మొదటి భాగం ఇక్కడ చదవండి
దాని తరువాయి…..
బంగ్లా-భారత్ సరిహద్దులపై చైనా ఆసక్తి:
బంగ్లాదేశ్‌తో చైనా బంధం లాల్‌మొణీర్‌హాట్ ఎయిర్‌బేస్‌కు మాత్రం పరిమితం కాలేదు. ఆ దేశంలో ఆర్థిక, సైనిక ప్రాజెక్టులను చైనా చేజిక్కించుకుంటోంది. బంగ్లాదేశ్ అభివృద్ధిలో ముఖ్యమైన భాగస్వామి అవుతోంది.
చైనా కంపెనీలు రంగ్‌పూర్ దగ్గర పరిశ్రమలతో పాటు సౌర విద్యుత్ ప్లాంట్ కూడా నిర్మిస్తున్నాయి. ఇంకా ఒక శాటిలైట్ సిటీ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ‘‘ఆ పరిశ్రమలు అన్నింటిలోనూ దాదాపు చైనీయులే పని చేస్తున్నారు. వాటిలో స్థానిక బంగ్లాదేశీయులు ఎవ్వరూ లేరు’’ అని ఢాకా కేంద్రంగా పని చేస్తున్న పాత్రికేయుడొకరు పేరు వెల్లడించకూడదన్న షరతు మీద వివరించారు. దాన్ని బట్టి, ఆ పరిశ్రమలు స్థానికులకు ఆర్థిక లబ్ధి కలిగించడం కోసం కాదని, సులువుగా అర్ధం చేసుకోవచ్చు.
మిలటరీ పరంగా చూసుకుంటే, బంగ్లాదేశ్ సైనిక బలగాలకు ఉపకరణాలను ప్రధానంగా సరఫరా చేసేది చైనాయే. ఢాకా, బీజింగ్ మధ్య సైనిక సంబంధాలు బలపడడం భారత్‌కు సమస్యాత్మకం. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు భారత్‌తో సమతుల్యమైన సంబంధాలను నిర్వహించేది. ఆమెను పదవీచ్యుతురాలిని చేసిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయ వైఖరిలో వచ్చిన మార్పుల కారణంగా చైనాకు తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశాలు కలిగాయి. ఆ క్రమంలోనే చైనా నిధులు, సాంకేతికత సహాయంతో లాల్‌మొణీర్‌హాట్ వైమానిక స్థావరం పునరుద్ధరణ ప్రతిపాదన ముందుకొచ్చింది. ఆర్థిక అభివృద్ధి, వ్యూహాత్మక నిఘా అనే రెండు ప్రయోజనాలను సాధించే ప్రాజెక్టుగా దాన్ని చేపట్టారు.
పాకిస్తాన్ పాత్ర, ప్రాంతీయ సమీకరణాలు:
ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేసేందుకు ఈ కథలో పాకిస్తాన్ కూడా చేరింది. లాల్‌మొణీర్‌హాట్ వైమానిక స్థావరం పునరుద్ధరణ ప్రాజెక్టులో సబ్‌కాంట్రాక్టర్‌గా పాకిస్తాన్‌కు చెందిన ఒక కంపెనీ పాల్గొంటోంది. 2025 అక్టోబర్ నుంచి ఆ ప్రాజెక్టు పనులు మొదలవుతాయి. చైనా బృందం పర్యటనకు ముందే, పాకిస్తానీ సైనిక నిఘా విభాగానికి చెందిన బృందం అక్కడినుంచి సరిహద్దు ప్రాంతాలను తనిఖీ చేసిందని విశ్వసనీయ సమాచారం. దక్షిణాసియా ప్రాంతంలో భారత్ ప్రభావాన్ని తగ్గించేందుకు చైనా, పాకిస్తాన్ కలిసి సమన్వయంతో చేస్తున్న ప్రయత్నమే ఆ ప్రాజెక్టు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
చారిత్రకంగా పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈశాన్య భారతదేశంలోని వేర్పాటువాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఉంది. 2009లో అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత ఈ భారత వ్యతిరేక వేర్పాటువాద సంస్థలు బంగ్లాదేశ్ గడ్డ మీద నుంచి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్‌బేస్ ప్రాజెక్టులో పాకిస్తానీ సంస్థల ప్రమేయం ఉండడం, అలాంటి వేర్పాటువాద సంస్థలను పునరుద్ధరింపజేస్తుందని భారత్ సందేహిస్తోంది. పైగా, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉండడం అలాంటి అనమానాలకు ఊతమిస్తోంది.
ఈ వ్యవహారాన్ని భారత రక్షణ అధికారులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ‘‘ఆ ఎయిర్‌బేస్‌ను చైనా, పాకిస్తాన్ వంటి ఇతర దేశాలు వాడుకునేందుకు బంగ్లాదేశ్ అనుమతిస్తుందేమో వేచి చూడాలి. తమ భద్రత పేరిట వైమానిక స్థావరాలను అభివృద్ధి చేసుకోడానికి బంగ్లాదేశ్‌కు అధికారం ఉంది. కానీ వాటిని భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించకూడదు’’ అని భారత రక్షణ అధికారులు వ్యాఖ్యానించారు. అసలు ఆ ఎయిర్‌బేస్‌ను పౌర అవసరాల కోసం వాడతారా, శిక్షణ అవసరాల కోసమా లేక సైనిక అవసరాల కోసం ఉపయోగిస్తారా అనే విషయంలో స్పష్టత లేనందున భారత ఏజెన్సీలు ప్రస్తుతానికి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాయి.
చైనా, పాకిస్తాన్ అండతో బంగ్లాదేశ్‌లో లాల్‌మొణీర్‌హాట్ ఎయిర్‌బేస్ పునరుద్ధరణ కార్యక్రమం, ఈశాన్య ప్రాంతంలో భారతదేశపు వ్యూహాత్మక ప్రయోజనాలకు పెద్ద సవాల్‌గా మారనుంది. ఆ ఎయిర్‌బేస్ సిలిగురి కారిడార్‌కు చేరువగా ఉండడం దాని ప్రాధాన్యతను మరింత పెంచేసింది. దానివల్ల ఏ విదేశీ శక్తి అయినా ఆ సున్నిత ప్రదేశానికి భారత్ చేరగల అవకాశాలను దెబ్బతీయవచ్చు. బంగ్లాదేశ్‌కు తమ మౌలిక వసతులను అభివృద్ధి చేసుకునే సార్వభౌమ హక్కులు ఉన్నాయి. అయితే విదేశీ శక్తుల జోక్యం విషయంలో భారత్ జాగ్రత్తగా స్పందించాల్సి ఉంటుంది.
‘సిలిగురి కారిడార్ (చికెన్ నెక్)’ ప్రాధాన్యత:
సిలిగురి కారిడార్ దేశీయ, అంతర్జాతీయ వ్యాపారానికి చాలా ముఖ్యమైనది. ట్రక్కులు, బస్సులు, ఎస్‌యువిలు, కార్లు, ద్విచక్ర వాహనాలు వంటి వాహనాలు ఆ మార్గం నుంచి రోజుకు పది లక్షలకు పైగా ప్రయాణిస్తాయి. రోజుకు 2400 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా అవుతుంది. దాన్నుంచి భారతదేశానికి రోజుకు రూ.142 కోట్ల ఆదాయం వస్తుంది. ఆ ప్రాంతంలో చమురు, సహజవాయువు, విద్యుత్ రంగాలకు చెందిన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఆ కారిడారే లేకపోతే కలప, డార్జిలింగ్ టీ వంటి తూర్పు భారతదేశపు ఉత్పత్తులకు తీవ్ర విఘాతం కలుగుతుంది.
సిలిగురి కారిడార్ అనబడే ఆ ప్రాంతం భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలతో బిహార్, సిక్కిం రాష్ట్రాలను కలుపుతుంది. చికెన్ నెక్ అని కూడా పిలిచే ఆ ప్రాంతం నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లతో సరిహద్దులు పంచుకుంటోంది. దానికి ఉత్తరాన కేవలం 130 కిలోమీటర్ల దూరంలో చైనా నియంత్రణలోని టిబెట్‌కు చెందిన చుంబీ లోయ ఉంది. అక్కడ చైనా మిలటరీ స్థావరాలు నిర్మిస్తుండడం భారత్‌కు ఆందోళనకరం. రోడ్లు, ఎయిర్‌స్ట్రిప్‌లు, మిలటరీ బేస్‌లు నిర్మిస్తుండడం ప్రాదేశిక ఉద్రిక్తతలను పెచ్చుమీరేలా చేస్తోంది.
చుంబీ లోయ ప్రాంతంలో తన సైనిక ఉనికిని పెంచుకోవడం ద్వారా సిలిగురి కారిడార్ మీద వ్యూహాత్మకంగా ఆధిక్యం సాధించాలని చైనా భావిస్తోంది. బలహీనమైన చికెన్ నెక్ దగ్గరకు సైనిక బలగాలను వేగంగా తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటోంది.
1962 చైనా-భారత్ యుద్ధం తర్వాత అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పెరుగుతున్న సరిహద్దు గొడవలు పూర్తిస్థాయి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. 2017లో డోక్లాం ఘర్షణలు ఆ కారిడార్ ఎంత బలహీనమైనదో తెలియజేసాయి. కాబట్టి భారతదేశం అక్కడ తన రక్షణ వ్యవస్థలను బలపరచుకుంటోంది. ఆ కారిడార్‌లో ఒక సింగిల్ రైల్వే లైన్ ఉంది. అత్యంత సంక్లిష్టమైన మార్గంలో ఉన్న ఆ రైల్వేలైన్‌ను శత్రువులు తమ లక్ష్యం చేసుకున్నాయి.
అడకత్తెరలో పోకచెక్క భూటాన్ :
సిలిగురి కారిడార్‌కు ఉత్తరాన ఉన్న భూటాన్, ప్రాదేశిక భద్రత విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇండో-భూటాన్ మైత్రీ ఒప్పందం ద్వారా భూటాన్ భద్రతను భారత్ స్వీకరించింది. అంటే భూటాన్ ఎదుర్కొనే ముప్పులను భారత్ తన ముప్పులుగా పరిగణిస్తుంది, ఆ దేశానికి సైనిక సహకారం అందిస్తుంది. ఇటీవల కొద్దికాలం క్రితం భూటాన్‌లోని నాలుగు ప్రాంతాలను చైనా అక్రమంగా ఆక్రమించి సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. ఆ చర్య భూటాన్ సార్వభౌమత్వానికి సవాల్‌గా నిలవడమే కాదు, ఆ ప్రదేశంలో ఉద్రిక్తతలను పెంచింది. దాని ప్రభావం నేరుగా వలస వెళ్ళడానికి ప్రోత్సహిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) ద్వారా ఆర్థికంగా ప్రలోభపెడుతోంది. భూటాన్‌కు ఋణాలు ఇచ్చి, ఆ విషవలయంలో బిగించి దౌత్యపరంగా పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండడం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. చైనా భారతదేశాల మధ్య సున్నితమైన సమతౌల్యాన్ని సాధించేందుకు భూటాన్ ఒక అడ్డుతెరలా ఉండేది. ఆ దేశం రక్షణ కోసం భారతదేశం మీదనే ఆధారపడి ఉంది.
(సమాప్తం)