భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో కూంబింగ్ చేస్తోన్న బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు మొదలయ్యాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి కొంత మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మావోయిస్టు కీలక నేత ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కూంబింగ్ ఆపరేషన్లో నారాయణపూర్, దంతెవాడ,బీజాపూర్ జిల్లాల డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పులు కొనసాగుతున్నాయి.
అబూజ్మడ్ పరిధిలోని బటైల్ అడవుల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులున్నట్లు పక్కా సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరావు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు సమాచారం అందుతోంది. కేశవరావుపై కోటి రివార్డ్ ఉందని పోలీసులు తెలిపారు.
బస్తర్ పరిధిలోని నాలుగు జిల్లాల భద్రతా బలగాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. ఈ ఘటనను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధ్రువీకరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుల్లో కేశవరావు ఒకరు.
వరంగల్ నిట్ విద్యాసంస్థలో ఉన్నత విద్యనభ్యసించిన కేశవరావు మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడై అందులో చేరారు. మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమిషన్ అధిపతిగా పనిచేశాడు. గెరిల్లా దాడులకు వ్యూహాలు రచించడంలో కేశవరావు దిట్ట.
1970 నుంచి కేశవరావు మావోయస్టుగా పనిచేస్తున్నారు. 2010లో ఛత్తస్‌గఢ్‌లో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు కేశవరావు ప్రధాన సూత్రధారి. కేశవరావు దళంలో ఉన్నారనే పక్కా సమాచారంలో బలగాలు ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.