విద్యాశాఖలో ముఖ్యమంత్రి
జగన్ బహిరంగ అవినీతికి తెరలేపారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ- ఐబీ
(ఇంటర్నేషనల్ బెకాలారెట్) సిలబస్ ను పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు చేసుకుంటున్న
ఒప్పందం, వైసీపీ ప్రభుత్వ అవినీతికి కేంద్ర బిందువు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి క్విడ్ ప్రో కోకి ఈ ఒప్పందం సజీవ సాక్ష్యం అని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని 44,381 ప్రభుత్వ పాఠశాలలతో పాటు, 13,406
ప్రైవేటు పాఠశాలలు, 839 ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ను బలవంతంగా
రుద్దే ప్రయత్నం చేస్తున్నారని లెక్కలతో వివరించారు. విద్యావ్యవస్థను వైసీపీ నాశనం
చేయడానికి ప్రణాళిక వేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
సీబీఎస్ఈ సిలబస్ అమలుకు కేంద్రం అనుమతుల కోసం
ప్రతి పాఠశాలకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని చెప్పడంతో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం
పక్కన పెట్టిందన్నారు. రాష్ట్రంలోని కేవలం 1005 స్కూళ్ళలో మాత్రమే సీబీఎస్ఈ అమలు అవుతోందన్నారు. అది కూడా కేంద్రం అనుమతులు
ఉచితంగా ఇవ్వడంతోనే సాధ్యమైందన్నారు. ఐబీ సిలబస్ అమలు కోసం ఒక్కో పాఠశాలకు రూ.13
లక్షల నుంచి రూ.17 లక్షల మేర చెల్లించేందుకు సిద్ధం అవుతోందంటే
దీని వెనుక ఆంతర్యం ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఒప్పందంలో కొన్ని నిబంధనలు అత్యంత దారుణంగా
ఉన్నాయన్నారు. సిలబస్ కు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను బయటవారికి
ఇవ్వడానికి వీలులేదు అని ప్రధాన క్లాజులో ఉందన్నారు. ఈ ట్రైనింగ్ కోసం రూ.1,200
కోట్లు నుంచి రూ.1500 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
రెండో ప్రధాన బైండింగ్ నిబంధనను పరిశీలిస్తే ఈ
సంస్థ జెనీవా ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంటే
స్విట్జర్లాండ్ చట్టాలు మాత్రమే సంస్థకు వర్తిస్తాయి. దేశ చట్టాలతో వారికి పని
లేదు. భవిష్యత్తులో సంస్థ విషయంలో ఏదైనా తప్పు జరిగినా దేశ చట్టాలు పనికి రావు
అనేది ప్రధానమైన క్లాజు అని వివరించారు.
పోలవరం రివర్స్ టెండరింగు సమయంలో సాక్షాత్తూ
ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండరును అంగీకరించే ముందు
జ్యూడిషియరీ రివ్యూకు పంపుతాం అని చెప్పారు. ఇప్పుడు విద్యా శాఖలో అత్యంత కీలకమైన
ఈ ఒప్పందాన్ని న్యాయ సమీక్షకు ఎందుకు పంపలేదని నిలదీశారు.