పహల్‌గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియే, అజర్‌బైజాన్ దేశాల మీద భారతీయుల ఆగ్రహం పదింతలైంది. టర్కీతో వాణిజ్యాన్ని, ఆ రెండు దేశాలకూ పర్యాటకాన్నీ బాయ్‌కాట్ చేస్తున్నారు. ముఖ్యంగా, ఇటీవల భూకంప సమయంలో తుర్కియేకు మనం చేసిన సాయాన్ని ఆ దేశం మరచిపోయి పాకిస్తాన్‌కు అండగా నిలవడం భారతీయులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.
తుర్కియేకు భారత్ సహాయం:
రెండేళ్ళ క్రితం అంటే 2023 ఫిబ్రవరి 6న తుర్కియే-సిరియా సరిహద్దుల్లో భారీ భూకంపం వచ్చింది. దాదాపు వందేళ్ళలో అత్యంత తీవ్రమైన భూకంపం అది. దాని దెబ్బకు తుర్కియేలో 53వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్ష మందికి పైగా గాయపడ్డారు. అంతేకాదు, కనీసం 15లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ విపత్తు సంభవించిన కేవలం 12 గంటలలోపలే భారతదేశం దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన సహాయ సామగ్రిని పంపించింది. అంతేకాదు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి భారతదేశం ఎన్‌డీఆర్ఎఫ్, భారత సైన్యం బృందాలను కూడా పంపించింది. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట మందులు, ఈసీజీ వంటి వైద్య పరికరాలు, ఆహార పదార్ధాలు, స్టోన్ కట్టర్ల వంటి రకరకాల పరికరాలతో పాటు శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రోన్లను సైతం భారతదేశం పంపించింది. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో ఆరు విమానాలను పంపించింది. వాటిలో మొబైల్ ఆస్పత్రులు, 89మంది వైద్యులు, 30 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కావలసిన అన్ని వైద్య పరికరాలూ ఉన్నాయి. వాటికి తోడు, టర్కీలో ఒక ఆస్పత్రిని శరవేగంగా నిర్మించి, నిర్వహించారు. ఫిబ్రవరి 20 వరకూ మన వైద్యుల బృందం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో వైద్యసేవలు అందించి ఆ తర్వాతే వెనుదిరిగారు.
అంత సహాయం చేయడం భారతదేశపు మానవతా దృక్పథానికి నిదర్శనం. అయితే తుర్కియే మాత్రం మతమే ప్రధానం అనే భావనతో నిండివున్న దేశం. అందుకే, పహల్‌గామ్ ఉగ్రవాదుల దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపడితే, దాదాపు ప్రపంచం అంతా భారత్‌కు అండగా నిలిస్తే, టర్కీ మాత్రం పాకిస్తాన్ పక్షం వహించింది. పాకిస్తాన్‌పై భారత్ దాడుల వల్ల ఇరుదేశాల మధ్యా యుద్ధం వచ్చే అవకాశం ఉందంటూ కల్లబొల్లి యేడ్పులు యేడ్చింది. పాకిస్తాన్‌లోని సాధారణ ప్రజలు, వారి నివాస ప్రాంతాలపై భారత్ దాడులు చేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
తుర్కియేతో తెగతెంపులు అంటున్న భారతీయులు:
సాయం చేసిన చేతినే కొరికిన తుర్కియే దేశం మీద భారతీయుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అందుకే భారత ప్రభుత్వం ఏ పిలుపూ ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా తుర్కియేతో వాణిజ్య సంబంధాలను తెంచుకోడానికి వ్యాపారులు ముందుకొచ్చారు. ఆర్థికంగా నష్టపోయినా పర్వాలేదు, తుర్కియేకు గుణపాఠం నేర్పించాల్సిందే అని భావించారు. అలాంటి సందర్భాలను చూద్దాం.
1. మార్బుల్ దిగుమతులను నిలిపివేసిన ఉదయ్‌పూర్ వ్యాపారులు:
ఆసియాలో అతిపెద్ద మార్బుల్ ఎగుమతుల కేంద్రం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. మార్బుల్‌ను దిగుమతి చేసుకుని దాన్ని ప్రోసెస్ చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తారు. భారతదేశం దిగుమతి చేసుకునే మార్బుల్‌లో 70శాతం టర్కీ నుంచే వస్తుంది. మే 14న ఉదయ్‌పూర్ మార్బుల్ ప్రోసెసర్స్ కమిటీ, తుర్కియే దేశంతో వాణిజ్య లావాదేవీలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘పాకిస్తాన్‌కు అండగా నిలిచినందున టర్కీతో వాణిజ్యాన్ని ఆపివేయడానికి కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది’’ అని కమిటీ అధ్యక్షుడు కపిల్ సురానా ప్రకటించారు.
2. పండ్ల దిగుమతిని బాయ్‌కాట్ చేసిన సాహిబాబాద్ మార్కెట్:
ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లా సాహిబాబాద్‌లోని పండ్ల మార్కెట్ వ్యాపారులు తుర్కియే నుంచి యాపిల్, ఇతర పండ్ల దిగుమతులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు మే 14న ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఇటీవలి ఉద్రిక్తతల సమయంలో తుర్కియే పాకిస్తాన్‌కు అండగా నిలిచినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టంగా ప్రకటించారు.
3. యాపిల్స్ దిగుమతిని నిషేధించాలన్న హిమాచల్ వ్యాపారులు:
మన దేశంలో యాపిల్ పండ్ల ఉత్పత్తి హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువ. టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ వ్యాపారం తగ్గుతోంది. అలాంటిది, మన శత్రు దేశానికి తుర్కియే మద్దతు పలుకుతుంటే అక్కడినుంచి మనం దిగుమతులు చేసుకోవడం అవసరమా అని హిమాచల్ యాపిల్ గ్రోవర్స్ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తుర్కియే నుంచి యాపిల్ పండ్ల దిగుమతులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ మే 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ సొసైటీ తరఫున లేఖ రాసారు.
4. తమకు టర్కీ యాపిల్స్ వద్దన్న పుణే వ్యాపారులు:
మహారాష్ట్ర పుణేలోని పండ్ల వ్యాపారులు తురక యాపిల్స్ తమకు వద్దని నిర్ణయించుకున్నారు. మే 13 నాటికి స్థానిక మార్కెట్లలో తుర్కియే యాపిల్ అనేదే కనబడకుండా చేసారు. పుణే వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఒక యాపిల్ వ్యాపారి సుయోగ్ జెండే మాట్లాడుతూ ‘‘మేం టర్కీ నుంచి యాపిల్స్ కొనకూడదని నిర్ణయించుకున్నాం. దానికి బదులు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్, తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తాం. దేశానికి మా వంతు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పారు.
5. తుర్కియే, అజర్‌బైజాన్ పర్యటనలు భారీ సంఖ్యలో రద్దు:
ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాల్లో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన దేశాలు ప్రపంచం మొత్తం మీద మూడే ఉన్నాయి. అవి చైనా, తుర్కియే, అజర్‌బైజాన్. చైనా ఎప్పుడూ భారత్‌కు శత్రు దేశమే కాబట్టి దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ తుర్కియే, అజర్‌బైజాన్ లాంటి చిన్న దేశాలు సైతం పాకిస్తాన్‌కు అండగా నిలవడం సగటు భారతీయుడికి మంట పుట్టించింది. అందుకే మన వ్యాపారులు ఆ దేశాలతో వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నారు. దానికి కొనసాగింపుగా మన పర్యాటకులు ఆ రెండు దేశాలనూ సందర్శించే కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారు. మే 8 నుంచి 13…. కేవలం ఆరు రోజుల వ్యవధిలో తుర్కియే, అజర్‌బైజాన్ పర్యటనల బుకింగ్‌లు 50శాతం రద్దయిపోయాయి.
ప్రత్యేకించి తుర్కియే టూరిజం సంగతి చెప్పుకోవాలి. 2014లో లక్షా 19వేల మంది భారతీయులు టర్కీని సందర్శించారు. అప్పటినుంచీ వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. 2024లో ఏకంగా 3లక్షల 30వేల మంది టర్కీని సందర్శించారు. 2023తో పోలిస్తే అది ఏకంగా 20శాతం ఎక్కువ. గతేడాది భారతీయ పర్యాటకులు తుర్కియేలో 3వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టారు.
6. చైనా, టర్కీ ఉత్పత్తులను వాడవద్దని సిటిఐ విజ్ఞప్తి:
దేశ రాజధాని ఢిల్లీలోని 700కు పైగా వ్యాపార సంస్థలకు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ – సీటీఐ, మే 12న ఒక విజ్ఞప్తి చేసింది. చైనా, టర్కీ దేశాలతో అన్ని రకాల వ్యాపారాలనూ ఆపివేయాలని కోరింది. సిటిఐ ఛైర్మన్ బ్రజేష్ గోయల్ మాట్లాడుతూ ‘‘ఉగ్రవాద విషయాల్లో పాకిస్తాన్‌కు మద్దతిస్తున్న చైనా, టర్కీ దేశాల నుంచి వస్తువులు, సేవలను పొందకుండా బాయ్‌కాట్ చేయాలని ప్రతీ ఒక్కరినీ అభ్యర్ధిస్తున్నాం. ఆ దేశాలతో వ్యాపార, పర్యాటక సంబంధాలను తక్షణమే ఆపేయాలని సీటీఐ డిమాండ్ చేస్తోంది’’ అన్నారు.
7. ఆ మూడు దేశాలకూ నో చెప్పిన ఇక్సిగో:
ఆన్‌లైన్ పర్యాటక పోర్టల్ ఇక్సిగో మే 10నుంచీ తుర్కియే, అజర్‌బైజాన్, చైనా దేశాలకు ఫ్లైట్, హోటల్ బుకింగ్ సేవలు నిలిపివేసింది. పహల్‌గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆ మూడు దేశాలూ పాకిస్తాన్‌కే అండగా నిలవడంతో ఇక్సిగో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఇక్సిగో తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రకటన కూడా పెట్టింది. ‘‘మన దేశానికి సంఘీభావంగా ఇక్సిగో ఒక నిర్ణయం తీసుకుంది. టర్కీ, అజర్‌బైజాన్, చైనా దేశాలకు ఫ్లైట్, హోటల్ బుకింగ్స్ అన్నింటినీ సస్పెండ్ చేసేసింది. ‘దేశం విషయంలో మాకు రెండో ఆలోచన లేదు’ అని ప్రకటించింది.
8. పర్యాటక ప్యాకేజీలు ఆపేసిన ఈజ్ మై ట్రిప్:
టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు పర్యాటక ప్యాకేజీల విషయంలో ప్రముఖ భారత పర్యాటక కంపెనీ ఈజ్ మై ట్రిప్ కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. ఆ దేశాలకు అన్ని ట్రావెల్ ప్యాకేజీలనూ నిలిపివేస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపక ఛైర్మన్ నిశాంత్ పిట్టీ మే 10న ప్రకటించారు. అవసరం లేకపోతే ఆ దేశాలకు వెళ్ళవద్దంటూ తమ కస్టమర్లకు సూచించారు.
9. గాయకుడు విశాల్ మిశ్రా నిర్ణయం:
ముంబైకి చెందిన గాయకుడు, సంగీతవేత్త విశాల్ మిశ్రా తన జీవితంలో ఎప్పుడూ టర్కీ, అజర్‌బైజాన్ వెళ్ళబోనని ప్రకటించారు. విహార యాత్రల కోసమైనా లేక సంగీత ప్రదర్శనల కోసమైనా సరే ఆ రెండు దేశాలకూ ఇంక వెళ్ళే ప్రసక్తే లేదని మే 9న ఎక్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.
10. ఆ దేశాలను బాయ్‌కాట్ చేసిన పిక్ యువర్ ట్రయల్:
ఢిల్లీకి చెందిన ట్రావెల్ ఏజెన్సీ ‘పిక్ యువర్ ట్రయల్’ టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు కొత్త ట్రావెల్ ప్లానింగ్స్ అన్నింటినీ మే 9 నుంచీ నిలిపివేసింది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు హరి గణపతి మాట్లాడుతూ ‘‘మేము ప్రజల మీద వ్యాఖ్యలు చేయడం లేదు. భారతదేశపు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న వారిపై మా విధానం ఇది. భారతీయ పర్యాటక సంస్థగా భారతీయ ప్రయాణికులకే మా మొదటి ప్రాధాన్యం’’ అని స్పష్టం చేసారు.
11. బుకింగ్స్ ఆపేసిన వాండర్‌ఆన్:
డైరెక్ట్ టు కన్‌జ్యూమర్ ట్రావెల్ టెక్ కంపెనీ ‘వాండర్ ఆన్’ టర్కీ, అజర్‌బైజాన్ దేశాలకు మే 9 నుంచీ కొత్త బుకింగ్స్ ఆపేసింది. ఇప్పటికే బుక్ చేసుకున్నవారు కూడా ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. వాండర్ ఆన్ వ్యవస్థాపక సీఈఓ గోవింద్ గౌర్ మాట్లాడుతూ ‘‘ఆ రెండు దేశాలకూ బుకింగ్స్ ఆపేసాము. కొత్త బుకింగ్స్ తీసుకోవడం లేదు. ఇప్పటికే బుక్ చేసుకున్న భారతీయులు తాము అక్కడకు వెళ్ళదలచుకోవడం లేదని చెబుతున్నారు. వాళ్ళు తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటున్నారు, లేదా మరో పర్యాటక కేంద్రానికి తమ ప్రయాణాన్ని మార్చమంటున్నారు’’ అని చెప్పారు.
12. దేశం మనోభావాలతోనే కాక్స్ అండ్ కింగ్స్:
ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ కాక్స్ అండ్ కింగ్స్ మే 9న ఈ నిర్ణయం తీసుకుంది. అజర్‌బైజాన్, ఉజ్బెకిస్తాన్, టర్కీ దేశాలకు కొత్త ప్రయాణ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. మాకు, మన దేశ ప్రజలకూ సంబంధించిన విషయాల్లో మా నిబద్ధతను బట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం అని కంపెనీ డైరెక్టర్ కరణ్ అగర్వాల్ తెలియజేసారు.
13. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు గో హోమ్ స్టేస్ కటిఫ్:
భారతీయ పర్యాటక సంస్థ గో హోమ్ స్టేస్… తుర్కియే విమానయాన సంస్థ టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తమ వ్యవహారాలను తెగతెంపులు చేసుకున్నామని మే 8న అధికారికంగా ప్రకటించింది. ‘‘భారతదేశానికి అండగా నిలవని వారి వైఖరి కారణంగానే టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యానికి అధికారికంగా ముగింపు పలుకుతున్నాం. ఇకపై మా అంతర్జాతీయ పర్యటన ప్యాకేజీల్లో వారి విమానాలు ఉండబోవు. జైహింద్’’ అని ఆ సంస్థ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.