పాకిస్తాన్‌కు గూఢచారిగా పనిచేస్తూ దొరికిపోయిన హర్యానా యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రా నిజం ఒప్పుకుందని తెలుస్తోంది. తాను పాక్ గూఢచారిని అని అంగీకరించిందని సమాచారం. విచారణ అధికారుల ఎదుట ఆమె నేరాన్ని ఒప్పుకుంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం పని చేసినట్లు జ్యోతి, అధికారుల ముందు తెలిపింది. ఐఎస్‌ఐ అధికారులను పలుమార్లు కలిసానని ఒప్పుకుంది. అంతే కాకుండా వాళ్ళు అడిగిన సమాచారాన్ని చేరవేసానంటూ విచారణ సమయంలో ఆమె అంగీకరించింది. దాని కోసం ఐఎస్‌ఐ ఏజెంట్లతో రహస్యంగా చాట్ చేసినట్లు కూడా జ్యోతి చెప్పిందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జ్యోతీ మల్హోత్రా విచారణలో ఒప్పుకున్న విషయాలు ఈ కింది విధంగా ఉన్నాయి…
న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో తాను నిత్యం టచ్‌లో ఉండేదాన్ని ఆమె దర్యాప్తు అధికారుల ముందు ఒప్పుకుంది. 2023లో వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్‌కు వెళ్ళినప్పుడు డానిష్‌తో మొదటిసారి పరిచయం ఏర్పడిందని తెలియజేసింది. జ్యోతి మన దేశంలోని కీలక ప్రాంతాల గురించి పాక్ ఏజెంట్లకు సమాచారం ఇచ్చిందని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేసిందని తాజాగా తేలింది. సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ దాడులు చేసినప్పుడు అక్కడ భారత ప్రభుత్వం బ్లాకౌట్ చేపట్టింది. ఆ బ్లాకౌట్ సమాచారాన్ని కూడా జ్యోతి డానిష్‌కు చేరవేసిందని సమాచారం. దర్యాప్తు బృందం ఆమె నివాసంలో సోదాలు చేపట్టి, మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఆమె బ్యాంక్ ఖాతాల లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు.
జ్యోతీ మల్హోత్రా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపిందని అధికారులు కనుగొన్నారు. పలు ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌లను వినియోగించడం ద్వారా తమ సంప్రదింపులను జ్యోతి రహస్యంగా ఉంచగలిగిందని వారి విచారణలో తేలింది. స్నాప్‌చాట్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కోడ్ లాంగ్వేజ్‌లో జ్యోతి ఐఎస్ఐ ఏజెంట్లతో మాట్లాడిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అలీ హసన్ అనే ఐఎస్‌ఐ హ్యాండ్లర్, జ్యోతి మధ్య వాట్సాప్ చాట్‌లు లభ్యం అయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో అండర్ కవర్ ఆపరేషన్లకు సంబంధించి సంకేత భాషలో వారి మధ్య సాగిన సంభాషణలు దర్యాప్తు బృందానికి లభించాయి.