Friday, May 10, 2024

Logo
Loading...
google-add

Asian Games: మరో మూడు స్వర్ణాలతో 107 పతకాలు సాధించిన భారత్

P Phaneendra | 17:09 PM, Sat Oct 07, 2023

రెజ్లింగ్ 86కేజీల ఫ్రీస్టైల్ పురుషుల కేటగిరీ ఫైనల్లో దీపక్ పూనియా రజతపతకంతో సరిపెట్టుకున్నాడు. ఇరాన్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ హసన్ యజ్దానీతో తలపడ్డాడు. అయితే ఏమాత్రం ప్రతిఘటించలేకపోయాడు. 0-10 తేడాతో ఓటమి పాలయ్యాడు. రెండోస్థానానికి పరిమితమయ్యాడు.

కబడ్డీ పురుషుల ఫైనల్లో భారత్-ఇరాన్ జట్లు తలపడ్డాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇరాన్‌ను భారత్ ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఇరుజట్లూ సమఉజ్జీలుగా నిలవడంతో మ్యాచ్‌ ఆఖరి క్షణం వరకూ ఉత్కంఠభరితంగా జరిగింది. రెండుజట్లూ 28-28 పాయింట్లు సాధించి సమానంగా ఉన్న దశలో, భారత క్రీడాకారుడు పవన్ రెయిడ్ చేసాడు. దాంతో భారత్ 4 పాయింట్లు క్లెయిమ్ చేసుకుంది. అయితే, దానికి ఇరాన్ అభ్యంతరం పలికింది. పవన్ రెయిడ్‌ను తాము అడ్డుకున్నందున తమకు ఒక పాయింట్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. రెఫరీ అలాగే పాయింట్లు ఇచ్చారు. ఆ దశలో వివాదం చెలరేగడంతో మ్యాచ్ గంటపాటు సస్పెండ్ అయింది. తర్వాత నవీన్ కుమార్ తన రెయిడ్‌ను విజయవంతంగా పూర్తి చేసి భారత్ ఖాతాలో మరొక పాయింట్ జోడించడంతో, మన జట్టు విజేతగా నిలిచింది.

ఆసియన్ గేమ్స్‌లో తొలిసారి నిర్వహిస్తున్నక్రికెట్ ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డం పడ్డాడు. అయితే ర్యాంకింగ్‌లో మెరుగ్గా ఉన్న భారత్‌కు స్వర్ణం, ఆప్ఘనిస్తాన్‌కు రజతం ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆటను నిలిపివేసారు. మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా పతకాలు ప్రకటించారు.

బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్ కేటగిరీలో భారత్ మొట్టమొదటిసారి స్వర్ణపతకం గెలిచింది. సాయిసాత్విక్‌రాజ్-చిరాగ్ శెట్టి జంట అద్భుతంగా ఆడి విజయం సాధించారు. దక్షిణ కొరియాకు చెందిన సోల్గూ చోయ్-వోన్‌హో కిమ్‌ జంటను రెండు వరుస సెట్లలో ఓడించారు. 57 నిమిషాలలోనే 21-18, 21-16 పాయింట్లతో ఆధిక్యం సాధించి విజయం కైవసం చేసుకున్నారు. ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాడ్మింటన్ జంటగా చరిత్ర సృష్టించారు.

చదరంగంలో పురుషులు, మహిళల టీమ్ ఈవెంట్లలో భారత జట్లు రాణించాయి, రెండు జట్లూ రజత పతకాలు గెలుచుకున్నాయి.

మహిళల హాకీలో భారతజట్టు జపాన్‌ను ఓడించి కాంస్యపతకం సొంతం చేసుకుంది.

దీంతో  భారత జట్టు 28 స్వర్ణ పతకాలు, 38 రజత పతకాలు, 41 కాంస్య పతకాలతో మొత్తం 107 పతకాలు సాధించింది.

  • Trending Tag

  • No Trending Add This News
google-add
google-add
google-add

క్రికెట్

google-add
google-add
google-add

భారతీయం

google-add
google-add