పాకిస్థాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగుస్తోందంటూ వస్తున్న వార్తలను రక్షణ శాఖ ఖండించింది. పదవ తేదీ డీజీఎంఓల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనకు ఎలాంటి ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ మే 7న చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరవాత పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు భారత్ అంగీకారం తెలిపింది. అయితే కాల్పుల విరమణ అవగాహన నేటితో ముగియనుంది అంటూ మీడియాలో వస్తోన్న కథనాలను రక్షణ శాఖ అధికారులు ఖండించారు. కాల్పుల విరమణకు ఎలాంటి ముగింపు తేదీ లేదని ప్రకటించారు.
పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత సైన్యం జరిపిన దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన 11 వైమానిక స్థావరాల్లో నాలుగోవంతు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. భారత్ క్షిపణులు పాక్‌ను తాకాయంటూ ఆ దేశ ప్రధాని షరీఫ్ స్వయంగా ప్రకటించారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న గగనతల రక్షణ వ్యవస్థ విఫలం కావడంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందం ద్వారా కాల్పుల విరమణకు ఒప్పంచి ప్రపంచాన్ని అణుముప్పు తప్పించామని ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కాల్పుల విరమణకు వాణిజ్యానికి సంబంధం లేదని తెలిపింది.