(మొదటి భాగం ఇక్కడ)
(రెండవ భాగం ఇక్కడ)
రెండవ భాగం తరువాయి….
వక్ఫ్ చట్టానికి సవరణలు:
నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి వక్ఫ్ సవరణల బిల్లుకు పార్లమెంటులో ఆమోదం సాధించడం. ఆ సవరణల్లో ముఖ్యమైనవి ఏమిటో తెలుసుకుందాం.
1. వక్ఫ్ బై యూజర్:
వక్ఫ్ చట్టంలో 1995లో చేర్చిన అంశాల్లో అత్యంత వివాదాస్పదమైన వాటిలో ఒకటి ‘వక్ఫ్ బై యూజర్’ అన్న అంశం. ఇదొక అసంబద్ధమైన చట్ట కల్పన. దాని ప్రకారం ఏదైనా ఒక భూమిని వక్ఫ్ అవసరాల కోసం ఎప్పుడైనా ఉపయోగిస్తే, దాని చట్టబద్ధమైన యజమాని ఎవరైనా సరే, ఆ భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించేయవచ్చు. ఈ అస్పష్టమైన క్లాజ్ వల్ల గ్రామాలకు గ్రామాలనే వక్ఫ్ ఆస్తులుగా ఏకపక్షంగా ప్రకటించేసారు. పొలాలు, బడులు, హిందూ దేవాలయాలను సైతం ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించేసుకున్నారు. దాంతో ఎన్నో వ్యాజ్యాలు, ఆందోళనలూ మొదలయ్యాయి. చాలా సందర్భాల్లో మత ఉద్రిక్త పరిస్థితులు సైతం తలెత్తాయి.
ఇప్పుడు 2024లో చేసిన చట్టసవరణలో ఆ ప్రొవిజన్‌ను తొలగించేయడం చాలా న్యాయమైన పని. ఇప్పుడు ఏదైనా భూమిని వక్ఫ్ భూమి అని ప్రకటించాలంటే సరైన, చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్ ఉండాలి, కనీసం ఐదేళ్ళ నుంచీ ముస్లిముగా ఉన్న వ్యక్తి దానం ఇచ్చి ఉండాలి. పైగా, అలాంటి దానానికి మహిళా వారసులు సైతం తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. ముస్లిం మహిళలకు తమ ఆస్తిహక్కును నిరాకరించే మతపరమైన ఆచారాలను దుర్వినియోగం చేసే పితృస్వామ్య పద్ధతిని సవరించే, సుదీర్ఘకాలంగా అమలుకు నోచుకోకుండా ఉండిపోయిన, తప్పనిసరిగా అమలు చేయవలసిన మార్పు అది. ఇన్నాళ్ళకు ఆ దిద్దుబాటు అమల్లోకి వచ్చింది.
2. ప్రభుత్వ భూముల్లోకి దొంగ ప్రవేశాలు ఉండవు:
అసలు మొదట వక్ఫ్ చట్టం చేసినప్పుడే దానిలో, వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ భూములను తమవిగా ప్రకటించుకోగలవా లేదా అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే అస్పష్టంగా వదిలిపెట్టేసారు. చట్టంలో ఉన్న ఆ అస్పష్టతను అనుకూలంగా చేసుకుని ప్రభుత్వ/ప్రజా ఆస్తులను ఆక్రమించేసుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు కొత్తగా చేసిన సవరణ ఆ లోపాన్ని శాశ్వతంగా పరిష్కరించింది. వక్ఫ్ ఆస్తి గురించి ఏదైనా వివాదం తలెత్తితే జిల్లా కలెక్టరు, శిక్షితుడైన రెవెన్యూ అధికారి దర్యాప్తు చేస్తారు. ఆ దర్యాప్తులో సదరు భూమి ప్రభుత్వానిది అని తేలితే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం సాధ్యం కాదు.
3. ఏకపక్ష అధికారానికీ, దొంగ సర్వేలకూ ముగింపు:
పాత పద్ధతిలో వక్ఫ్ బోర్డులే న్యాయమూర్తి, న్యాయ నిర్ణేత, లబ్ధిదారుడుగా ఉండేది. ఏదైనా భూమిని, దాని అసలైన యజమానులతో మాట్లాడనక్కర లేకుండా, వారికి కనీసం తెలియబరచవలసిన అవసరం లేకుండా, అవి తమ భూములేనంటూ వక్ఫ్ బోర్డులు నోటిఫై చేసేయగలవు. వక్ఫ్ చట్టంలోని ఈ విచిత్రమైన అవకాశమే తీవ్రస్థాయిలో వేధింపులకు, ఎడతెరిపి లేని లిటిగేషన్లకూ దారి తీసింది. తాజా సవరణ అలాంటి ఏకపక్షమైన అధికారం అనేదే లేకుండా చేసింది. ఇప్పుడు వక్ఫ్ డిక్లరేషన్లు అన్నిటి పైనా స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే. అప్పుడే వక్ఫ్ ప్రకటనలు అన్నీ ఇలాంటి స్వతంత్ర నిర్ణయాల నుంచి వేలాది పౌరులకు ఊరట కలిగిస్తాయి.
గతంలో సర్వే కమిషనర్లు వక్ఫ్ సర్వేలు చేపడితే చూసేవారు. వారు సాధారణంగా భూముల రికార్డుల కోసమే వస్తూంటారు. కొత్త చట్టం ప్రకారం, వక్ఫ్ సర్వేలను పర్యవేక్షించడం జిల్లా కలెక్టర్లకు తప్పనిసరి బాధ్యత. తద్వారా వక్ఫ్ ఆస్తులను సైతం భూముల రికార్డులను తనిఖీ చేయడం, అలాంటి ఆస్తులు రాష్ట్రప్రభుత్వపు రెవెన్యూ పరిధిలో ఉండడాన్ని ఈ కొత్త చట్టం తప్పనిసరి చేసింది.
4. చేరిక, పారదర్శకత, జవాబుదారీతనం:
కొత్త చట్టంలో బహుశా అత్యంత ప్రగతిశీలమైన సంస్కరణ ఏంటంటే, కేంద్రీయ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతర సభ్యులను సైతం చేర్చడమే. ఇప్పటివరకూ కౌన్సిల్ కేవలం ముస్లిములకు మాత్రమే ప్రత్యేకంగా ఉండేది. దానివల్ల విస్తారమైన భారత రాజకీయ వ్యవస్థ మీద జవాబుదారీతనాన్ని పరిమితం చేసారు. 2024 సవరణ తర్వాత వక్ఫ్ సభల్లో ఇద్దరు ముస్లిమేతర సభ్యులను చేర్చుకోవచ్చు. తద్వారా, సాధారణంగా అస్పష్టంగా ఉండే వక్ఫ్ బోర్డులో పారదర్శకత, వైవిధ్యం తీసుకురావడం సాధ్యమవుతుంది. వక్ఫ్ బోర్డు నిర్వహణలో ఎంపీలు, జడ్జిలు, ఇతర ప్రముఖులకు అవకాశం కలుగుతుంది.
(సశేషం)