తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ సమకూర్చిన నిధులతో సమరసత సేవా ఫౌండేషన్ 320 మందిరాలను పక్కాగా నిర్మిస్తోందని సంస్థ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షులు తాళ్ళూరి విష్ణు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఆలయాలు నిర్మాణం తుదిదశలో ఉందనీ, ఎవరైనా వచ్చి సంబంధిత ఖాతాలను, దేవాలయాలనూ ప్రత్యక్షంగా పరిశీలించుకోవచ్చనీ విష్ణు వివరించారు.
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ సోమవారం మాట్లాడుతూ వైసీపీ హయాంలో సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా 320 దేవాలయాల నిర్మాణానికి రూ.32కోట్లు మంజూరు చేసారని, అందులో అక్రమాలు జరిగాయనీ ఆరోపించారు. దానికి స్పందనగా ఎస్ఎస్ఎఫ్ అధ్యక్షులు తాళ్ళూరి విష్ణు వివరణ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2016లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీలలో గుడులు లేని చోట గుడులు నిర్మించాలని, ఏడాదికి 500 గుడులు నిర్మించాలనీ జీఓ నెంబర్ 820 విడుదల చేసారు. ఆ జీఓ ఆధారంగా 2016 నుంచి 2018 వరకూ టీటీడీ నిధులతో ఎస్ఎస్ఎఫ్ పర్యవేక్షణలో రూ.25 కోట్లతో 502 దేవాలయాలు నిర్మించారు. అప్పుడు ఒక్కొక్క గుడికీ రూ.5లక్షలు ఇచ్చారు.
అదేవిధంగా వైఎస్ఆర్సిపి హయాంలో సెప్టెంబర్ 2022లో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ 320 దేవాలయాల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఒక్కొక్క దేవాలయానికీ రూ.10 లక్షలు కేటాయించారు. గతంలో కంటె దేవాలయాల కొలతలు పెంచారు. ప్రహరీ గోడ, గుడి మండపానికి గ్రిల్ కూడా పెట్టించారు. పెరిగిన నిర్మాణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని గుడి నిర్మాణ ప్రణాళిక నమూనాను శ్రీవాణి ట్రస్ట్ ఇచ్చింది. ఆ ప్లాన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో దేవాలయాల నిర్మాణాలు ఆఖరిదశలో ఉన్నాయి.
రాష్ట్రంలో ఎస్ఎస్ఎఫ్ నిర్మించిన ప్రతీ దేవాలయానికీ నిర్మాణ వ్యయం రూ.10లక్షలు కంటె ఎక్కువే అయింది. దేవాలయ కమిటీలు, స్థానిక హిందూభక్తుల సహకారంతో ఆలయాల నిర్మాణం అద్భుతంగా జరుగుతున్నాయి.
ప్రతీ దేవాలయానికీ ఆ కమ్యూనిటీ సభ్యులతో కమిటీ రిజిస్టర్ చేయించి వారి అభీష్టం మేరకు గుడి నిర్మాణం జరిగింది. కమిటీ పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచి నిర్మాణ దశల ఆధారంగా గుడి కమిటీ ఖాతాకు నిధులు విడుదల చేసారు. స్థానిక కమిటీలే గుడుల నిర్మాణాన్ని స్థానిక మేస్త్రీలతో చేయించారు. ఆ ఆర్ధిక లావాదేవీలన్నింటినీ బిల్లులు, రసీదులు, డాక్యుమెంట్ల రూపంలో టీటీడీకి విడతల వారీగా సమర్పించారు. ప్రతీ దేవాలయాన్నీ టీటీడీ ఇంజనీర్లు మూడు విడతలుగా ఇనస్పెక్షన్ కూడా చేసారు.
సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా నిర్మించిన, నిర్మిస్తున్న 320 దేవాలయాలను టీటీడీ ఆడిట్ విభాగం ఎప్పటికప్పుడు పరిశీలించి టీటీడీకి నివేదికలు సమర్పించింది. అలాగే ఎస్ఎస్ఎఫ్ ఆడిటర్ ఎప్పటికప్పుడు అకౌంట్లు ఆడిట్ చేసి ఎప్పటికప్పుడు యూసీలను టీటీడీకి సమర్పించింది.
తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ గారికి సమరసత సేవా ఫౌండేషన్ గురించి, సంస్థ పనితీరు గురించి సరైన అవగాహన లేనందున సంస్థపై ఆరోపణలు చేసారు. ఎస్ఎస్ఎఫ్ ఎలాంటి రాజకీయ ప్రమేయాలూ లేకుండా దేశధర్మం కోసం, హిందూధర్మం కోసం, ధర్మప్రచారానికి అంకితమై పనిచేస్తున్న సంస్థ. దాన్ని రాజకీయాల్లోకి లాగవద్దు అని తాళ్ళూరి విష్ణు వివరించారు. తెలుగుదేశం ప్రతినిధులు కానీ, టీటీడీ అధికారులు కానీ ఎప్పుడైనా వచ్చి తమ అకౌంట్లను పరిశీలించుకోవచ్చునని చెప్పారు. తమ సంస్థ నిర్మించిన 320 దేవాలయాలనూ ప్రత్యక్షంగా పరిశీలించడానికి రావలసిందిగా స్వాగతం పలికారు.