మొదటి భాగం ఇక్కడ చదవండి…
రెండవ భాగం ఇక్కడ చదవండి…
తరువాయి మూడవ భాగం….
(13) 2021 నవంబర్ 28:
వాస్తవాధీన రేఖ దగ్గర 2021 జూన్ 15న జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత భారత్ – చైనా మధ్య దౌత్య చర్చల గురించి హిందూ ఒక వార్త ప్రచురించింది. అందులో చైనా వైఖరిని, భారత్‌పై నిరసననూ వివరించింది. భారత బలగాలు చట్టవిరుద్ధమైన కార్యక్రమాల కోసం సరిహద్దులు దాటి తమ భూభాగంలోకి వచ్చాయని, చైనా బలగాలను రెచ్చగొట్టి వారిపై దాడులు చేసాయనీ ఆ దేశం చేసిన ఆరోపణలను మాత్రమే ప్రధానంగా ప్రచురించింది. చైనాకు అనుకూలంగా, ఆ దేశానికి సానుభూతి కలిగించేలా వార్తా కథనాన్ని ప్రచురించింది.
(14) 2021 నవంబర్ 17:
లద్దాఖ్ దగ్గర వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతల గురించి ఓ కథనం ప్రచురించింది. అందులో, ఒక సాగునీటి ప్రాజెక్టును అడ్డుకోడానికి చైనా బలగాలు భారత భూభాగంలోకి చొరబడిన సంగతిని ఖండించింది. ఆ విషయాన్నే హిందూ ప్రధానంగా ప్రచురించింది. చైనా బలగాలు వాస్తవాధీన రేఖకు అవతల తమ భూభాగంలోనే ఉన్నాయనీ, ఆ స్థితిని యథాతథంగా కొనసాగించాలనీ (స్టేటస్ కో) హిందూ వాదించింది. వాస్తవాధీన రేఖ దగ్గర స్థితిని ఏకపక్షంగా మార్చకూడదంటూ చైనా చేస్తున్న వాదనను హిందూ పరోక్షంగా సమర్ధించింది. నిజానికి చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. ఆ దశలో యథాతథ స్థితికి ఒప్పుకోవడమంటే చైనా ఆక్రమణను అంగీకరించడమే. భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే. భారత్ చెబుతున్న వాస్తవాలను ఒప్పుకోని హిందూ, చైనా అబద్ధాలనే వాస్తవాలుగా చిత్రీకరించింది.
(15) 2021 జులై 1:
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వందేళ్ళ సందర్భంగా జేఎన్‌యూలోని చైనీస్ అధ్యయన విభాగం ప్రొఫెసర్, వామపక్ష దినపత్రిక ‘ది హిందూ’లో ప్రత్యేక వ్యాసం రాసారు. చైనా వ్యవహారాల నిపుణురాలు అల్కా ఆచార్య ఆ వ్యాసంలో – షి జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందనీ, దేశ అంతర్గత, బహిర్గత శక్తులతో పోరాడి విజయాలు సాధించిందనీ రాసుకొచ్చారు. చైనా ఎట్టకేలకు వలసవాద ప్రభావం నుంచి బైటపడిందనీ, కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ఇతర ప్రపంచ శక్తులను ఓడించి నవచైనా పునరుత్థానం సాధిస్తుందనీ వివరించారు.
(16) 2021 జులై 1:
అదే రోజు, హిందూ పత్రికలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా శతజయంతి సందర్భంగా ఆ దేశం నుంచి పూర్తి పేజీ ఆడ్వర్టోరియల్ ప్రచురించారు. సాధారణ పాఠకులకు అది ఒక మామూలు వ్యాసంలాగే కనిపిస్తుంది. నిజానికి అది పెయిడ్ కంటెంట్ అన్న విషయం జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ అర్ధం కాదు. ఆ ప్రకటనకు చైనా డబ్బులు చెల్లించింది. అంతేకాదు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి సందర్భంగా హిందూ పత్రిక ఒక పాడ్‌కాస్ట్ కూడా ప్రచురించింది.
(17) 2021 జూన్ 26:
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా శతజయంతి రాబోతున్న సందర్భంగా చైనాను కీర్తిస్తూ అనంత్ కృష్ణన్ రాసిన వ్యాసాన్ని హిందూ ప్రచురించింది. డెంగ్ జియావో పింగ్ హయాంలో సమష్ఠి నాయకత్వ విధానం నుంచి, షి జిన్‌పింగ్ నాయకత్వంలో కఠోర నేతల రాజకీయాల వరకూ ‘ఎదిగిన’ క్రమాన్ని ఆ వ్యాసంలో గొప్పగా చిత్రీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే 1921లో పార్టీ వ్యవస్థాపన నుంచి 2021 శతాబ్ది సంవత్సరం వరకూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా బలోపేతమైందని పొగడ్తల్లో ముంచెత్తారు.
(18) 2020 డిసెంబర్ 11:
వాస్తవాధీన రేఖ దగ్గర ఉద్రిక్త పరిస్థితులకు పూర్తి బాధ్యత భారతదేశానిదే అని చైనా చేసిన ఆరోపణలను హిందూ ప్రముఖంగా ప్రకటించింది. ఇరు దేశాల మధ్యా సరిహద్దుల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దానికి కారణం భారతదేశమే అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ చేసిన ప్రకటనను హిందూ తీసుకుంది. ‘ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత భారతదేశానిది మాత్రమే. సరిహద్దుల సమస్యను చైనా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని భావిస్తోంది. ప్రాదేశిక శాంతికి చైనా కట్టుబడి ఉంది’ అని హువా చున్‌యింగ్ చెప్పడాన్ని హిందూ ప్రధానంగా పరిగణించింది. అదే సమయంలో, వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా సైనికులను మోహరించడం ద్వారా చైనా సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించిందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చేసిన ఆరోపణలను హిందూ ఏమాత్రం పట్టించుకోలేదు.
(19) 2020 అక్టోబర్ 1:
చైనా ప్రచార ప్రకటనలను ప్రచురించడం ద్వారా ది హిందూ సొమ్ములు సంపాదించుకుంది. 2020లో అక్టోబర్ 1న చైనా జాతీయ దినం సందర్భంగా వార్త రూపంలో ఉండే ప్రకటనను ఒక పేజీ నిండా ప్రచురించింది. కమ్యూనిస్టులకు ప్రచారం చేస్తూ డబ్బులు చేసుకునే తొందరలో హిందూ పత్రిక ఆ యాడ్వర్టోరియల్‌ను ప్రచురించింది. అంతకు కొద్ది నాళ్ళ ముందే చైనా సరిహద్దుల్లో భారత సైనికులు అమరులై దేశం కోసం చేసిన త్యాగాలను హిందూ పత్రిక వాటంగా వదిలి పెట్టేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మూడో పేజీలో వార్త రూపంలో ప్రచురించిన ఆ యాడ్వర్టోరియల్ ఇప్పుడు హిందూ వెబ్‌సైట్‌లో నుంచి తొలగించేసారు.
(20) 2020 సెప్టెంబర్ 5:
చైనా రక్షణ మంత్రి చేసిన ఒక ప్రకటనను ఆ దేశపు బాకాలా హిందూ పత్రిక ప్రచురించింది. మాస్కోలో భారత, చైనా దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వే(య్) ఫెంగ్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ సరిహద్దుల దగ్గర ఉద్రిక్త పరిస్థితులకు పూర్తిస్థాయిలో భారతదేశమే కారణం అని చైనా రక్షణ మంత్రి ఆరోపించారు. సమస్య పరిష్కారానికి చర్చలే మార్గం అన్న పద్ధతినే చైనా అనుసరిస్తుందని చెప్పారు. నరేంద్ర మోదీ, షి జిన్‌పింగ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకే చైనా సంయమనం వహిస్తోందనీ, భారత్ మాత్రం ఉద్రిక్తతలకు దారితీస్తోందనీ ఆరోపణలు చేసారు. ఆ ఆరోపణలను హిందూ యథాతథంగా ప్రచురించింది. భారతదేశ వైఖరి గురించి మాత్రం ప్రచురించలేదు.
(సశేషం)