Saturday, May 11, 2024

Logo
Loading...
upload upload upload

praja galam

ఎమ్మిగనూరులో ప్రజాగళం :‘ నమ్మినోళ్ళను నట్టేట ముంచే వ్యక్తి జగన్’

నమ్మినోళ్ళను నట్టేట ముంచే వ్యక్తి వైసీపీ అధినేత జగన్ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగళంలో పాల్గొన్న చంద్రబాబు, ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు. టీడీపీ డీఎన్ఏలోనే బీసీ ఉందన్న చంద్రబాబు, వైసీపీ ఒకే సామాజికవర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటుందని విమర్శించారు.  రాయలసీమలో 102 ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. టీడీపీకి అధికారమిస్తే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తామని వాగ్దానం చేశారు.

వెనుకబడిన వర్గాలకు రూ.1.5 లక్షల కోట్లతో సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు, దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తామన్నారు. కురబలను ఎస్సీల్లో చేర్చడంతో పాటు, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చేనేతలో ఎక్కువగా ఉండే ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు.

బీసీ భవనాలు కట్టిస్తామన్నారు. బుడగ జంగాలను ఎస్సీల్లో చేరుస్తామన్నారు. హ్యాండ్ లూమ్ కు 200 యూనిట్లు, పవర్ లూమ్ కు 500 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందజేస్తామని చంద్రబాబు అన్నారు. టికెట్ల కేటాయింపులో వెనుకబడిన వర్గాలకు టీడీపీ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.

T Ramesh | 14:48 PM, Sun Mar 31, 2024

ప్రొద్దుటూరులో ప్రజాగళం : సీమకు జగన్ ఏం చేశారు...?

గడిచిన ఐదేళ్ళ పాలనలో రాయలసీమకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడిన చంద్రబాబు, పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మడం లేదన్నారు. ‘ట్రెండ్‌ మారింది..  ప్రజలు వైసీపీ బెండు తీస్తారు’ అని  ఎద్దేవా చేశారు.

కడపకు స్టీల్‌ప్లాంట్‌ వచ్చి ఉంటే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవన్న చంద్రబాబు, టీడీపీ హయాంలోనే కియా మోటార్స్ ఏర్పాటు అయిందన్నారు. కరవుసీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచమంతా పరిగెడుతున్నాయన్నారు. రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుందన్నారు. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావడమే లక్ష్యమన్నారు.పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలని వివరించారు.

రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనది అని హామీ ఇచ్చిన చంద్రబాబు...‘‘ క్విట్‌ జగన్‌.. సేవ్‌ రాయలసీమ ’’ అని నినదించారు. అసమర్థ, అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

T Ramesh | 14:09 PM, Sat Mar 30, 2024

బుక్కరాయసముద్రంలో చంద్రబాబు : సంపద సృష్టిస్తా, నిజమైన బటన్ నొక్కుతా

టీడీపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపదా సృష్టిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదాయాన్ని పెంచుతూ పేదలకు పంచుతానని చెప్పారు. నిజమైన బటన్ నొక్కి పేదల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్ర, ఉమ్మడి అనంతపురంలో కొనసాగుతోంది. బుక్కరాయసముద్రంలో ఆయన ప్రసంగిస్తూ... సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఉద్ఘాటించారు. 

ఆడబిడ్డ నిధి కింద ప్రతీ మహిళకు నెలకు రూ.1,50 0 అందజేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు,  ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటి వారి ఖాతాలో నేరుగా జమ చేస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం కిద ఒక బిడ్డ ఉంటే రూ.15,000. ఇద్దరు బిడ్డలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు, ఇచ్చే బాధ్యత తనది అని చంద్రబాబు వాగ్దానం చేశారు.

ఆర్టీసీ ఎర్ర బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం  కల్పించడంతో పాటు ప్రతీ  రైతుకు రూ.20 వేల ఆర్థికసాయం అందజేస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే సామాజిక పింఛను  రూ.4 వేలకు పెంచుతామన్నారు.

T Ramesh | 17:22 PM, Thu Mar 28, 2024

పల్నాడు ఎన్డీయే సభలో భద్రతా వైఫల్యం, ఉన్నతాధికారులపై చర్యలు...?

పల్నాడులోని బొప్పూడిలో ఎన్డీయే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యే సభకు లక్షలాది మంది జనం హాజరవుతారని తెలిసి కూడా  సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధి నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిలను తక్షణం విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హెలీప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలికే వారి పేర్లు ముందే అందజేసినా వారిని అనుమతించలేదని, బొకేలు, శాలువలు కూడా తీసుకెళ్ళకుండా అడ్డుకున్నారని, దేవుడి బొమ్మలను పక్కన పడేశారని బీజేపీ నేత పాతూరు  నాగభూషణం అన్నారు. సభకు లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా క్రౌడ్ ను మేనేజ్ చేయడంలో పోలీసు ఉన్నతాధికారులు అలసత్వం వహించారని కూటమి నేతలు మండిపడుతున్నారు.

మార్చి 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడిలో ఎన్డీయే ఆధ్వర్యంలో ప్రజాగళం సభ నిర్వహించగా ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు ముఖ్యనేతలు ఈ సభకు హాజరయ్యారు. తగిన బందోబస్తు కల్పించడంలో పోలీసులు  విఫలమయ్యారు.  ప్రధాన వేదిక ముందు తొక్కిసలాటతో పాటు మైక్ సిస్టమ్ వద్దకు కార్యకర్తలు చొచ్చుకు వచ్చినా అడ్డుకోలేదని కూటమి నేతలు ఆరోపించారు.

ఎన్డీయే సభను భగ్నం చేసేందుకు జరిగిన కుట్రలో కొందరు పోలీసులు పాత్రదారులుగా మారారని చెబుతున్నారు. వీవీఐపీ, వీఐపీ, సామాన్యులకు వేర్వురు ప్రవేశ మార్గాలు ఉన్నప్పటికీ అందరినీ ఒకే మార్గం గుండా అనుమతించడం వెనుక ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ పోలీసులు, వైసీపీకే కొమ్ముకాస్తున్నారని మండిపడుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా పలుసార్లు మైక్ కట్ అయింది. కార్యకర్తలంతా ప్రధాన వేదిక వైపు తొసుకొచ్చారు. ప్రధాని మాట్లాడుతుండగా మైక్ సిస్టమ్ వైపు జనం చొచ్చుకురావడంతో మైక్ మొరాయించింది. దీనిపై ప్రధాని కూడా అసహనం వ్యక్తం చేశారు. అతి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. క్రౌడ్ ను కంట్రోల్ చేయాలని పోలీసులకు సూచించారు. ప్రధాని హాజరైన సభను భగ్నం చేయడం ద్వారా ఎన్డీయే కూటమి మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఆరోపిస్తోంది.

ప్రధాని మోదీ, సభ నుంచి వెళ్ళకముందే జనం  వేదికపైకి రావడంతో కాసేపు గందరగోళం ఏర్పడింది. సభ ప్రారంభానికి ముందే ఎస్పీజీ సిబ్బంది గ్రౌండ్ ను ఆధీనంలోకి తీసుకుని భద్రతా వైఫల్యాలు గుర్తించారు. స్థానిక పోలీసులకు పలు సూచనలు చేసి బందోబస్తును పటిష్ఠం చేయాలని కోరారు. కానీ స్థానిక అధికారులు సహకరించలేదని కూటమి నేతలు చెబుతున్నారు. స్థానిక అధికారుల వైఫల్యంతో ప్రధాని భద్రతా సిబ్బంది హైరానా పడింది. ఉరుకులు, పరుగులు పెడుతూ ప్రధానికి రక్షణకవచంగా నిలిచారు.

సభ లో భద్రతా  వైఫల్యంలో నిఘా వర్గాల నుంచి అందిన నివేదిక మేరకు పల్నాడు ఎస్పీ రవిశంకర్ నుంచి విధుల నుంచి తొలగించబోతున్నట్లు సమాచారం.

T Ramesh | 13:20 PM, Tue Mar 19, 2024

వికసిత్ భారత్ తో పాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా సాధ్యం: ప్రధాని  మోదీ

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టాలని, ఈ సారి ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లు రావాలని అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. పల్నాడు జిల్లా బొప్పూడిలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెలుగు లో ప్రసంగం మొదలు పెట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

‘‘నా ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత తొలిసారి పల్నాడుకు వచ్చాను.  కోటప్ప కొండలో కొలువైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తుందని భావిస్తున్నా’’ అన్నారు. ముచ్చటగా మూడోసారి ఎన్డీయే కూటమి  అధికారంలోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షించారు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటే ఎన్డీయేకు 400 పై చిలుకు  సీట్లు వచ్చేలా కృషి చేయాలని సభావేదిక నుంచి ప్రధాని కోరారు.

ప్రాంతీయ, జాతీయ భావాల కలయికగా ఎన్డీయే కూటమి ముందుకెళుతుందన్న ప్రధాని మోదీ, కూటమిలో చేరే భాగస్వాముల సంఖ్య పెరిగితే బలం పెరుగుతుందన్నారు.  ఎన్డీయే కూటమి లక్ష్యం వికసిత భారతదేశం అన్న ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం  ఏర్పడాలని ఆకాంక్షించారు. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతుందన్నారు.

ఏపీ ఆవాస్‌ యోజన కింద 10 లక్షల ఇళ్లు కేంద్ర కేటాయించందని మోదీ వివరించారు. జలజీవన్‌ మిషన్‌ కింద కోటి ఇళ్లకు తాగునీరు అందించడంతో పాటు కిసాన్‌ సమ్మాన్‌ నిధితో పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు కేటాయించిందని  గుర్తు చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌తో ఏపీలో 1.25 కోట్ల మందికి లబ్ధి జరిగిందన్నారు.  విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన యూనివర్సిటీ విశాఖలో ఐఐఎం, ఐఐఈ, తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌, మంగళగిరిలో ఎయిమ్స్‌ ను కేంద్రప్రభుత్వం నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా, మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకున్నారు. పవన్ అంటూ మోదీ ఒక్కసారిగా పైకి లేచారు. సభా ప్రాంగణంలో లైట్ టవర్లపైకి వివిధ పార్టీల కార్యకర్తలు ఎక్కడాన్ని గమనించి వారిని కిందకు దింపారు. "లైట్ టవర్స్ నుంచి దిగిపోండి... మీ ప్రాణాలు ఎంతో విలువైనవి. ఆ లైట్ టవర్లకు కరెంటు  ఉంటుంది... కరెంటు తీగలకు దూరంగా ఉండాలని కోరుతున్నా. ప్రమాదాలు జరిగితే ఎంతో బాధగా ఉంటుంది" అని మోదీ అన్నారు.  మోదీ సూచనతో కార్యకర్తలంతా టవర్ నుంచి కిందకు దిగారు.

T Ramesh | 19:02 PM, Sun Mar 17, 2024

ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎన్డీయే కూటమిదే, ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని గా బాధ్యతలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరి పేట మండల పరిధిలోని బొప్పూడి లో నిర్వహించిన ఎన్డీయే కూటమి సభ ప్రజాగళంలో పాల్గొని ప్రసంగించిన పవన్, గతంలో తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరితే, ఈ సారి బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులతో ఎన్డీయే పునర్‌కలయిక జరిగిందన్నారు.

తాడేపల్లి గూడెం సభ లో తాను దేవదత్తం పూరిస్తే పల్నాడు సభలో ప్రధాని పాంచజన్యం పూరించారని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన పవన్, ఎన్డీయే కూటమిదే విజయం అన్నారు.  కూటమిదే అధికారపీఠమని పునరుద్ఘాటించారు. చిలకలూరిపేట సభలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున స్వాగతం పలికుతున్నామని వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో  దేశమంతా  డిజిటల్ ట్రాన్స్ సెక్షన్లు జరుగుతుంటే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. బ్లాక్ మనీ ఎటు పోతుందని పవన్ ప్రశ్నించారు.

 వైసీపీలో పాలనలో ఆంధ్రప్రదేశ్ గంజాయికి రాజధానిగా మారిందన్నారు. 2019-21 మధ్య రాష్ట్రంలో మహిళలు అదృశ్యమైన విషయాన్ని సభలో పవన్ ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులు దాడులు చేశారన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా   విదేశీ సంస్థలు మనదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కంపెనీలు తరలిపోయాయన్నారు.  వైసీపీ పాలనతో విసుగు చెందిన పారిశ్రామిక వేత్తలు పొరుగు రాష్ట్రానికి తరలిపోయారన్నారు.

T Ramesh | 18:01 PM, Sun Mar 17, 2024
upload
upload