Friday, May 10, 2024

Logo
Loading...
google-add

జన గణ మనతో లక్ష గొంతులు ఒక్కటై

Editor | 11:53 AM, Sun Oct 15, 2023

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ అంటేనే కోట్లాది భారతీయుల్లో ఉత్కంఠ. ఇక మ్యాచ్ లో విజయమంటే..అందునా ప్రపంచకప్ లో అయితే...ఆ ఆనందానికి ఆకాశమే హద్దవుతుంది. ఇలాంటి వాతావరణమే శనివారం అహ్మదాబాద్ స్టేడియంలో చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా పేరుగాంచిన ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియం లో దాయాదిపై అటు బౌలింగ్, బ్యాటింగ్ లో భారత జట్టు ఆధిపత్యం కనబరిచింది. అఖండ విజయాన్ని అందించిన సమయంలో స్టేడియంలోని లక్షగొంతులు ఒక్కటయ్యాయి. మదినిండా దేశభక్తితో జాతీయ గీతాలపన చేశాయి. నిలువెల్లా జాతీయభావంతో జనగణమన..అంటూ లక్ష గొంతులు ఆలపించగా మోదీ స్టేడియం 52 సెకన్లపాటు ఓలలాడింది.

టీమిండియా జెర్సీలు, టోపీలు, భారత్ పతాక మేకప్ ధారులతో గ్యాలరీ నీలిసంద్రాన్ని తలపించింది. అటు టీవీల ముందు కూర్చున్న వారు సైతం ఇదే అనుభూతికి లోనయ్యారు. పాక్ ఆటగాళ్లు ఔటయినప్పుడు, మన ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు భారత్ మాతాకీ జై.. జై భారత్-జైజై భారత్ అంటూ అభిమానులు చేసిన హర్షధ్వానాలు దేశభక్తికి ప్రతీకగా నిలిచాయి. ఈ విజయం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టు ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచకప్ లో పాక్ పై ఇది ఎనిమిదో విజయమన్నారు. ఈ గెలుపు చారిత్రకమన్న ఆయన ఇదే పరంపర మునుముందూ కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఎన్నారైలు సైతం...

భారత్ -పాక్ మ్యాచ్ అంటే దేశంలోనే కాదు...విదేశాల్లో ఉన్న భారతీయులు, ఎన్నారైలకూ ఆసక్తే. శనివారం జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ను తిలకించేందుకు అమెరికా, న్యూజిలాండ్ , దుబాయ్ తోపాటు పలు దేశాలనుంచి భారతీయులు, ఎన్నారైలు, అభిమానులు స్టేడియంలోకి అడుగుపెట్టేందుకు ఆత్రంగా ఎదురుచూశారు. ఆటను తిలకించేందుకు ఒకరోజు ముందే అహ్మదాబాద్ చేరుకున్నారు. భారత్ కు మద్దతుగా టీమిండియా జెర్సీలు ధరించారు. అటు పాకిస్తాన్ నుంచి అయిదుగురు పాత్రికేయులు సైతం హాజరయ్యారు. మ్యాచ్ కున్న డిమాండ్ నేపథ్యంలో అహ్మదాబాద్ నగరంలోని హోటళ్ల గిరాకీ తారస్థాయికి చేరింది. ఒక్కరాత్రి బస కోసం స్టార్ హోటళ్ళలో రూ. 25 వేలున్న ఛార్జీని ఏకంగా రూ. లక్ష వరకు పెంచేయడం విశేషం.

వికెట్ పడితే విందు..

దాయాది తో మ్యాచ్ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలతోపాటు చిన్న చిన్న పట్టణాల్లో సైతం భారీ తెరలను ఏర్పాటు చేశారు. అందరూ ఒకేచోట చేరి ఆటను ఆస్వాదించారు. పాకిస్తాన్ ఆటగాళ్లు ఔటయినప్పుడు కొన్నిచోట్ల మద్యం, బిర్యానీ ప్యాకెట్లు పంచగా...ఇంకొన్నిచోట్ల క్రికెటర్ల పేర్లమీద ఆహారపొట్లాలు, మిఠాయిలు పంచారు. హోటళ్లు సైతం ఈ మ్యాచ్ ను తమ వ్యాపారానికి వేదికగా మార్చుకున్నాయి. తమ ఆవరణలో భారీ స్క్రీన్లను ఏర్పాటుచేశాయి. భారత్ విజయం సాధిస్తే బిల్లులో 20 నుంచి 30 శాతం వరకు రాయితీ అందించాయి.

  • Trending Tag

  • No Trending Add This News
google-add
google-add
google-add

క్రికెట్

google-add
google-add
google-add

భారతీయం

google-add
google-add