కేరళ వక్ఫ్ బోర్డుకు హైకోర్టులో చుక్కెదురైంది. తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారంటూ పోస్టల్ అధికారుల మీద వక్ఫ్ బోర్డు పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టేసింది. బోర్డు తమ వాదనకు ప్రాతిపదికగా చూపిస్తున్న వక్ఫ్ చట్టంలోని సెక్షన్, ముందరి కాలానికి వర్తించదని నిర్ధారించింది.
వక్ఫ్ ఆస్తిని ఎవరైనా స్వాధీనం చేసుకోవాలంటే దానికి వక్ఫ్ బోర్డు అనుమతి తప్పనిసరిగా ఉండాలి అని వక్ఫ్ చట్టంలోని 52ఎ సెక్షన్ చెబుతుంది. ఆ సెక్షన్‌ను ఆ చట్టంలో 2013లో చట్టసవరణ ద్వారా చేర్చారు. దాని ఆధారంగా కేరళ వక్ఫ్ బోర్డ్, ఒక పోస్టల్ కార్యాలయం అధికారులపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. ఆ కేసును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి పి.వి కున్హికృష్ణన్ తీర్పునిచ్చారు.
కేరళ స్టేట్ వక్ఫ్ బోర్డు కోళికోడ్‌లో తమకు చెందిన ఒక ఆస్తిని పోస్టల్ అధికారులు చట్టవిరుద్ధంగా ఆక్రమించారంటూ క్రిమినల్ కేసు దాఖలు చేసింది. పోస్టల్ విభాగం సీనియర్ సూపరింటెండెంట్ కె సుకుమారన్, సబ్ పోస్ట్‌మాస్టర్ కె ప్రేమ మీద వక్ఫ్ చట్టం సెక్షన్ 52ఎ ప్రకారం నేరారోపణ చేసింది. ఆ సెక్షన్ ప్రకారం వక్ఫ్ ఆస్తిని అనధికారికంగా స్వాధీనం చేసుకున్నా లేక బదిలీ చేసినా, ఆ నేరస్తులకు రెండేళ్ళ జైలుశిక్ష విధించవచ్చు.
కోళికోడ్‌లో ఆ పోస్టల్ కార్యాలయాన్ని 1999లో ప్రారంభించారు. దానికోసం ఆ భవనాన్ని స్వాధీనం చేసుకోడానికి ఆ యేడాదే లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఆ భవనాన్ని పోస్టల్ కార్యాలయం చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుంది. కేసుకు ఆధారంగా చూపుతున్న సెక్షన్‌ను వక్ఫ్ చట్టంలో 2003లో పొందుపరిచారు. దాని ఆధారంగా కోళికోడ్ పోస్టల్ కార్యాలయం అధికారులపై 2017లో కేసు పెట్టారు. అయితే సదరు సెక్షన్‌ను చట్టంలో పెట్టడానికి ముందే ఆ భవనాన్ని చట్టబద్ధంగా లీజుకు తీసుకున్నందున అది ఈ కేసులో వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టంగా తేల్చిచెప్పింది.
ఈ కేసు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డు ఏదైనా ఆస్తిని తమ సొంతం చేసుకోడానికి ఎంత దూకుడుగా వ్యవహరిస్తుందో అన్న సంగతిని కళ్ళకు కట్టింది. చట్టబద్ధంగా కుదుర్చుకున్న ఒప్పందాలు కళ్ళముందే ఉన్నా, తమ నియమ నిబంధనల పేరుతో అడ్డంగా వాదించడానికి వక్ఫ్ బోర్డు ఎలా సిద్ధమైపోతోందో ఈ కేసు ద్వారా తెలుస్తోంది. ఈ కేసులో నిందితులు ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారు కాబట్టి విచారణ పూర్తయేవరకూ సహించగలిగారు. కానీ కనబడిన చోటల్లా ఆకుపచ్చ గుడ్డ కప్పేసి ఆ భూమి, స్థలం లేదా నిర్మాణం మాదే అని వక్ఫ్ బోర్డు సొంతం చేసుకుంటే సాధారణ ప్రజలు ఏమీ చేయలేరు. అలాంటివారికి ఈ తీర్పు ఊరట కలిగిస్తుంది.