తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్
స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్1 ఆర్బిటర్ తన అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ప్రారంభించింది.
ఈ ఉదయం గం. 11.50 ని.కు పీఎస్ఎల్వీ-సీ57
వాహకనౌక ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి తీసుకుని వెళ్ళింది.
అక్కడినుంచీ ఆదిత్యను నిర్దేశిత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ
కార్యక్రమం అంతా ఎలాంటి అవాంతరాలూ లేకుండా సజావుగా సాగిపోయింది. దాంతో ఆదిత్య ఎల్1
ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
సూర్యుడి చుట్టూ నిర్దేశిత దీర్ఘవృత్తాకార
కక్ష్యలోకి చేరుకున్న ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్, రోదసిలో నాలుగు నెలల పాటు నిర్విరామంగా
ప్రయాణం చేసి తనకు నిర్దేశించిన పరిశీలక స్థానానికి చేరుకుంటుంది. భూమి నుంచి
15లక్షల కిటోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజియన్ పాయింట్ 1, క్లుప్తంగా ఎల్1, వద్దకు
చేరుకుంటుంది. అక్కడినుంచీ హాలో ఆర్బిట్ అనబడే సౌరకక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
ఆదిత్య ఎల్1లో మొత్తం 7 పేలోడ్లు ఉన్నాయి.
వాటిలో నాలుగు పేలోడ్లు సూర్యుడి నుంచి వెలువడే కాంతిని అధ్యయనం చేస్తాయి.
సూర్యుడి మీద అయస్కాంత క్షేత్రాలు ఎలా పనిచేస్తున్నాయి, ప్లాస్మా ఇన్-సిట్యు పెరామీటర్స్
వంటి అంశాలను మిగతా మూడే పేలోడ్లూ అధ్యయనం చేస్తాయి.
పీఎస్ఎల్వీ రాకెట్ ఆదిత్య ఆర్బిటర్‌ను అంతరిక్షంలోని
కక్ష్యలో ప్రవేశపెట్టడంతో ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్
వ్యాఖ్యానించారు. తన తోటి శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలియజేసారు,
ఆదిత్య ప్రయోగం ప్రధాన లక్ష్యాలు ఏంటంటే
(1) సోలార్ కరోనాలోని భౌతికశాస్త్ర దృగ్విషయాలను,
అసలు సూర్యుడు ఎలా వేడెక్కుతాడోనని అధ్యయనం చేయడం
(2) సౌర వాతావరణంలో సౌరవాయువుల వేగం, త్వరణం,
తదితర అంశాలను అధ్యయనం చేయడం
(3) సౌర వాయువుల పంపిణీ, టెంపరేచర్ ఆనిసోట్రోపీ
(4) కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కేంద్రం ఎక్కడుందో
కనుగొనడం
(5) సౌరజ్వాలలకు కారణమేంటి, సూర్యుడి మీది
వాతావరణం ఎలా ఉంటుందో కనుగొనడం
…. ఇవీ ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు.
ఈ లక్ష్యాలను సాధించే
ప్రయత్నంలో సూర్యుడికి చేరువగా సాగుతోంది ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్.