మొదటి భాగం ఇక్కడ చదవండి…
రెండవ భాగం ఇక్కడ చదవండి…
మూడవ భాగం ఇక్కడ చదవండి…
తరువాయి నాలుగవ భాగం…..
(21) 2020 ఆగస్టు 31:
కొద్ది రోజుల క్రితం తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణ గురించి భారత్‌లోని చైనా దౌత్య కార్యాలయం ఒక ప్రకటనను 2020 ఆగస్టు 31న తమ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. దానికి కొన్ని గంటల ముందే, హిందూ ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, వెయ్యి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన భూమిని తమదేనంటూ చైనా ప్రకటించుకుంది. మొత్తం మీద వాస్తవాధీన రేఖ వెంబడి వెయ్యి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన భూమి చైనా ఆధిపత్యంలో ఉందంటూ భారత ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ విభాగం సూచించిందని హిందూ పత్రిక కథనం.
2020 ఆగస్టు 29-30 మధ్య రాత్రి చైనా సైన్యం సరిహద్దుల దగ్గర యథాతథ స్థితిని మార్చే ప్రయత్నం చేసిందని, భారత్‌ను రెచ్చగొట్టేలా చైనా సైనిక కదలికలు నమోదయ్యాయనీ భారత సైన్యం ప్రకటించింది. ఆ ప్రయత్నాలను భారత సైనిక బలగాలు సమర్థంగా అడ్డుకున్నాయని వెల్లడించింది. చైనా సైనికులను పాంగాంగ్ సో సరస్సు దక్షిణ తీరానికి పరిమితం చేసామని భారత సైన్యం ప్రకటించింది. దానికి విరుద్ధంగా, లద్దాఖ్‌లో వెయ్యి చదరపు కిలోమీటర్ల భూమి చైనా అధీనంలో ఉందంటూ హిందూ ప్రచురించడం గమనార్హం.
(22) 2020 జులై 15:
భారత్‌తో చైనా సంబంధాలు ఇబ్బందికరంగా ఉన్న వేళ, చైనా వాదనకు మద్దతుగా హిందూ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. 2020 జూన్ నెలలో వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణల గురించి చైనా తమ అంతర్గత చర్చల్లో ఏమని చెప్పింది అనే విషయం మీద హిందూ పత్రిక కథనాన్ని వెలువరించింది. అందులో ప్రధానంగా చైనీస్ వ్యూహకర్తల అభిప్రాయాలను ప్రచురించింది. భారత్ రెచ్చగొట్టడం వల్ల మాత్రమే సరిహద్దుల్లో ఘర్షణలు జరిగాయని హిందూ అభిప్రాయపడింది. సరిహద్దుల్లో భారత్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడాన్ని, అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడాన్ని కూడా రెచ్చగొట్టే చర్యలుగా వ్యాఖ్యానించినది.
మొత్తంగా ఆ వార్తలో చైనా అనుకూల కథన రీతిని (నెరేటివ్) హిందూ పత్రిక ప్రదర్శించింది. బీజింగ్ వాదనలను ప్రముఖంగా ప్రస్తావించడం, భారత్ ఆందోళనలను తక్కువ చేసి చూపించడం అనే వ్యూహాన్ని అమలు చేసింది.
(23) 2020 జూన్ 25:
వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణ వాతావరణం నెలకొంది. 1993 శాంతి ఒఫ్పందాన్ని ఉల్లంఘించి చైనా సైనిక బలగాలను మోహరిస్తోందంటూ భారత్ ఆరోపించింది. అయితే హిందూ పత్రిక మాత్రం తన కథనంలో పరిస్థితుల సంక్లిష్టత దృష్ట్యా భారత్ వాదనను పట్టించుకోకూడదని, దాన్ని విస్మరించాలనీ నొక్కి వక్కాణించింది. భారత్ చైనా రెండు దేశాల మధ్యా సరిహద్దుల విషయంలో చాలా యేళ్ళుగా ఘర్షణలు ఉన్నాయని గుర్తు చేసింది. వివాదాస్పద ప్రాంతాల్లో భారతదేశం సైనికులను మోహరించడమే చైనాను రెచ్చగొట్టి ఉండవచ్చునని ఊహాగానం చేసింది. భారతదేశపు సైనిక చర్యలు చైనాకు ఆగ్రహం కలిగించి ఉంటాయని అభిప్రాయపడింది. భారత్ సాధారణంగా అనుసరించే మెతక వైఖరికి భిన్నంగా దూకుడు ధోరణి ప్రదర్శించడం, చైనా సైనికులను మోహరించిన ప్రతీ చోటా భారత సైనికులను మోహరించడం వల్లనే ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోయాయని ‘హిందూ’ తేల్చింది.
(24) 2020 జూన్ 16:
గాల్వన్ లోయలో చైనా సైనికులు భారత సైనికుల మీద దాడి చేసారు. ఆ ఘటనలో భారత ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్, ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన విషయంలో సైతం హిందూ పత్రిక చైనాపై సానుభూతి చూపుతూ వార్తా కథనాలను ప్రచురించింది. చైనా కథనాలనే పదేపదే ఎత్తి చూపుతూ, పరిస్థితిని చక్కదిద్దాలంటూ పిలుపునిచ్చింది. చైనా దౌత్య ప్రయత్నాలను ఘనంగా చూపిస్తూ, భారత్ సమస్యలు, ఆందోళనలను తక్కువ చేసే విధంగా వార్తలు ప్రచురించింది.
(25) 2020 జూన్ 16:
చైనా భారత్ సరిహద్దు ఘర్షణల విషయంలో సమాచారాన్ని అందించే సాధారణ వార్తల్లోనే కాదు, అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వ్యాసాల్లో సైతం హిందూ పత్రిక చైనా మీద సానుభూతి ఒలకబోసింది. 1962 ఘర్షణ తర్వాత నుంచీ చైనా అనుసరిస్తున్న వైఖరిని ప్రధానంగా ప్రకటిస్తూ వచ్చింది. చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన 1962 తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితి కొనసాగించాలని చైనా కోరుతోంది. దాన్నే హిందూ సమర్ధిస్తూ వచ్చింది.
చైనా ఎప్పటినుంచో వైఖరిని పారదర్శకంగా ప్రదర్శిస్తోంది. భూభాగాల విషయంలో తన వాదనల మీద దృఢంగా నిలబడుతోంది… అంటూ ఆనాటి వ్యాసంలో హిందూ ప్రస్తావించింది. చైనా ఆక్రమణల తర్వాత కొత్తగా మార్చిన సరిహద్దులను నిశ్చితమైనవిగా భారత్ గుర్తించాలంటూ చైనా చేస్తున్న డిమాండ్లను, చైనా వైఖరినీ ఈ వ్యాసంలో ‘హిందూ పత్రిక’ స్పష్టంగా సమర్ధించింది.
(26) 2020 జూన్ 12:
సిఐసిఐఆర్ డిప్యూటీ డైరెక్టర్ వాంగ్ షిడా ‘హిందూ’ పత్రికలో ఒక వ్యాసం రాసారు. ఆ వ్యాసంలో వాస్తవాధీన రేఖ వెంబడి పెరుగుతున్న ఉద్రిక్తతలను గమనించారు. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలని, జమ్మూకశ్మీర్ ప్రతిపత్తిని మార్చాలనీ భారత్ తీసుకున్న నిర్ణయం వల్లనే ఆ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ తరహా వ్యాఖ్యానం భారతదేశ వైఖరికి పూర్తి వ్యతిరేకం. ప్రాదేశిక సార్వభౌమత్వం విషయంలో చైనా వైఖరికి హిందూ అనుకూలంగా వ్యవహరించింది. భారత జాతీయవాద కథనాలకు అనుకూలంగా ఉన్న భౌగోళిక రాజకీయాల వాస్తవికతలను సైతం ‘హిందూ’ విస్మరించింది.
(సశేషం)