హైదరాబాద్ పాత బస్తీలో ఘోరం జరిగింది. చార్మినార్ సమీపంలో ఓ భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏసీ పేలుడుతో మంటలు అంటుకున్నాయని ప్రాథమిక విచారణలో తేలింది. ఐదు అగ్నిమాపక శకటాలు, 70 మంది సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. గాయపడిన మరో 8 మందిని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు. అగ్నిమాపక శాఖను ఆధునికీకరించాలని కోరారు. ప్రమాద మృతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
ఘటనా స్థలానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బయలు దేరారు. ఇప్పటి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. రెండంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయి. మొదటి రెండవ అంతస్తులో రాజస్థాన్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 24 మంది నివశిస్తున్నారు. పిల్లలకు సెలవులు ఇవ్వడంతో రాజస్థాన్ నుంచి 8 మంది బంధువులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.