మొదటి భాగం ఇక్కడ చదవండి….
ఆ తరువాత….
జెఎస్ఎఫ్ఎం అధినేత ఏం చెప్పారంటే….
‘‘భారత్-పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు, ప్రత్యేకించి ఈమధ్య జరిగిన ఆపరేషన్లు చాలావరకూ చైనా వల్ల తలెత్తినవే. పాకిస్తాన్ మీద చైనా తన ప్రభావం చూపిస్తోంది. ఈ ఘర్షణ భారత్-పాక్ వ్యవహారం మాత్రమే కాదు. అది భారత్-చైనా ఘర్షణగా ముదురుతోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’’.
‘‘ప్రస్తుతం పాకిస్తాన్‌లోని అతివాద మతగురువులు ప్రతీ నగరంలోనూ ఆందోళనలను రెచ్చగొడుతున్నారు. వాళ్ళు బహిరంగంగానే హింసాకాండకు పిలుపునిస్తున్నారు. గత నాలుగైదేళ్ళలో జరిగిన పరిణామాలు దేశపు, ముఖ్యంగా సైన్యపు, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసాయి. ఇమ్రాన్‌ఖాన్ పాలనాకాలంలో కంటోన్మెంట్ల మీద దాడులు జరుగుతుండేవి. బలోచిస్తాన్, సింధ్, తదితర ప్రాంతాల్లో సంఘర్షణలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ యుద్ధం వారి నైతిక స్థైర్యాన్ని మరింత పెంచింది.’’
‘‘సింధ్ ప్రాంతంలో ఏదైనా ఉద్యమం జరిగితే దాని ప్రభావం పాకిస్తాన్ మీద గణనీయంగా ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సింధ్ వెన్నెముక వంటిది. దేశం ఆదాయంలో 75 నుంచి 80 శాతం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. కాబట్టి ముందు ఈ ప్రాంతాన్ని విముక్తం చేయాలి. పంజాబ్‌ను ఐదు నదుల ప్రాంతం అనడానికీ, పాకిస్తాన్‌ను సప్త సింధు అనడానికీ మూలకారణం మా సింధ్ ప్రాంతమే. మా వరకూ మాకు సింధు అనేది మా సంస్కృతి. భారతదేశంతోనూ, సనాతన ధర్మంతోనూ సుసంపన్నమైన సంస్కృతి మా సొంతం. ఈ ఉగ్రవాద దేశం నుంచి మేము మా గొప్ప వారసత్వాన్ని మళ్ళీ సాధించుకోవాలి.’’
‘‘పాకిస్తాన్ దుష్ట బుద్ధి ఎప్పటికీ మారదు. నాలుగు రోజుల క్రితం కూడా వాళ్ళు సుమారు ఏడుగురు ఉగ్రవాదులను బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి భారత్‌లోకి పంపించారు. పాకిస్తాన్‌లోని ఈ 12 కోట్ల జనాభాని ఎంతగా అతివాదులుగా మార్చేసారంటే, వాళ్ళు జిహాద్ (పవిత్ర యుద్ధం) పేరుతో ఆత్మాహుతి దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.’’
సహితో చాలా స్పష్టంగా ఇలా చెప్పారు. ‘‘మేము భారతదేశంతో ఉండాలి అనుకుంటున్నాము. కేవలం బలోచిస్తాన్‌కే కాదు, మాకు కూడా విముక్తి కావాలి. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, మా స్వతంత్ర ప్రయత్నాలకు అండగా నిలవడానికీ భారతదేశం ఒక వ్యూహాన్ని అమలు చేసేందుకు వీలుగా సిద్ధపడాలి.’’
‘‘కొద్ది రోజుల క్రితం భారత ప్రభుత్వం కశ్మీర్ ప్రాంతంలో మూడు నుంచి ఐదు ఇళ్ళను తగులబెట్టేసింది. అవి ముస్లిముల ఇళ్ళనీ, వాళ్ళ మీద భారత్ ఉగ్రవాదులు అన్న ముద్ర వేసి తగలబెట్టేసిందనీ పాకిస్తాన్ ఇక్కడ ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ వాస్తవాలను మార్చేసే కథన పద్ధతి (నెరేటివ్) అది. సామాజిక మాధ్యమాలు, మీడియా సంస్థలు, వీడియో కథనాల మీద పాకిస్తాన్ దృష్టి సారించాలి. అవి చాలా ప్రమాదకరమైనవి. వాటిని విస్మరించకూడదు’’ అని జఫర్ సహితో చెప్పారు.
సింధ్‌లో హిందువుల ఊచకోత –మానవ సంక్షోభం:
పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సిపి) జనవరి 2025 నివేదిక పేరు ‘‘హిందూ సమాజం సింధ్‌ను విడిచి పెట్టేస్తోందా?’’. ఆ నివేదిక పాకిస్తాన్‌లో హిందువులు, ఇతర మత మైనారిటీల వ్యవస్థీకృత నిర్మూలన గురించి వివరంగా వెల్లడిస్తుంది. 2025 జనవరి 23న విడుదలైన ఆ నివేదిక… పాకిస్తాన్‌లో దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితి, ఇస్లామిక్ హింసాకాండ, ఆర్థిక సవాళ్ళు, వాతావరణ పరిస్థితుల కారణంగా పాకిస్తాన్‌లో హిందువులు ఎక్కువగా ఉండే సింధ్ ప్రొవిన్స్ నుంచి హిందువులు వలస పోతుండడం గురించి వివరించింది.
హెచ్ఆర్‌సిపి నివేదిక, హిందువుల వలసలకు మూలాలను చారిత్రక సంఘటనల్లో చూపించింది. 1986లో సుక్కూరులో హిందూ వ్యాపారులను కిడ్నాప్ చేసిన నేరంలో దోషులుగా నిరూపణ అయిన 34 మంది, జైలును బద్దలుగొట్టి పారిపోయిన ఘటన భీతావహ వాతావరణాన్ని సృష్టించింది.
1992లో భారతదేశంలో వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత పాకిస్తాన్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. గుడులు, ప్రార్థనా స్థలాల మీద దాడులు పెచ్చుమీరిపోయాయి. ‘‘భారతదేశంలో సంఘటనలు పాకిస్తాన్‌లో హింసాకాండ పెరగడానికి ఉత్ప్రేరకంగా మారాయి. దాంతో పాకిస్తానీ హిందువులు భారత్‌కు వలస పోవడం ట్రెండ్‌గా మారింది’’ అని ఆ నివేదిక చెప్పింది.
పాకిస్తాన్‌లో హిందువుల మీద జరుగుతున్న తాజా హింసాకాండను హెచ్‌సిఆర్‌పి నివేదిక పొందుపరిచింది. డబ్బుల కోసం కిడ్నాప్‌లు, బలవంతపు మతమార్పిడులు, లక్షిత దాడులూ వాటిలో ప్రధానమైనవి. ‘‘నదీ ప్రాంతాల దగ్గర ఉండే దోపిడీ దొంగల ముఠాలు డబ్బుల కోసం కిడ్నాప్‌లు చేయడం పెరిగిపోవడంతో హిందువులు భయపడిపోతున్నారు’’ అని ఆ నివేదిక పేర్కొంది. దానికి నిదర్శనంగా ఘోట్కీ, జకోబాబాద్, కష్మోర్ వంటి ఉత్తర సింధు జిల్లాల్లో హిందూ నాయకుల ఇంటర్‌వ్యూలను ఉటంకించింది. ధనవంతులైన హిందువులు, ప్రత్యేకించి అగ్రవర్ణాల వారిని వారి మతపరమైన ఉనికి, ఆర్థిక స్థాయి ఆధారంగా లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నారని ఆయా ముఖాముఖీల ద్వారా తెలుస్తోంది.
(సశేషం)