Friday, May 10, 2024

Logo
Loading...
google-add

జనసేనకు పోతిన మహేష్ రాజీనామా

P Phaneendra | 21:40 PM, Mon Apr 08, 2024

Potina Mahesh quits Jana Sena Party 

జనసేన పార్టీలో కీలక నాయకుడైన పోతిన వెంకట మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేసారు. పవన్ కళ్యాణ్‌ను నమ్మి మోసపోయానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

పోతిన వెంకట మహేష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. జనసేనకు  తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు కుదిరి, విజయవాడ వెస్ట్ టికెట్ బీజేపీకి కేటాయించినప్పటికీ పోతినకు పవన్ కళ్యాణ్ రెండో జాబితాలో టికెట్ దక్కుతుందని ఆశ చూపించారు. చివరికి ఆ స్థానంలో బీజేపీ అభ్యర్ధిగా సుజనా చౌదరి పోటీ చేయడం ఖాయమవడంతో తనకు ఏం మిగిలిందో ఆలస్యంగా అర్ధమైంది. దాంతో జనసేన పార్టీకి రాజీనామా చేసారు.

ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోతిన మహేష్, తాను ఆవేశంతోనో లేక సీటు రాలేదన్న అసంతృప్తితోనో రాజీనామా చేయలేదని చెప్పారు. భవిష్యత్తును ఇచ్చేవాడే నాయకుడు తప్ప నటించేవాడు నాయకుడు కాలేడంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే వ్యక్తి అనీ, ఆయన స్వార్థానికి తనలాంటి వాళ్ళ కుటుంబాలు బలైపోతున్నాయనీ ఆవేదన వ్యక్తం చేసారు. 25కేజీల బియ్యం కాదు, 25ఏళ్ళ భవిష్యత్తు కావాలని కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ కనీసం 25 సీట్లలో పోటీ చేయడం లేదనీ, 25 రోజుల తర్వాత పార్టీ భవిష్యత్తేమిటో చెప్పగలరా అనీ నిలదీసారు. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ పెట్టారని ఆరోపించిన పోతిన, కాపు యువతను బలితీసుకోవద్దని కన్నీటితో అభ్యర్ధిస్తున్నానంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. కూటమిలో జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లలో నిఖార్సైన పార్టీ అభ్యర్ధులు 7 అసెంబ్లీ, 1 లోక్‌సభ సీట్లలో మాత్రమే ఉన్నారని పోతిన ఆవేదన వ్యక్తం చేసారు.

పవన్ కళ్యాణ్ స్వార్థ వైఖరితో కులాల మధ్య చిచ్చు రాజేయాలని చూస్తున్నారని పోతిన ఆరోపించారు. జనసేన మోహరించిన అభ్యర్ధుల్లో ఏ ఒక్కరికీ కాపులు అండగా నిలవడం లేదన్నారు. కాపులు జనసేనకు, దూరమయ్యారనీ, పవన్‌కళ్యాణ్‌కు వారు మద్దతివ్వడం లేదనీ పోతిన మహేష్ చెప్పుకొచ్చారు. జనసేన ప్రజారాజ్యం-2లా చరిత్రలో కలిసిపోతుందని పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేసారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

google-add
google-add
google-add

చరిత్రలో ఈరోజు

విధాత తలపు బాపు

P Phaneendra | 15:38 PM, Fri Dec 15, 2023
google-add
google-add