ఇస్లామిక్ అతివాదుల చేతిలోకి వెళ్ళిపోయిన బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల మీద దాడులు, నేరాలూ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని పతనం చేసిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల బతుకులు దుర్భరప్రాయమైపోయాయి. ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందువులను, వారి కుటుంబాలను, వ్యాపారాలను, ధార్మిక సంస్థలను, దేవాలయాలనూ లక్ష్యం చేసుకుని హింసించిన సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్‌లోని ఇస్లామిక్ అతివాదులు ఇప్పుడు దుర్గా పూజ వేడుకలను టార్గెట్ చేసుకున్నారు. రాబోయే దసరా నవరాత్రుల్లో హిందువులను దోచేసే ప్లాన్ వేసారు. దేశంలోని ప్రతీ దుర్గా పూజా కమిటీకి నోటీసులు పంపించారు. ఈ యేడాది దుర్గా పూజ చేయాలనుకునే కమిటీ ముస్లిం అతివాద గ్రూపులకు రూ.ఐదు లక్షలు చెల్లించాలి. అదీ ఆ నోటీసుల సారాంశం.
‘వీణాపాణి’ పూజా కమిటీ సభ్యుడొకరు ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. పేరు చెప్పడానికి భయపడిన ఆయన, కొంతమంది యువకులు మోటార్ సైకిళ్ళపై వచ్చి వసూళ్ళ వివరాలతో లేఖ ఇచ్చారని చెప్పాడు. ఇప్పటికే దేశంలోని చాలావరకూ దుర్గాపూజా కమిటీలకు అలాంటి నోటీసులు అందాయి. బెంగాలీలో రాసి ఉన్న ఆ నోటీసులో, ఐదు లక్షల జమాత్ చెల్లించకుండా కార్యక్రమాలు చేపట్టే పూజా కమిటీలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని బెదిరింపులు రాసి ఉన్నాయి. వచ్చే వారంలోగా ఢాకా దగ్గర కాళీబజార్ ప్రాంతంలోని ఒక నిర్దిష్ట ప్రదేశం దగ్గర ఆ సొమ్ములు చెల్లించాలని ఆ బెదిరింపు లేఖలో పేర్కొన్నారు. ఆ విషయాన్ని ఎవరికి చెప్పినా తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. నిర్దేశించిన సొమ్మును చెల్లించకపోతే ప్రభుత్వం, పోలీసులు లేదా సైన్యం కూడా రక్షించలేరని హెచ్చరించారు. అంతేకాదు, పూజా కమిటీలు ఆ మొత్తాన్ని చెల్లించకపోతే కమిటీ సభ్యుల కుటుంబసభ్యులను చంపేస్తామని కూడా అతివాదులు బెదిరించారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందూ సమాజానికి దుర్గా పూజ వేడుకలు జరుపుకోవడం నానాటికీ కష్టసాధ్యమవుతోంది. ప్రతీయేటా దసరా సమయంలో ఇస్లామిక్ అతివాదులు హిందూ దేవాలయాలను, దుర్గాపూజ పండాల్స్నూ లక్ష్యం చేసుకుని దాడులు చేయడం మామూలే. ఇప్పుడు ఉదారవాద షేక్ హసీనా ప్రభుత్వం సైతం లేకపోవడంతో వారి అరాచకాలకు అంతే లేకుండా పోయింది. దాంతో బంగ్లాదేశీ హిందువులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పడు తమ పండుగను సైతం చేసుకోలేని దుస్థితిలో పడిపోయారు.