భారత్ సరిహద్దులోని బంగ్లాదేశ్ భూభాగంలో లాల్‌మొణీర్‌హాట్ ఎయిర్‌బేస్ అనే వైమానిక స్థావరం ఉంది. దాన్ని రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించారు. ఆ ఎయిర్‌బేస్ మీద తాజాగా చైనా చూపిస్తున్న ఆసక్తి భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఆ వైమానిక స్థావరం భారత సరిహద్దుకు కేవలం 12-15 కిలోమీటర్ల దూరంలోనూ, ‘చికెన్ నెక్’ అని పిలిచే సిలిగుడి కారిడార్‌కు సుమారు 135 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. దాన్ని పునరుద్ధరించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు, ఆ ప్రాంతం మీద చైనా చూపిస్తున్న ఆసక్తికి చిహ్నం. బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ నియంత్రణలో ఉన్న ఆ స్థావరం కొన్ని దశాబ్దాలుగా వాడుకలో లేదు. బ్రిటిష్ కాలం నాటి మరో ఐదు విమానాశ్రయాలతో పాటు ఈ ఎయిర్‌బేస్‌ను పునరుద్ధరించాలని, మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భావిస్తోంది.
లాల్‌మొణీర్‌హాట్ ఎయిర్‌బేస్ చారిత్రక నేపథ్యం:
లాల్‌మొణీర్‌హాట్ ఎయిర్‌బేస్‌ను బ్రిటిష్ వలస పాలక ప్రభుత్వం 1931లో నిర్మించింది. అది రెండో ప్రపంచ యుద్ధంలో కీలకమైన మిలటరీ స్థావరంగా సేవలందించింది. జపాన్ బలగాల మీద దాడులు చేయడానికి మిత్ర పక్షాలు ఈ స్థావరాన్ని ఫార్వర్డ్ ఎయిర్‌బేస్‌గా ఉపయోగించుకున్నారు. 1166 ఎకరాల్లో విస్తరించిన ఆ ఎయిర్‌బేస్‌లో 4 కిలోమీటర్ల రన్‌వే, పెద్ద టార్మాక్ ఉన్నాయి. ఆ సదుపాయాల వల్లనే, చాలాకాలం నుంచీ వాడుకలో లేకపోయినా, ఆ ఎయిర్‌బేస్ ఇప్పటికీ ప్రాధాన్యత కలిగి ఉంది.
1947లో భారతదేశ విభజన తర్వాత ఆ ఎయిర్‌బేస్ పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళింది. 1958లో కొంతకాలం సాధారణ ప్రజల వినియోగానికి దాన్ని మళ్ళీ తెరిచారు. అయితే దాన్ని చాలాకాలం పాటు వదిలిపెట్టేసారు. 2019లో బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కాలంలో ఆ ఎయిర్‌బేస్‌లోని కొంత భాగంలో బంగ్లాదేశ్ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసారు. ఆ విశ్వవిద్యాలయం ఇప్పుడు బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ నియంత్రణలో ఉంది. ఏదేమైనా ఆ ఎయిర్‌బేస్ సైనిక, వ్యూహాత్మక సామర్థ్యాలు ఇప్పటివరకూ వినియోగంలో లేవు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి.
మొహమ్మద్ యూనుస్ ప్రతిపాదన – చైనా ప్రమేయం:
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కలిగించి అధికారాన్ని వశం చేసుకున్న మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తన విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. లాల్‌మొణీర్‌హాట్ విమానాశ్రయంతో పాటు బ్రిటిష్ కాలం నాటి మరో ఐదు – ఈశ్‌వర్దీ, ఠాకూర్‌గావ్, షంషేర్‌నగర్, కోమిలా, బోగ్రా – విమానాశ్రయాలను పునరుజ్జీవింపజేయాలని ప్రతిపాదించింది. 2025 ఏప్రిల్‌లో మొహమ్మద్ యూనుస్ చైనా పర్యటన తర్వాత ఆ ప్రతిపాదన బలోపేతం అవుతూ వచ్చింది. ఆ పర్యటనలో మొహమ్మద్ యూనుస్ చైనా అధికారులతో తమ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి చర్చించాడని సమాచారం. ఆ పర్యటన సందర్భంగా యూనుస్ ‘‘ఈశాన్య భారతదేశం సహా ఆ ప్రాంతం మొత్తంలో సముద్రానికి రక్షకుడు బంగ్లాదేశ్ మాత్రమే’’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వ్యూహాత్మకంగా ఆ ప్రాంతం వ్యూహాత్మక సున్నితత్వం కారణంగా యూనుస్ వ్యాఖ్యలను భారత్ వివాదాస్పదంగా పరిగణించింది.
లాల్‌మొణీర్‌హాట్ ఎయిర్‌బేస్‌ను చైనా అధికారులు ఇటీవల సందర్శించడం, చైనా ఉద్దేశాల గురించి ఆందోళనలు కలగజేస్తోంది. చైనా అధికారుల పర్యటన ప్రయోజనం ఏమిటన్నది కచ్చితంగా తెలియదు. అయితే ఆ ఎయిర్‌బేస్ మన దేశానికి చెందిన సిలిగురి కారిడార్‌కు (చికెన్ నెక్ ప్రాంతానికి) అత్యంత సమీపంలో ఉండడం మన దేశానికి ఇబ్బందికరమే. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం అనే ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలనూ భారతదేశ ప్రధాన భూభాగంతో కలిపే సిలిగురి కారిడార్ భారతదేశానికి అత్యంత సంక్లిష్టమైన జీవాధారం. ఆ ప్రాంతానికి దగ్గరలో విదేశపు ఉనికి, మరీ ముఖ్యంగా చైనా ఉనికి, భారతదేశ భద్రతకు పెనుసవాల్ కాగలదు.
ఈశాన్య భారతంపై వ్యూహాత్మక ప్రభావాలు:
సిలిగురి కారిడార్ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ఎంత చెప్పినా ఎక్కువ కాదు. అతి సన్నటి ఆ భూమార్గాన్ని శత్రువులు ఆక్రమిస్తే ఈశాన్య రాష్ట్రాలకు భారతదేశంతో సంబంధాలు తెగిపోతాయి. ‘‘లాల్‌మొణీర్‌హాట్ నుంచి భారత్ మిలటరీ కదలికలను పసిగట్టడం చైనాకు సాధ్యం, అంతే కాదు సిలిగురి కారిడార్ దగ్గరి నిఘా గురించి కూడా చైనా కనిపెట్టగలదు’’ అని చైనా అధ్యయనాల ప్రొఫెసర్ శ్రీపర్ణ పాఠక్ చెప్పారు. అలాంటి చర్యల వల్ల భారత్ తన కార్యకలాపాలను గోప్యంగా నిర్వహించలేదు. ప్రత్యేకించి, వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో, చైనా అక్కడినుంచీ నిఘా పెడితే భారత్ కదలికలు రహస్యంగా ఉండబోవు.
అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్‌లో చైనా-తైవాన్ అధ్యయన కేంద్రానికి చెందిన కల్పిత్ మణిక్కర్ మరింత వివరంగా చెప్పారు. ‘‘ఆ ప్రాంతం గురించి చైనాకు కచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయి. బంగ్లాదేశ్ గత ప్రధానమంత్రి షేక్ హసీనా భారత ప్రయోజనాలకు విలువ ఇచ్చేవారు కాబట్టి ఇన్నాళ్ళూ ఆ ప్రణాళికలు నిద్రాణ స్థితిలో ఉండి ఉంటాయి. ఇప్పుడు అధికార మార్పిడి తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పనిచేస్తుందని మొహమ్మద్ యూనుస్ బహిరంగంగానే ప్రకటించినందున, ఆ అవకాశాన్ని చైనా తప్పకుండా తీసుకుని తీరుతుంది. అయితే ప్రస్తుతానికి చైనా ప్రణాళిక ఏమిటో మనకు తెలియదు. కాకపోతే భారత్ ప్రధాన భూభాగం, ఈశాన్య ప్రాంతాల మధ్య పౌరుల, సైనికుల రాకపోకల మీద నిఘాకు చైనా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.
(సశేషం)