ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంపై దారుణమైన ఆరోపణ చేసారు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వాడారని ఆరోపించారు. ఆ ఆరోపణపై వైఎస్ఆర్‌సిపి తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు దురుద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడింది.
నిన్న బుధవారం సాయంత్రం ఎన్‌డిఎ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల అధినేతలు, ప్రజాప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ సందర్భంలో, తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇచ్చే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారంటూ ఆరోపణ చేసారు.
‘‘గత ఐదేళ్ళలో వైఎస్ఆర్‌సిపి నాయకులు తిరుమల పవిత్రతను దెబ్బతీసారు. అన్నదానం నాణ్యతను తగ్గించేసారు. చివరకు పవిత్రమైన తిరుమల లడ్డూను కూడా వదిలిపెట్టలేదు. లడ్డూల తయారీలో నెయ్యి బదులు జంతువుల కొవ్వును వాడారు. ఆ విషయం చాలా ఆందోళన కలిగించింది. అయితే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛమైన నేతితోనే లడ్డూలు తయారు చేయిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను కాపాడేందుకు మేం కృషి చేస్తున్నాం’’ అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఆరోపణలను వైసిపి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపి, టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘‘దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపితం అయ్యింది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబుకూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?’’ అని సుబ్బారెడ్డి ట్వీట్ చేసారు.
సుబ్బారెడ్డికి తర్వాత టిటిడి ఛైర్మన్‌గా పనిచేసిన వైసిపి నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధికోసం, రాజకీయ స్వార్థకోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్నాను. కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరుమీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో వైయస్సార్‌గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడు. వాస్తవం ఏంటంటే, తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాలమీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతులమీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాలమీదుగా తయారయ్యే ప్రసాదాలమీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే.. ఆయన బురదరాజకీయాలకు పరాకాష్ట. ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విషప్రచారాలు అన్నీ ఇన్నీకావు. చివరకు ఏమీ దొరక్కపోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు’’ అంటూ భూమన ఒక ప్రకటన చేసారు.
నిజానికి, 2024 జులై 23న టిటిడి ఇఒ శ్యామలరావు ఈ విషయమై ఒక వివరణ ఇచ్చారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నేతిని సరఫరా చేసేవారికి నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలని సూచించామని చెప్పారు. కొన్ని సంస్థలు ఉన్నతమైన నాణ్యత కలిగిన నేతిని పంపిస్తుంటే మరికొన్ని సంస్థలు మాత్రం నాసిరకం నెయ్యి అందిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రత్యేకించి ఒక సంస్థ కల్తీ నెయ్యి ఇస్తున్నట్లు, వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఎబిఎల్ (నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) పరీక్షలో తేలిందని వెల్లడించారు.
టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సరఫరాదారులలో ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోలడం లేదని మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు ఈఓ శ్యామలరావు చెప్పారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని, మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు వివరించారు.
ఆ విషయాన్నే ప్రస్తావిస్తున్న వైసీపీ వర్గాలు, చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు ఆరోపణల్లో నిజానిజాలేమిటని సామాన్య ప్రజలు సైతం ఆందోళనగా ఉన్నారు. తిరుపతి లడ్డూల విషయంలో నిజానిజాలు తేలాలని భావిస్తున్నారు. ఆ వ్యవహారంపై ఉన్నతస్థాయి న్యాయమూర్తులతో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరుతున్నారు.