కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై రెసిడెంట్ డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఘాయిత్యాన్ని నిరసిస్తూ సోమవారం(ఆగస్టు 12న) దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఫోర్డా (ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్) ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోర్డా లెటర్ రాసింది .
జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరిన ఫోర్డా, దౌర్జన్యాలకు గురైన తమ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఓ జూనియర్ వైద్యురాలు దారుణ హత్యకు గురయైంది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు శవపరీక్షలో తేలింది. పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న జూనియర్ వైద్యురాలు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి విధులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవంగా కనిపించారు. ఆమె శరీరంపై తీవ్ర గాయాలు కనిపించాయి.ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.