbhushan Singh) ప్రకటించారు. ఇద్దరు అభ్యర్ధులు పోటీపడ్డారు. అయితే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధి బ్రిజ్‌భూషణ్ అనుచరుడు అనే ఉద్దేశంతో వాళ్ళు (బజరంగ్, సాక్షి, వినేష్)  ఎన్నిక మళ్ళీ జరగాలి అనుకుంటున్నారు. వాళ్ళు దేశంలో రెజ్లింగ్ క్రీడని, మా భవిష్యత్తునీ నాశనం చేసారు. మేము ఏడాది నుంచీ ప్రాక్టీస్ చేస్తున్నాం. రోజూ తెల్లవారక ముందే అభ్యాసం ప్రారంభిస్తున్నాం. కంటినిండా నిద్రపోకుండా, సరిగ్గా తిననైనా తినకుండా నానా అవస్థలూ పడుతున్నాం. ఎందుకంటే మేం ప్రాక్టీస్ మీదనే ధ్యాస పెట్టాం. కానీ వాళ్ళు (బజరంగ్, సాక్షి, వినేష్) వాళ్ళ నిరసనలతో మొత్తం నాశనం చేసారు. ఇంక రెజ్లింగ్ క్రీడను మళ్ళీ మొదలుపెట్టాలి’’ అంటూ నిధి అనే క్రీడాకారిణి తన ఆవేదన వ్యక్తం చేసింది.

రాబోయే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ, వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ల కోసం సీనియర్ రెజ్లర్లకు జాతీయ శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తామని  రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్‌హాక్‌ కమిటీ సోమవారం ప్రకటించింది. దానితో పాటుగా రెజ్లింగ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌ కూడా త్వరలో నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పోటీ ఫిబ్రవరి 2 నుంచి 5 వరకూ జైపూర్‌లో జరుగుతుంది. అందులో భాగంగా సీనియర్ ఫ్రీస్టైల్, గ్రీకో రోమన్, మహిళా కేటగిరీల్లో పోటీలు జరుగుతాయి.

ఆ ఈవెంట్ తర్వాత జాతీయ శిక్షణా శిబిరం ఫిబ్రవరి 9 నుంచీ మొదలవుతుంది. పురుషుల క్యాంప్ సోనేపట్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్‌లో జరుగుతుంది. మహిళల క్యాంప్ పాటియాలాలోని సాయ్ సెంటర్‌లో జరుగుతుంది. పారిస్ ఒలింపిక్స్ మొదలయ్యే వరకూ ఆ క్యాంప్ కొనసాగుతుంది.

ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ టోర్నమెంట్స్‌లో తొలుతగా ఆసియన్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ జరుగుతుంది. ఏప్రిల్ 19 నుంచి 21 వరకూ కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్ నగరంలో ఆ పోటీలు నిర్వహిస్తారు. వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌లో మే 9 నుంచి 12 వరకూ జరుగుతుంది. ఇంకా, సీనియర్ ఆసియన్ ఛాంపియన్‌షిప్స్ ఏప్రిల్ 11 నుంచి 16 వరకూ కిర్గిజిస్తాన్‌లోని బిష్కెక్‌లో జరుగుతాయి.

సీనియర్ రెజ్లింగ్ క్రీడాకారుల నిరసనల తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ అనుచరుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) విజయం సాధించాడు. దాంతో బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్ మళ్ళీ తమ నిరసనలు మొదలుపెట్టారు. తమకు వచ్చిన అవార్డులు వెనక్కి ఇచ్చేసారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేంద్రక్రీడా శాఖ రెజ్లింగ్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసింది. దాని స్థానంలో అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఆ తాత్కాలిక కమిటీయే రెజ్లింగ్ వ్యవహారాలు చూస్తోంది.

  • Trending Tag

  • No Trending Add This News
google-add
google-add
google-add

క్రికెట్

google-add
google-add
google-add