వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. శనివారం రాత్రి తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో రాజు అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడికి దిగారు. రాజు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాజు ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి నందిగం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఉద్దండరాయునిపాలెంలో శనివారం రాత్రి ఓ కారు అతి వేగంగా దూసుకెళ్లింది. దీంతో రాజు అనే తెలుగుదేశం పార్టీ నేత కారు డ్రైవర్‌ను మందలించాడు. డ్రైవర్ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుకు విషయం చెప్పడంతో, ఆయన, ఆయన అనుచరులు రాజుపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టి, సురేశ్ ఇంటికి రాజును గుంజుకెళ్లారు. తరవాత రాజుపై నందిగం సురేశ్, ప్రభు, వారి బంధువులు మరోసారి దాడికి దిగారు. రాజు తీవ్రంగా గాయపడ్డారు. మంగళగిరి ఎయిమ్స్ చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేశారు. వారి బంధువుల కోసం గాలిస్తున్నారు.