ఆపరేషన్ పహల్‌గామ్ అనేది సైనిక చర్య అని స్పష్టంగా చెప్పినప్పటికీ, పాకిస్తాన్ మీద యుద్ధంగా భావించి దేశప్రజలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద అపారమైన విశ్వాసంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను చేజిక్కించేసుకుంటాం అని పొంగిపోయారు. అలా జరగకపోయేసరికి సామాన్య ప్రజలు నిరాశ చెందితే, జాతీయవాద వ్యతిరేకులు, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలూ నాయకులూ, ఇతర ఉదారవాదులు మొదలైన వారు సంబరపడిపోయారు. పాకిస్తాన్‌కు ఏమీ కాలేదనే సంతోషంతో పండుగ చేసుకున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు.
కాంగ్రెస్ అయితే మోదీని ఇందిరాగాంధీతో పోల్చి ఆమె కంటె మోదీ ఎందుకూ పనికిరాని వాడంటూ ప్రచారం చేసారు. ఇందిర బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సమయంలో అసమాన ధైర్య సాహసాలతో పాకిస్తాన్‌ను ఓడించిందని గప్పాలు కొట్టుకుంటున్నారు. నిజానికి ఆ యుద్ధం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోయిన సంగతినీ, ఇప్పటికీ అనుభవిస్తున్న ఆ యుద్ధపు దుష్ఫలితాలనూ మాత్రం వాటంగా పక్కకు నెట్టేసారు.
మరోవైపు, ఇందిరాగాంధీ అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తీరదు. కేవలం తన రాజకీయ మనుగడ కోసం దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన, బహుశా ప్రపంచంలోనే ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నోరు విప్పితే చాలు జైలు పాలు చేశారు. అప్పట్లోని అన్ని ప్రతిపక్ష పార్టీల పెద్ద నాయకులందరినీ జైళ్ళలో కుక్కేశారు. భారతదేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ ఒక చీకటి యుగం.
ఎమర్జెన్సీ తర్వాత కూడా ఆ అరాచకాలు కొనసాగాయి. 1978లో జనతా పార్టీ అధికారంలో ఉండగా ఇందిరా గాంధీ మరియు సంజయ్ గాంధీ మీద కొన్ని కేసులు నమోదు అయ్యాయి. వాటి మీద రగిలిపోయిన యువజన కాంగ్రెస్ నాయకులు అనేక దారుణాలకు తెగబడ్డారు. విచ్చలవిడిగా అల్లర్లు దౌర్జన్యాలు చేసి సమాజంలో గందరగోళం రేకెత్తించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువజన కాంగ్రెస్ నేత భోలానాథ్ పాండే పెద్ద దుస్సాహసమే చేసాడు. ఏకంగా ఒక విమానాన్నే దారి మళ్ళించేసి విలయ తాండవం చేసాడు. తన సోదరుడు దేవేంద్ర పాండేతో కలిసి ఒక విమానాన్ని హైజాక్ చేసాడు.
1978 డిసెంబర్ 20న కోల్‌కతా నుంచి ఢిల్లీకి వెడుతున్న ఐసి 410 విమానాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు దారి మళ్ళించారు. లఖ్‌నవూలో విమానం ఎక్కిన పాండే బ్రదర్స్.. తుపాకీ చూపించి విమానం పైలెట్‌ను బెదిరించారు. ఢిల్లీ వెళ్ళవలసిన విమానాన్ని వారణాసికి తీసుకెళ్ళి దింపేసారు. ఇందిరాగాంధీ మీద కేసులు రద్దు చేస్తేనే విమానాన్ని, ప్రయాణికులను వదులుతామంటూ హడావుడి చేసారు.
అప్పటి ఉత్తరప్రదేశ్ జనతా పార్టీ ముఖ్యమంత్రి రాం నరేష్ యాదవ్ స్వయంగా హైజాకర్లతో సంప్రదింపులు జరిపారు. కేంద్రంతో మాట్లాడి ఇందిరాగాంధీ మీద కేసులు ఎత్తేస్తామని బుజ్జగించి నచ్చజెప్పారు. అంతలోగా భద్రతా దళాలు విమానంలోకి ప్రవేశించి ప్రయాణికులను సురక్షితంగా కాపాడగలిగారు.
అదంతా ఒక ఎత్తు అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కథ మొత్తం తిరగబడింది. ఒక విమానాన్ని హైజాక్ చేసి భయపెట్టిన భోలానాథ్ పాండే బ్రదర్స్ మీద కేసులు ఎత్తేశారు. అంతేకాదు, తర్వాత కాలంలో భోలానాథ్ పాండేకి కాంగ్రెస్ తరఫున పదవులు కేటాయించారు. రెండు సార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభకు కాంగ్రెస్ తరపున అతను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతని సోదరుడు దేవేంద్ర పాండే కూడా ఎమ్మెల్యే అయ్యాడు. ఆ సంఘటనను బట్టే హైజాకర్లకు, దోపిడీదారులకు, అరాచకవాదులకు కాంగ్రెస్ ఎంత పెద్ద పీట వేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇందిర పాలన సుపరిపాలన, సమర్ధమైన పాలన, రక్షణ కలిగించే పాలన అని చెప్పుకునే కథల వెనుక నిజాలు ఇలాగే పచ్చిగా, నొప్పి కలిగించేలా ఉంటాయి.