Sunday, April 28, 2024

Logo
Loading...
google-add

‘‘ఆడవాళ్ళు నేరం చేస్తే కొరడాలతో, రాళ్ళతో కొట్టి చంపేస్తాం’’

P Phaneendra | 17:18 PM, Wed Mar 27, 2024

Taliban leader threatens to publicly flog, stone women guilty of adultery

అప్ఘానిస్తాన్‌లో వ్యభిచారం వంటి నేరాలకు పాల్పడే మహిళలను బహిరంగంగా కొరడా దెబ్బలు కొడతామని, రాళ్ళతో కొట్టి చంపుతామనీ తాలిబన్ నాయకుడు ముల్లా హిబాతుల్లా అఖుంజాదా ప్రకటించాడు. పాశ్చాత్య ప్రజాస్వామ్య వ్యవస్థలను సవాల్ చేస్తూ తాజాగా విడుదల చేసిన ఆడియో సందేశంలో ఆ విషయం వెల్లడించాడు. దేశంలో ఇస్లామిక్ షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామంటూ అప్ఘాన్ జాతీయ ప్రసార వ్యవస్థల్లో ప్రకటించాడు.

‘‘మా లక్ష్యం షరియాను, అల్లా హుదూద్‌నూ (న్యాయం) అమలు చేయడమే’’ అంటూ అఖుంజాదా తన ఆడియో సందేశంలో వెల్లడించాడు. అఖుంజాదా ఎక్కడనుంచి ఆ ఆడియోను విడుదల చేసాడన్నది తాలిబన్ అధికారులు రహస్యంగా ఉంచారు. కానీ అతను తాలిబాన్ల రాజకీయ స్థావరమైన కాందహార్‌లోనే ఉన్నాడని తెలుస్తోంది.

‘‘వారిని రాళ్ళతో కొట్టి చంపితే దాన్ని మీరు మానవహక్కుల ఉల్లంఘన అంటారు. కానీ వ్యభిచార నేరానికి ఆ శిక్షను త్వరలోనే అమలు చేయబోతున్నాం. అలాంటి  నేరాలకు పాల్పడే మహిళలను బహిరంగంగా కొరడా దెబ్బలు కొడతాం, రాళ్ళతో కొట్టి చంపుతాం. ఇవన్నీ మీ ప్రజాస్వామ్యాలకు విరుద్ధం అయి ఉండొచ్చు, కానీ మేము ఆ శిక్షలు అమలు చేసి తీరతాం’’ అని ప్రకటించాడు.

‘‘మేమూ, మీరూ... మనందరమూ మానవ హక్కులను కాపాడుతున్నామనే చెబుతాం. కాకపోతే మేం భగవంతుడి ప్రతినిధులుగా చేస్తాం, మీరు రాక్షసుల్లా చేస్తారు’’ అని అఖుంజాదా వ్యాఖ్యానించాడు. తాలిబన్ల లెక్క ప్రకారం అంతర్జాతీయ సమాజం ప్రబోధించే మహిళల హక్కులు, ఇస్లామిక్ షరియాకు పూర్తి వ్యతిరేకం.

‘‘పాశ్చాత్యులు చెప్పే హక్కులు మహిళలకు కావాలా? వాళ్ళు షరియాకు, మతపెద్దల అభిప్రాయాలకూ వ్యతిరేకం. నేను ముజాహిదీన్లకు ఒక విషయం చెప్పాను. మేం పాశ్చాత్య దేశాల వారిపై 30ఏళ్ళు పోరాడాం. ఇంకా 20ఏళ్ళు, ఆపైన కూడా పోరాడుతూనే ఉంటాం. మేము ఓ మూల కూర్చుని టీ తాగుతూ ఉండిపోము. మేమీ దేశంలో షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం. మొదటగా మేం కాబూల్‌ను వశపరచుకున్నాం. ఇంక ఇప్పుడు షరియా చట్టాన్ని అమలు చేస్తాం’’ అని అఖుంజాదా తన ఆడియో సందేశంలో చెప్పాడు.

అఖుంజాదా చాలా అరుదుగా తప్ప బైట కనిపించడు. అతని చుట్టూ ఎప్పుడూ మతపెద్దలు, తాలిబన్ నాయకులూ ఉంటారు. వారు మహిళలకు విద్య, ఉద్యోగాలకు వ్యతిరేకులు. 1990లలో తాలిబన్లు అప్ఘానిస్తాన్‌లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి పరిపాలనే చేసేవారు. దేశం అమెరికా, నాటో బలగాల అధీనంలోకి వచ్చాక మహిళలకు కొంత స్వేచ్ఛ వచ్చింది. 2021 ఆగస్టులో అప్ఘానిస్తాన్‌నుంచి అమెరికా, నాటో వైదొలిగాక మళ్ళీ తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటినుంచీ మరింత కఠినమైన వైఖరి అవలంబిస్తున్నారు. ప్రజారంజకంగా పరిపాలిస్తామని మొదట్లో హామీలు ఇచ్చినప్పటికీ, తాము అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే బాలికావిద్యను నిలిపివేసారు. మతఛాందస ఇస్లామిక్ షరియా ఆధారిత పరిపాలన ప్రారంభించారు.

ఇప్పుడు తాలిబన్ పాలిత అప్ఘానిస్తాన్‌లో ఆడపిల్లలు ఆరో తరగతికి మించి చదవకూడదు. మహిళలు ఎలాంటి ఉద్యోగాలూ చేయకూడదు. బహిరంగ స్థలాల్లోనూ, జిమ్నాజియంలలోనూ తిరగకూడదు. ఈమధ్యనే బ్యూటీపార్లర్లు సైతం మూయించేసారు. మగతోడు లేకుండా దూరప్రయాణాలు చేయకూడదు. ఇలాంటి చర్యలపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెల్లుబికింది. దాదాపుగా అప్ఘానిస్తాన్‌ను అన్ని దేశాలూ వెలివేసాయి. దాంతో ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మానవ సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. అయినా తాలిబన్లు ఎంతమాత్రం తగ్గడం లేదు. చివరికి  ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థల్లో సైతం మహిళలు పనిచేయకుండా నిషేధం విధించారు.

తాలిబన్ నాయకులు తమ పరిపాలనను ఇస్లాం పేరు చెప్పి సమర్థించుకుంటారు. అదే అసలైన అప్ఘాన్ సంస్కృతిగా ప్రచారం చేస్తున్నారు. షరియా భయం చూపించి మహిళలను ఇంటి నాలుగు గోడలూ దాటనీయడం లేదు. అన్ని దేశాలనూ ముస్లిం దేశాలుగా మార్చేసి, షరియా చట్టాలను అమలు చేయాలన్నది వారి దీర్ఘకాలిక ప్రణాళిక.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add