కువైట్‌లో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదం కారణంగా 41 మంది చనిపోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వారందరూ కేరళకు చెందిన వారని తెలుస్తోంది.
దక్షిణ మంగాఫ్ జిల్లాలో నేటి ఉదయం ఈ ప్రమాద ఘటన జరిగింది. ఓ భవనంలో మంటలు చెలరేగి కాసేపట్లోనే భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో భవనంలో 195 మంది కార్మికులు ఉండగా వారిలో కేరళ, తమిళనాడుకు చెందిన వారు కూడా ఉన్నారు. భవనం మలయాళీ వ్యాపారవేత్త కెజి అబ్రహంకు చెందినదిగా అధికారులు వెల్లడించారు.
ప్రమాదంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్: 965-65505246ను ఏర్పాటు చేసింది. సాధ్యమైన సహాయం చేసేందుకు ఎంబసీ కట్టుబడి ఉందని ప్రకటించింది.
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత రాయబారి ఘటనా స్థలికి వెళ్లినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.