తమిళనాడులోని పాఠశాలల్లో విద్యార్థుల వేషధారణ, కులాలకు సంబంధించిన చిహ్నాలను ధరించడాన్ని నిషేధించాలని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ ఇచ్చిన రిపోర్టును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.
జస్టిస్ చంద్రూ అందజేసిన నివేదిక పూర్తిగా పక్షపాతంతో ఉందని బీజేపీ కౌన్సిలర్ ఉమా ఆనందన్ ఖండించారు. రిపోర్టుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని మేయర్ ఆర్ ప్రియాను డిమాండ్ చేశారు. హిందువులకు వ్యతిరేకంగా నివేదికలో పలు అంశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఉమా ఆనందన్ డిమాండ్ ను తిరస్కరించిన మేయర్, చర్చించాల్సిన ఇతర అంశాలు చాలా ఉన్నాయని బదులిచ్చారు. దీంతో చంద్రూ రిపోర్ట్ ను చించివేసి నిరసన తెలిపిన ఉమా ఆనందన్, సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
విద్యార్థులు చేతికి ధరించే దారాలు, ఉంగరాలు, బొట్టు విషయంలో నిషేధం విధించాలని జస్టిస్ చంద్రూ రిపోర్టులో పేర్కొన్నారు. రిపోర్టు పూర్తిగా పక్షపాతంగా ఉండటంతో తాను ఖండించినట్లు ఉమా ఆనందన్ వివరించారు.
2023 సెప్టెంబర్లో నంగునేరిలోని ఓ స్కూల్లో ఓ బాలుడిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. బాధితుడిగా ఉన్న విద్యార్థి దళితుడు కావడంతో ఘటన తీవ్ర దుమారం రేపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ చంద్రూ ఆధ్వరంలో ఓ కమిటీ వేసింది.