arrests in Nijjar killing case soon:
ఖలిస్తానీ
వేర్పాటువాది, తీవ్రవాద కార్యకలాపాల్లో
పాల్గొన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నిందితులను అరెస్టు చేసేందుకు కెనడా
పోలీసులు సిద్ధమైనట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. రాబోయే కొన్ని వారాల్లో నిందితులను
అరెస్టు చేయడం ద్వారా కేసుకు ముగింపు పలికే సన్నాహాల్లో పోలీసు వర్గాలు ఉన్నాయంటూ ‘ది
గ్లోబ్ అండ్ మేల్’ అనే మీడియా సంస్థ ప్రకటించింది.
ఈ
ఏడాది బ్రిటీష్ కొలంబియాలో నిజ్జర్ ను కాల్చి చంపిన ఇద్దరు దుండగులను త్వరలో పోలీసులు అదుపులోకి
తీసుకోబోతున్నారనేది సదరు సంస్థ వెల్లడించిన వార్త సారాంశం. ఈ వార్తా పత్రిక పశ్చిమ,
మధ్య కెనడాలోని ఐదు ముఖ్య నగరాల్లో ప్రింట్ అవుతుంది. నిజ్జర్ హత్య ప్రభావం భారత-కెనడా మధ్య ద్వైపాక్షిక
సంబంధాలపై ప్రభావం చూపిన నేపథ్యంలో హంతకులను అరెస్టు చేయడం కీలకంగా మారుతుందని
పేర్కొంది.
నిజ్జర్
ను మట్టుబెట్టిన హంతకులు కెనడాను వదిలిపోలేదని గత కొన్ని నెలలుగా వారు పోలీసుల
నిఘాలో ఉన్నారని కెనడా మీడియా వెల్లడించింది. మరో రెండు మీడియా సంస్థలు కూడా ఈ
విషయాన్ని ధ్రువీకరిస్తూ కథనాలు ప్రచురించాయి.
నిందితులను
అరెస్టు చేసిన తర్వాత హత్యలో వారి పాత్రతో పాటు భారత్ ప్రభుత్వపాత్రను కూడా
తేటతెల్లం చేస్తారని కథనంలో తెలిపిన వార్తా పత్రిక, తమ సోర్సు వివరాలు
వెల్లడించలేమని తెలిపింది. దేశ భద్రత, పోలీసు చట్టాలను గౌరవించి గోప్యత
పాటిస్తున్నామని వివరించింది.
నిజ్జర్
హత్యకు భారత ప్రభుత్వం కుట్రపన్నిందంటూ కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత్
తగురీతిలో బదులిచ్చింది. దీంతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. కెనడాలోని
సర్రే గురుద్వారా లో జూన్ 18 నిజ్జర్ హత్యకు గురయ్యాడు.