మొదటి భాగం ఇక్కడ చూడండి…
దాని తరువాయి….
(6) 2024 నవంబర్ 18:
వైద్య ఆరోగ్య రంగంలో చైనా గొప్పతనాన్ని చాటుతూ భారత్ వెనుకబాటుతనాన్ని ఎత్తి చూపుతూ భారత్‌ను కించపరిచే విధంగా హిందూ పత్రిక 2024 నవంబర్ 18న ఒక వ్యాసం ప్రచురించింది. దాని ప్రకారం, భారతదేశం మధుమేహ వ్యాధి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అదే సమయంలో చైనా గొప్ప గుణపాఠాలు నేర్చుకుంది. ఆరోగ్య భద్రతను మెరుగు పరిచే విషయంలో చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. పొగాకు వినియోగాన్ని తగ్గిస్తోంది. తద్వారా ప్రజల్లో మధుమేహం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. అలా ఆ వ్యాధిని అరికట్టవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి నిర్ణయించిన లక్ష్యాలను సాధించేందుకు భారత్ శ్రమ పడుతుంటే, మధుమేహాన్ని ఎదుర్కొనడం కోసం చైనా ప్రోయాక్టివ్ విధానాన్ని అనుసరిస్తోంది, తద్వారా ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ సమస్యను తగ్గించేందుకు ఒక పరిష్కారాన్ని సూచించింది…. అని ఆ కథనం చెబుతోంది.
(7) 2024 నవంబర్ 14:
నేపాల్ ప్రధానమంత్రి కె పి శర్మ ఓలీ చైనా పర్యటన ఆ రెండు దేశాల మధ్య సంబంధాలనూ బలోపేతం చేస్తుందని హిందూ రాసుకొచ్చింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఇచ్చిన ఋణాన్ని రద్దు చేయాలని కోరింది. భారత్‌తో గగనతల చర్చల ఫలితాలు ఎలా వస్తాయో వివరించాం. దానివల్ల చైనా-నేపాల్ సంబంధాలు మరింత సన్నిహితంగా ఎలా మారతాయో వర్ణించింది. అయితే భారతదేశాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా కె.పి.ఓలి తను ప్రధాని అయిన వెంటనే చైనాలో పర్యటించడం లక్ష్యం, భారత్ నేపాల్ మధ్య సంబంధాలను వీలైనంతవరకూ చెడగొట్టడమే అన్న సంగతిని హిందూ విస్మరించింది. అంతేకాదు, కె పి ఓలీని భారత్ ఆహ్వానించనందువల్లనే ఆయన భారత్‌ను వదిలిపెట్టి చైనా చేయి అందుకున్నాడంటూ విశ్లేషించింది.
(8) 2024 నవంబర్ 1:
కొన్ని భారతీయ సంస్థల మీద అమెరికా ఆంక్షలు విధించింది. దాన్ని హిందూ పత్రిక, భారత విదేశాంగ విధానంలో లోపంగా విమర్శించింది. రష్యాతో భారత్ సంబంధాలు కొనసాగించడం వల్లనే అమెరికా భారత్ మీద ఆంక్షలు విధించిందనీ, రష్యాతో అలాంటి సంబంధాలు కొనసాగించకూడదనే అర్ధం వచ్చేలా హిందూ కథనం కొనసాగింది. అప్పటికి జో బైడెన్ నేతృత్వంలో ఉన్న అమెరికా, భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న సంగతిని హిందూ పత్రిక ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. అంతేకాదు, భారత్ అమెరికాకు స్పందించకపోవడాన్ని దౌత్యపరమైన బలహీనతగా అభివర్ణించింది.
అమెరికా ఆర్థిక శాఖ రష్యాతో సంబంధాలు ఉన్నందుకు దాదాపు 400 సంస్థలపై ఆంక్షలు విధించింది. వాటిలో 19 భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. రష్యాకు డ్యూయల్ యూజ్ టెక్నాలజీలను సరఫరా చేస్తున్నాయంటూ ఆ సంస్థలపై ఆంక్షలు విధించింది.
(9) 2024 ఏప్రిల్ 19:
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ నాయకత్వంలో ఆ దేశం ఒక కొత్త ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోడాన్ని ఆ దేశం అనుసరించిన గొప్ప వ్యూహాత్మక అడుగుగా హిందూ పత్రిక ప్రశంసించింది. ఆ ఫోర్స్ లక్ష్యం సమాచార యుద్ధ రంగంలో చైనా మిలటరీ సామర్థ్యాలను పెంచడం, రక్షణ వ్యవస్థ నిర్మాణాన్ని ఆధునీకరించే విధానాలను అనుసరించడం. రోజురోజుకూ సంక్లిష్టంగా మారుతున్న అంతర్జాతీయ వ్యవహారాల్లో తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా ఏర్పాటు చేసుకున్న ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ అత్యంత సమర్థమైనదంటూ హిందూ పత్రిక ప్రశంసలు గుప్పించింది.
(10) 2024 మార్చి 13:
దక్షిణాసియాలో చైనా ప్రాభవం పెరుగుతోందంటూ హిందూ పత్రిక ఓ కథనం ప్రచురించింది. మాల్దీవులకు సైనిక సహకారం అందించుందుకు చైనా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ చర్యను ప్రాదేశిక స్థిరత్వం, పరస్పర సహకారం సాధించే దిశలో వ్యూహాత్మకంగా గొప్ప ముందడుగుగా చిత్రీకరించింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు బీజింగ్‌తో చేతులు కలపడాన్ని ప్రశంసించింది. వ్యూహాత్మకంగా కీలక స్థానాల్లో ఉన్న శ్రీలంక, నేపాల్ దేశాలతో ద్వైపాక్షిక సైనిక సహకారం పెంచుకోడానికి చైనా ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని సానుకూల పరిణామాలుగా హిందూ చిత్రీకరించింది.
(11) 2022 జూన్ 1:
భారత్‌లో చైనా రాయబారి సన్ వేడాంగ్ తమిళనాడులో రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. ఆ సమయంలో సన్ వేడాంగ్ వామపక్ష భావజాల దినపత్రిక ‘ది హిందూ’ కార్యాలయాన్ని సందర్శించారు. హిందూ సంపాదకుడు సురేష్ నంబత్, ఇతర ఉద్యోగులతో ముఖాముఖీ చర్చలు జరిపారు. చైనా దేశానికి హిందూ పత్రిక ఎంత ప్రీతిపాత్రమైనదో ఆ సంఘటన తెలియజేసింది.
(12) 2021 నవంబర్ 28:
గాల్వన్ లోయ ఘర్షణల నేపథ్యంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ చైనా వాదనలను సమర్ధిస్తూ హిందూ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఆ దేశపు విదేశాంగ శాఖ చేసిన ప్రకటనలను ప్రధానంగా ప్రచురించారు. ఆ కథనంలో భారతదేశమే ముందస్తు ఒప్పందాలను ఉల్లంఘిస్తోందనీ, హింసాత్మక ఘర్షణలకు కారణమవుతోందనీ చైనా ప్రభుత్వం, వారి సైన్యం చేసిన ఆరోపణలను వివరించారు. గాల్వన్ లోయ ప్రాంతం మీద సార్వభౌమాధికారం తమదే అంటూ చైనా చేసిన ప్రకటనను విశేషంగా ప్రస్తావించారు. నిజానికి ఆ వాదనను భారత్ మొదటినుంచీ తీవ్రంగా ఖండిస్తూనే ఉంది. అయితే ఆ కథనంలో భారతదేశం వాదనను తక్కువ చేసి చూపించింది. భారత బలగాల కవ్వింపులకు సమాధానంగా మాత్రమే చైనా స్పందించిందనీ, అందువల్లనే ఘర్షణలు తలెత్తాయనీ చైనా చేసిన వాదనకే హిందూ పత్రిక ప్రాధాన్యం ఇచ్చింది.
(సశేషం)