‘అగ్ని’ క్షిపణి పితామహుడు రామ్ నారాయణ్ అగర్వాల్(ఆర్ఎన్ అగర్వాల్ ) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 84 సంవత్సరాలు. అగ్ని క్షిపణి ప్రాజెక్టుకు తొలి డైరెక్టర్ గా ఆర్ఎన్ అగర్వాల్ వ్యవహరించారు. దేశానికి ఆయన అందించిన సేవలకు గాను 1990లో పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. 2004లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతోనూ ఆయనను గౌరవించారు.
లాంగ్ రేంజ్ క్షిపణుల అభివృద్ధిలో అగర్వాల్ పాత్ర కీలకం. ప్రఖ్యాత ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచిపేరుంది. డీఆర్డీవోలో అగర్వాల్ కు దశాబ్దాల పాటు సేవలు అందించారు. 1983లో ప్రారంభమైన అగ్ని క్షిపణి ప్రాజెక్టుకు అగర్వాల్ నాయకత్వం వహించారు. అగర్వాల్ ఐఐటీ మద్రాస్, బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఉన్నత విద్య అభ్యసించారు.