AIUDF leader Rafiqul Islam slams Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra
కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. ఆ పార్టీ
మిత్రపక్షం, అసోంకి చెందిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రధాన
కార్యదర్శి, ఎమ్మెల్యే రఫీక్ ఉల్ ఇస్లామ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్ జోడో న్యాయ
యాత్ర పేరుతో రాహుల్ గాంధీ టైం వేస్ట్ చేస్తున్నారని రఫీక్ అన్నారు. పార్టీలో
ప్రధాన విషయాలను మాత్రం గాలికి వదిలేస్తున్నారని ఆవేదన చెందారు.
ఎన్నికలు ఇంక కేవలం రెండు నెలల వ్యవధిలోకి
వచ్చేసినందున, రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల కాంగ్రెస్‌కు ఏ లబ్ధీ ఉండదని రఫీక్ ఉల్
ఇస్లాం అభిప్రాయపడ్డారు. ‘‘కాంగ్రెస్‌లో చాలా గ్రూపులున్నాయి. కానీ రాహుల్ గాంధీ
యాత్రలో ఉన్నాడు. చాలామంది నాయకులు కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరారు. మహారాష్ట్రలో
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీజేపీలో చేరాడు. అసోంలో ఒక మాజీ మంత్రి, పలువురు
నాయకులు బీజేపీలో చేరారు. నితీష్ కుమార్ ఎన్‌డీయేలో చేరారు. పశ్చిమ బెంగాల్‌లో
మమతా బెనర్జీ కాంగ్రెస్ మీద దాడులు చేస్తోంది. ఈ సమస్యలేవీ పరిష్కరించకుండా రాహుల్
గాంధీ యాత్ర చేస్తున్నారు. నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ ఈ యాత్రతో సమయం వృధా
చేస్తున్నారు’’ అని రఫీక్ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ తమపార్టీలోని సీనియర్ నాయకులతో కలిసి కూర్చుని అంతర్గత
విషయాలను పరిష్కరించుకోవాలి, మిగతా పార్టీలతో సత్సంబంధాలు పెంచుకోవాలి అని రఫీక్
చెప్పుకొచ్చారు.
‘‘ఇతర పార్టీలతో సంబంధాలు మెరుగుపరచుకోవాలంటే కాంగ్రెస్ కొన్ని
త్యాగాలు చేయాలి. ఇతర రాజకీయ పార్టీలకు సీట్లు ఇవ్వాలి. ప్రాంతీయ పార్టీలకు గౌరవం
ఇవ్వాలి. అలా చేస్తేనే కాంగ్రెస్‌కు లాభం కలుగుతుంది. లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ
పూర్తిగా సిద్ధమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలో పర్యటించారు, ఇప్పుడు
ప్రధానమంత్రి కూడా వస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా అస్సాంలో పర్యటించారు.
సీనియర్ బీజేపీ నాయకులు ప్రతీ నెలా అస్సాం వస్తున్నారు, సమావేశాలు
నిర్వహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నిద్రపోతోంది. వాళ్ళు ఏమీ చేయడం లేదు. రాహుల్
గాంధీ యాత్ర వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి లాభమైనా కలుగుతుందని నాకు అనిపించడం లేదు’’
అని రఫీక్ కుండబద్దలుకొట్టేసారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ సాయంత్రం గువాహటి
చేరుకుంటారు, రేపు అస్సాంలో పర్యటిస్తారు. సుమారు 12వేల కోట్ల విలువైన వివిధ
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.