ఒక భూమిపై యాజమాన్య హక్కు కోసం న్యాయస్థానంలో జరుగుతున్న పోరాటం కారణంగా 135 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మహారాష్ట్రలోని పుణే నగరంలో వక్ఫ్ బోర్డ్ కాటుకు గురైన వారిలో ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పుడక్కడ హిందువులూ, ముస్లిములూ అందరూ కలిపి మొత్తం 135 కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలారు.
పుణే కస్బాపేట ప్రాంతంలోని కుంభార్వాడలో (కుమ్మరివాడ) పుణ్యేశ్వర్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరుతో ఒక చిన్న కాలనీ ఉండేది. మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టు కింద ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఆ కాలనీలోని 135 ఇళ్ళను 2016లో పడగొట్టారు. అయితే అక్కడ అభివృద్ధి పనులు మొదలుపెట్టే సమయంలో స్థానిక ముస్లిం ఒకడు ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందంటూ, బోర్డు తరఫున వాదనలు మొదలుపెట్టాడు. ఎందుకొచ్చిన గొడవ అనుకున్న అధికారులు ఆ ప్రాజెక్టును పక్కన పడేసారు. దాంతో గత ఎనిమిదేళ్ళుగా ఆ 135 కుటుంబాల వారూ నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాలనీని అభివృద్ధి చేసి కొత్త ఇళ్ళు ఇస్తారనుకుంటే, ఉన్న గూడు కూడా చెదిరిపోయిందే అని వారు వాపోతున్నారు.
కస్బాపేటలోని పుణ్యేశ్వర్ సొసైటీలో హిందువులతో పాటు ముస్లిములు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. వారందరికీ ఇప్పుడు తలదాచుకోడానికి ఇల్లు లేని పరిస్థితి. ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఇళ్ళకు బదులు ఆధునిక నివాసాలు, మెరుగైన జీవనప్రమాణాలు, ఉజ్వలమైన భవిష్యత్తు వస్తాయని స్థానికులు ఆశించారు. దాంతో ఉన్న ఇళ్ళను కూలగొట్టే పని మొదలైంది. ఆ సమయంలో వారికి డెవలపర్లు అద్దె కూడా చెల్లించారు.
అయితే, ఒకసారి ఇళ్ళన్నీ కూలగొట్టడం పూర్తయాక, నిర్మాణం మొదలుపెట్టడానికి ముందు ఆ ప్రాంతానికి చెందిన స్థానిక ముస్లిం వ్యక్తి ఒకరు కొత్త వాదన తెర మీదకు తీసుకొచ్చాడు. అక్కడికి చేరువలో ఒక చిన్న దర్గా ఉందని, అందువల్ల ఆ ప్రదేశం వక్ఫ్ బోర్డుకు చెందుతుందనీ అతని వాదన. అనూహ్యమైన ఆ పరిణామంతో పునర్నిర్మాణ పనులు ఆగిపోయాయి. స్థలం ఖాళీగా మిగిలిపోయింది. మెరుగైన జీవితం గురించిన కలలన్నీ ఆ శిథిలాల్లో కలిసిపోయాయి.
ఆటోరిక్షా నడుపుకునే 45ఏళ్ళ అనీఫ్ షేక్ బాధ వర్ణనాతీతం. ‘‘నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నా జీవితం అంతా ఈ ప్రదేశంతోనే ముడిపడి ఉంది. వాళ్ళు మా ఇళ్ళను కూల్చేసారు, అంతకంటె మెరుగైన ఇళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడేమో ఈ భూమి వక్ఫ్ బోర్డుది అంటున్నారు. మాకు మా భూమి కావాలి’’ అని ఆవేదన చెందుతున్నాడు.
నిజానికి ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందినది అనడానికి సరైన ప్రాతిపదిక ఏమీ లేదు. ఆ కాలనీకి దగ్గరలో ఒక చిన్న దర్గా ఉంది. దాని ఆధారంగానే ఆ ప్రాంతం మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందినది అంటూ వాదిస్తున్నారు. ఆ వాదనను స్థానికులు నిరాకరిస్తున్నారు. తమ ఇళ్ళు ఉన్న భూమికి దర్గాకు సంబంధం లేదని, దర్గా తమ ఇళ్ళకు దూరంగా ఉందని వివరిస్తున్నారు. అక్కడ దశాబ్దాలుగా హిందూముస్లిములు కలిసికట్టుగా ఉన్నారని గుర్తుచేస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో కూడా హిందూ ముస్లిములు సమష్టిగానే పోరాడుతున్నారు.
‘‘ఈ వ్యవహారంలో మతం అనేది విషయం కాదు. మేమందరం దశాబ్దాలుగా కలిసే బతుకుతున్నాం. ఇప్పుడు ఈ ప్రకటనతో మా అందరి బతుకులు తలకిందులు అయిపోయాయి. మేమిప్పుడు ఇక్కడ తాత్కాలిక నిర్మాణాలతో తలదాచుకున్నాం. ఈ మధ్యనే ఒక పాము కరవడంతో ఒక ముస్లిం వ్యక్తి చనిపోయాడు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ మా ఇళ్ళను మాత్రమే కాదు, మా జీవితాలను కూడా పడగొట్టేసారు’’ అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు 80ఏళ్ళ అబూ సయ్యద్.
సుశీలాదేవి అనే మహిళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆమె, ఆమె భర్త ఇద్దరు మాత్రమే ఉండేవారు. ఈ ఇళ్ళ కూల్చివేత, వక్ఫ్ బోర్డు గొడవతో మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి ఆమె భర్త రెండు నెలల క్రితం చనిపోయారు. ‘‘నేను ఒంటరినైపోయాను. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ గొడవ నా సర్వస్వాన్నీ లాగేసుకుంది. నా ఇల్లు, నా ఆత్మగౌరవం, ఆఖరికి నా భర్త అన్నీ పోయాయి’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
పుణ్యేశ్వర్ సొసైటీ వాసులు స్థానిక అధికారులకు, రాజకీయ నాయకులకు, చివరికి దర్గా ట్రస్ట్ సభ్యులకు కూడా విన్నపాలు చేసుకున్నారు. కానీ వారి గోడు వినేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ‘‘ఈ వ్యవహారంలో వక్ఫ్ బోర్డు పేరు వచ్చింది కదా. అందుకే ఈ అంశాన్ని కనీసం ముట్టుకునేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు. మమ్మల్ని రక్షించాల్సిన వ్యవస్థే మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసింది’’ అంటూ వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
చిత్రంగా, దర్గా ట్రస్ట్ సభ్యులు కూడా కిమ్మనడం లేదు. ఈ పరిణామం ఎటుపోయి ఎటు వస్తుందో అర్ధం కాక, ప్రజలకు మద్దతిస్తే వక్ఫ్ బోర్డు తమను ఏం చేస్తుందోనన్న భయంతో వారు నోరు మెదపడం లేదు.