మద్యం విధానం కుంభకోణంలో నిందితుడిగా జైల్లోకి వెళ్ళినప్పుడు రాజీనామా చేయని అరవింద్ కేజ్రీవాల్, ఆరు నెలల తర్వాత బెయిల్ వచ్చాక రాజీనామా చేసాడు. తన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిషి మార్లేనా సింగ్‌ను ప్రకటించాడు. త్వరలో జరగబోయే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మూడోసారి గద్దెనెక్కడానికి కేజ్రీవాల్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుంది?
ఆతిషి మార్లేనా సింగ్ కరడుగట్టిన అర్బన్ నక్సలైట్ దంపతుల కుమార్తె. తండ్రి విజయ్ సింగ్, తల్లి తృప్తా వాహి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు. తమ కుమార్తెకు పేరు పెట్టడంలోనే వారు తమ వామపక్ష భావజాలాన్ని ప్రదర్శించుకున్నారు. కారల్ మార్క్స్ పేరులోంచి ‘మార్’, లెనిన్ పేరులోంచి ‘లేనా’ అనే అక్షరాలు తీసుకుని మార్లేనా అని పేరు పెట్టారు. జాతీయతావాదం అంటే అస్సలు సరిపడని దృక్పథం వీరిది. భారతదేశాన్ని కకావికలం చేసే మావోయిస్టులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులకు అండగా నిలుస్తారు. పాకిస్తాన్ దొంగదాడుల నుంచి భారత్ ఆత్మరక్షణ చేసుకోవడం కూడా తప్పు అని ప్రచారం చేసే దుర్మార్గమైన మనస్తత్వం వీరిది.
విజయ్, తృప్తా దంపతుల ఘనత చాలా ఉంది. భారత పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్‌గురుకు క్షమాభిక్ష పెట్టాలని ఆందోళనలు చేసారు, రాష్ట్రపతికి లేఖలు రాసారు. కానీ, కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన సైనికుల కుటుంబాల కోసం నిధి వసూలు చేస్తే, ‘చావడానికి జీతం తీసుకునే వాళ్ళకు ఎందుకు సహాయం చేయాలి’ అని అడిగిన గొప్పదనం ఆ దంపతులది. కశ్మీరీ ఉగ్రవాది ఎస్ఎఆర్ గిలానీతో సత్సంబంధాలున్నాయి. గిలానీ అరెస్ట్, విచారణ సమయంలో పోలీసులు విజయ్ సింగ్, తృప్తా దంపతులను సైతం విచారించారు. అంతేకాదు, నేపాల్‌లో కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినప్పుడు ఆ పోరాటాలకు భారతదేశం మద్దతిచ్చింది అంటూ తప్పుడు ప్రచారం చేసారు. మరీ ముఖ్యంగా నేపాల్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టడంలో యోగి ఆదిత్యనాథ్ హస్తముంది అంటూ తృప్తా వాహి వామపక్ష అనుకూల మీడియాలో కథనాలు రాసింది.
భారత్ మీద దుమ్మెత్తి పొయ్యడంలో ఆతిషి మార్లేనా సింగ్ కూడా తక్కువదేమీ కాదు. కొన్నాళ్ళ క్రితం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ భారతదేశం పేరుకు మాత్రమే ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. నిజానికి భారత్ ఆర్థిక పరిస్థితి శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటె దారుణంగా ఉంది అని వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ తన వారసురాలిగా ఆతిషి పేరును ప్రకటించగానే, కేజ్రీవాల్‌ను పూర్తిగా వ్యతిరేకించే స్వాతి మలీవాల్ తీవ్రంగా స్పందించింది. ఆతిషికి భారత వ్యతిరేక శక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ట్వీట్ చేసింది. అటువంటి మహిళ దేశ రాజధాని ప్రాంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమేమీ కాదు.
అయితే అరవింద్ కేజ్రీవాల్ ఏం ఆశించి ఆతిషిని సీఎం చేసాడో ఆ ప్రయోజనం నెరవేరుతుందా అంటే అనుమానమే. ఢిల్లీ శాసనసభకు ఐదు నెలల్లో అంటే 2025 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మామూలుగా అయితే రెండుసార్లు గద్దెమీద ఉన్నాక ప్రజావ్యతిరేకత రావడం సాధారణం. అయితే, తను ఇప్పుడే బెయిల్ మీద బైటకు వచ్చాడు కాబట్టి, వెంటనే ఎన్నికలు జరిగితే ప్రజా సానుభూతి ఆధారంగా మరోసారి అధికారంలోకి రావచ్చన్నది కేజ్రీవాల్ వ్యూహం. వెంటనే ఎన్నికలు రావాలంటే అసెంబ్లీని రద్దు చేయాలి. ఆ పని నేరుగా తన కంటె వేరొకరు గద్దె మీద ఉన్నప్పుడు జరిగితే మేలని అంచనా వేసాడు. అందుకే ఆతిషిని సీఎం పీఠం ఎక్కించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీని వెనుక నుంచి ఆడిస్తున్న డీప్‌స్టేట్ ఆలోచన వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ ఆరోగ్యం బాగోలేదు. రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉండడం లేదు. రాజకీయాల ఒత్తిడి మరింత ఎక్కువైతే పరిస్థితి అదుపు తప్పవచ్చు. కేజ్రీవాల్‌కు వయసు కూడా మీద పడుతోంది. అతని కంటె ఆతిషి వయసులో చాలా చిన్నది. ప్రత్యక్షంగా వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా చురుగ్గా పనిచేస్తుంది. ఇంక కేజ్రీవాల్ క్రేజ్ దశాబ్దం క్రితం ఉన్నట్లు ఇప్పుడు లేదు. ప్రత్యేకించి మద్యం విధానం కుంభకోణం తర్వాత కేజ్రీవాల్ మీద మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్‌ను పక్కకు నెట్టి కొత్త నేతృత్వాన్ని ముందుకు తీసుకురావలసిన అవసరం ఉంది. ఆ పనికి ఆతిషి మార్లేనా సరిగ్గా సరిపోతుంది. కాబట్టి డీప్‌స్టేట్ మద్దతు కొత్త ముఖ్యమంత్రి కాబోయే ఆతిషికి ఉండేలా ఉంది. మరో ఊహాగానం ప్రకారం, డీప్‌స్టేట్ ఒత్తిడి మేరకే కేజ్రీవాల్ ఆతిషిని తన వారసురాలిగా ప్రకటించి ఆమెకు మార్గం సుగమం చేసాడు. ఏది ఎలాగైనా, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ చేతినుంచి జారిపోయి ఆతిషి చేతికి చిక్కినట్టే అన్న ఊహాగానాలు బలం పుంజుకుంటున్నాయి.