పాకిస్తాన్ తాజాగా భారతదేశానికి ఒక లేఖ రాసిందని తెలుస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం విషయంలో పునరాలోచించాలని ఆ లేఖలో పాకిస్తాన్ కోరిందని సమాచారం. పాకిస్తాన్ భూభాగంలోకి నదుల ప్రవాహాన్ని కొనసాగనివ్వాలంటూ ఆ దేశపు జలవనరుల శాఖ భారతదేశాన్ని అర్ధించిందని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది.
సింధు నదీ జలాల ఒప్పందం ఆరు దశాబ్దాలకు పైబడిన కాలం నుంచీ అమల్లో ఉంది. 1960 నాటి ఆ ఒప్పందాన్ని భారతదేశం తాజాగా నిలిపివేసింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో భారతదేశం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 నుంచీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది.
జాతీయ భద్రతే తమకు ప్రధానమని స్పష్టం చేసిన భారత్, ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపివేసిందని తమకు నమ్మకం కుదిరేటంత వరకూ సింధు ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని భారత్ ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఆమోదించింది. అలా, ప్రపంచ బ్యాంకు కుదిర్చిన ఒప్పందం మీద మొట్టమొదటిసారి న్యూఢిల్లీ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమం వైపు ప్రవహించే నదులు సింధు, ఝీలం, చీనాబ్ నదుల నీటిని పాకిస్తాన్, తూర్పు దిశగా ప్రవహించే నదులు సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారత్ ఉపయోగించుకోవాలి. దాని ప్రకారం సింధు నదీ ప్రవాహంలో 70 శాతం పాకిస్తాన్, 30శాతం భారతదేశమూ పంచుకోవాలి.
ఇప్పుడు సింధు నదీ జలాలు భారత్‌కు అందుబాటులోకి వచ్చాయి, వాటి మీద గతంలో ప్రారంభించి నిలిపివేసిన జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణం మళ్ళీ తెరమీదకు వచ్చింది. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భారత్ భావిస్తోంది.
అయితే భారత భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా దిగువకు వదలబోమని, ఆ మేరకు కఠిన చర్యలు తీసుకుంటామనీ కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేసారు.