మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ పాఠశాల ఆవరణలో ఒక మూడేళ్ళ బాలిక మీద కాసిం రెహ్మాన్ అనే ఐటీ నిపుణుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలిక జననాంగాలపై గాయపు మరకలను ఆమె తల్లి గమనించడంతో ఈ విషయం బుధవారం నాడు బైటపడింది. పోలీసులు కాసిం రెహ్మాన్‌ను అరెస్ట్ చేసారు. పోక్సో చట్టం ప్రకారం ఛార్జిషీట్ దాఖలు చేసారు.
బాలిక తల్లి పాఠశాల అధికారులకు, పోలీసులకూ ఫిర్యాదు చేసింది. పాఠశాల ఐటీ విభాగంలో పనిచేస్తున్న కాసిమ్ రెహ్మాన్ అనే వ్యక్తి మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అయితే, ఆ విషయం గురించి తమకేమీ తెలియదని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు సమాచారమిచ్చారనీ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు. భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారి ఆ సంఘటనను ధ్రువీకరించారు. నిందితుడిని అరెస్ట్ చేసామనీ, దర్యాప్తు కొనసాగుతోందనీ వెల్లడించారు.
మధ్యప్రదేశ్ పాఠశాల విద్య మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ ఆ దుర్ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. అటువంటి దారుణమైన నేరాల గురించి విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాల్సిన అవసరముందన్నారు. నేరస్తుడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ (ఎన్సిపిసిఆర్) ఛైర్పెర్సన్ ప్రియాంక్ కానూంగో ఆ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ‘‘మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మూడేళ్ళ బాలికపై పాఠశాల ఉద్యోగి కాసిం రెహ్మాన్ లైంగిక వేధింపుల ఘటన గర్హనీయం. కమిషన్ ఆ సంఘటనను గుర్తించింది’’ అని ట్వీట్ చేసారు. మధ్యప్రదేశ్ స్టేట్ చైల్డ్ కమిషన్ ఛైర్మన్‌తో ఈ విషయమై ఫోన్ల్ మాట్లాడానని, ఆ దుర్ఘటన విషయంలో తగిన చర్యలు తీసుకుంటామనీ చెప్పారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సైతం ఆ కేసుపై స్పందించారు.‘‘భోపాల్‌లో మూడేళ్ళ బాలికపై అత్యాచారం కేసు నా దృష్టికి వచ్చింది. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను., ఈ కేసులో ప్రత్యేక కోర్టు ద్వారా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది అత్యంత అసహ్యకరమైన, సిగ్గుమాలిన, ఖండించదగిన చర్య. పాఠశాలలో పనిచేస్తున్న కాసిం రెహ్మాన్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. ఈ కేసును ప్రత్యేక కోర్టులో విచారించి న్యాయం జరిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించాను’’ అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వీడియో ప్రకటనను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసారు.