సౌర పరిశీలనకు ఆదిత్య- ఎల్ 1 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ ఇస్రో మరో ఘనత సాధించింది. ఉపగ్రహ భూ కక్ష్యను విజయవంతంగా పెంచినట్టు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి ఉపగ్రహ కక్ష్య పెంపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రక్రియ తరవాత ఆదిత్య- ఎల్ 1 ఉపగ్రహం 22,459 కి.మీ దూరంలోని కక్ష్యంలోకి ప్రవేశించింది. ఎల్లుండి మరోసారి ఉపగ్రహ కక్ష్యను పెంచనున్నట్టు ఇస్రో ప్రకటించింది.
పీఎస్ఎల్వీ- సీ 57 వాహకనౌక ఆదిత్య- ఎల్ 1 ఉపగ్రహాన్ని శనివారంనాడు విజయవంతంగా ప్రయోగించారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టిన సంగతి తెలిసిందే. 63 నిమిషాల ప్రయాణం తరవాత ఉపగ్రహాన్ని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 16 రోజుల పాటు ఈ ఉపగ్రహం భూ కక్ష్యంలో తిరిగి, తరవాత 15 లక్షల కి.మీ దూరంలోని నిర్దేశించిన ఎల్ 1 బిందువు దిశగా ప్రయాణం ప్రారంభిస్తుందని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం ద్వారా ఫోటో స్పియర్, క్రోమో స్పియర్ సహా లోపలి పొరలపై కూడా అధ్యయనం చేయనున్నారు. అక్కడి వాతావరణంపై పరిశోధనలు జరపడానికి ఈ ఉపగ్రహం పనిచేయనుంది.