సుస్థిర ఇంధన విధానాన్ని రూపొందించడానికి దేశం కృతనిశ్చయంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సౌర, పవన, అణు, జల విద్యుత్ రంగాలపై దృష్టి కేంద్రీకరించామని ఆయన వివరించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ‘రీ-ఇన్వెస్ట్ 2024’ను ఆయన ఇవాళ ప్రారంభించారు.
‘‘మా లక్ష్యం అగ్రస్థానానికి చేరడం కాదు, అగ్రస్థానం మీద పాతుకుపోవడం. 21వ శతాబ్దంలో అత్యుత్తమ దేశం భారతదేశమేనని ఇవాళ భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం భావిస్తోంది. ఈ నెలలోనే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ నిర్వహించారు. దాని తర్వాత మొదటి సోలార్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోసం ప్రపంచ దేశాల నుంచీ ప్రజలు వచ్చారు. ఆ తర్వాత గ్లోబల్ సెమీకండక్టర్ సమ్మిట్‌లో ప్రపంచం నలుమూలల నుంచీ ప్రతినిధులు హాజరయ్యారు. వాటితర్వాత ఇప్పుడు మనం గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు గురించి మాట్లాడుకోడానికి సమావేశమయ్యాం’’ అని మోదీ చెప్పారు.
‘‘మాకు చమురు, గ్యాస్ నిల్వలు పెద్దగా లేవు. మేం విద్యుచ్ఛక్తి ఉత్పాదకులం కాము. కాబట్టి మా భవిష్యత్తు కోసం మేము సౌర, పవన, పరమాణు, జల విద్యుచ్ఛక్తుల మీద దృష్టి సారించాము. సుస్థిరమైన, నిలకడైన విద్యుచ్ఛక్తి మార్గాన్ని నిర్మించాలని కృతనిశ్చయంతో ఉన్నాము’’ అని ప్రధాని మోదీ. 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలమని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేసారు. ‘‘జి-20 దేశాల్లో మనదేశమే ఆధిక్యంలో ఉంది. ఏనాడూ అభివృద్ధి చెందిన దేశంగా చూడని మన దేశం ఇప్పుడు వర్ధమాన దేశంగానే ప్రపంచానికి ఉదాహరణగా నిలిచింది’’ అని చెప్పారు. భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం చేసే దూరదృష్టితో కూడిన కార్యాచరణ ప్రణాళికలో భాగమే ఇప్పుడు నిర్వహిస్తున్న రీ-ఇన్వెస్ట్ కార్యక్రమమని వివరించారు.
‘‘మా మూడో దఫా పరిపాలనలో మొదటి వంద రోజులే మా ప్రతిభకు నిదర్శనం. దేశంలోని వందలాది జిల్లాల్లో మా నిర్ణయాలు సాకారమవుతున్నాయి. మా ప్రాధాన్యాలు స్పష్టంగా ఉన్నాయి. మా ప్రతిభ, పరిమాణం అందరికీ కనబడేలా ప్రతిఫలిస్తున్నాయి. ప్రస్తుతం మేం ప్రతీ రంగంలోనూ, ప్రతీ ప్రదేశంలోనూ సమస్యలను పరిష్కరించాం. భారత్ వేగవంతమైన అభివృద్ధికి ప్రతీ ప్రాంతమూ కీలకమైనదే. భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణలో భారతదేశం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
ఎన్డీయే మూడవ దశ మొదటి వంద రోజుల్లో కేంద్రప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన సంక్షేమ పథకాల గురించి మోదీ వివరించారు. గ్రీన్ ఎనర్జీకి మద్దతు గణనీయంగా పెరిగిందన్నారు. వైబ్రంట్ గ్యాస్ ఫండింగ్ పథకం ద్వారా ఆఫ్‌షోర్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రారంభించామన్నారు. దానికోసం రూ.7వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.
PM Narendra Modi, Global Renewable Energy Investors Meet, RE-INVEST 2024, Green Energy, Andhra Today News, Top News, Slider