జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది.తాజాగా పుల్వామా జిల్లా థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదుల సమాచారం అందగానే భద్రతా దళాలు తనిఖీలకు దిగాయి. నాదిర్ గ్రామంలో తనిఖీలు చేస్తుండగా ఉగ్రమూకలు బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
హతులు ఆసిఫ్ అహ్మద్ షేక్, అమిర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా? లేదా అనే దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
జమ్ముకశ్మీర్‌లో గడచిన 48 గంటల్లో ఎన్‌కౌంటర్ జరగడం ఇది రెండోది. కెల్లర్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. వీరు లష్కరే తొయ్యబా ఉగ్రవాదులుగా గుర్తించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తరవాత బలగాలు జమ్ము కశ్మీర్ అంతటా జల్లెడ పడుతున్నాయి. ఉగ్రదాడికి దిగిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.