(మొదటి భాగం ఇక్కడ)
మొదటి భాగం తరువాయి….
కోట్ల రూపాయల కుంభకోణాలు – వ్యవస్థాగత వైఫల్యాలు:
భూముల ఆక్రమణలు మాత్రమే కాదు, వక్ఫ్ బోర్డుల్లో ఆర్థిక కుంభకోణాలు సైతం చాలా తీవ్రంగా ఉన్నాయి. వక్ఫ్ బోర్డు వ్యవస్థే కుళ్ళిపోయిందంటే అతిశయోక్తి కాదు. కర్ణాటకలో 2012లో నియమించిన ఒక కమిటీ, 38మంది కాంగ్రెస్ నాయకులు 22వేల ఎకరాల వక్ఫ్ భూమిని దుర్వినియోగం చేసారని బైటపెట్టింది. ఆ నాయకుల్లో అప్పటి కేంద్ర మంత్రి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రదేశ్‌లో లంచాల కుంభకోణాలు, మహారాష్ట్రలో చట్టవిరుద్ధమైన పరిహారాల వసూళ్ళు… ఇలా వక్ఫ్ వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. దాన్ని తనిఖీ చేయడం సాధ్యం కాదన్నదే ఆ అక్రమార్కుల ధైర్యం. అలాంటి అక్రమాల్లో కొన్నింటి వివరాలు చూద్దాం.
మధ్యప్రదేశ్, ఇండోర్ (డిసెంబర్ 2024) : వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షౌకత్ మొహమ్మద్ ఖాన్ ఆస్తులను తన చిత్తానికి వచ్చినట్లు అద్దెలకు ఇచ్చేయడం వల్ల బోర్డుకు రూ.2కోట్లు నష్టం వాటిల్లింది. దాని మీద దర్యాప్తు మొదలైంది.
మధ్యప్రదేశ్, భోపాల్ (ఏప్రిల్ 2024): యాసిర్ అరాఫత్ అనే బోర్డు సభ్యుడు రూ.5.5 లక్షల నిధులు మింగేసాడని, మతాధికారుల నుంచి లంచాలు తీసుకుంటున్నాడనీ, బోర్డు కార్యదర్శి సయ్యద్ అలీ ఫిర్యాదు చేసాడు.
మధ్యప్రదేశ్, ఉజ్జయిని (జూన్ 2024): కాంగ్రెస్ నాయకుడు రియాజ్ ఖాన్ 26 సంవత్సరాల పాటు వక్ఫ్ ఆస్తులను దుర్వినియోగం చేసాడు. అతనికి రూ.7కోట్లు చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి.
మహారాష్ట్ర, పుణే (ఆగస్ట్ 2021): వక్ఫ్ బోర్డులోని ఇంతియాజ్ షేక్ తదితరులు దొంగ ఎన్ఓసీలతో ప్రభుత్వం నుంచి రూ.7.75 కోట్లు పరిహారం వసూలు చేసారు. ఆ నిధులను వారు తమ జేబుల్లో వేసుకున్నారు. ఆ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు రిజిస్టర్ చేసింది.
కేరళ (2010-2016): రాష్ట్రంలో 676 ఎకరాల వక్ఫ్ భూములను అక్రమంగా, చట్టవిరుద్ధంగా విక్రయించినట్లు ఎంఎ నిసార్ కమిషన్ కనుగొంది. కమిషన్ నివేదిక చేసిన సిఫార్సులను అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కర్ణాటక (2012): రాష్ట్రంలో 22వేల ఎకరాల వక్ఫ్ భూములను దుర్వినియోగం చేయడం ద్వారా రూ.2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని అన్వర్ మనిప్పాడి కమిటీ బహిర్గతం చేసింది. ఆ స్కామ్‌లో 38మంది కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వారిలో ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు, అప్పటి కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ (మే 2017): రాష్ట్రంలో వక్ఫ్ పేరిట విపరీతమైన అవినీతి జరుగుతోందని, దానిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలనీ కోరుతూ షియా మతగురువు మౌలానా కల్బే జవాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అర్ధించారు.
సహరన్పూర్, ఉత్తరప్రదేశ్ (అక్టోబర్ 2021): నగరంలో లాండ్ మాఫియా వ్యక్తులు, అవినీతి అధికారులు చేతులు కలిపి వక్ఫ్ ఆస్తులను దోచేస్తున్నారంటూ షదాబ్ అబ్దీ అనే వ్యక్తి ఆరోపణలు చేసారు.
ముంబై, మహారాష్ట్ర (మార్చి 2017): అండర్‌వరల్డ్ డాన్లు, రాజకీయ నాయకులు, అప్పటి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఆరిఫ్ నసీమ్ ఖాన్ కలిసి రూ.2500 కోట్ల స్కామ్ చేసారన్న విషయం బహిర్గతమైంది. దానికి సంబంధించిన కొన్ని టెలిఫోన్ సంభాషణలను ఈడీ అధికారులు కనుగొన్నారు. ఆ సంభాషణలో పోలీసులు, రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాల ద్వారా వక్ఫ్ భూములను ఆక్రమించడానికి పన్నిన కుట్రల గురించి ఉంది.
ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్ (డిసెంబర్ 2020): నగరంలో 200 ఏళ్ళ పాతదైన షియా ఇమామ్బారాను కూలగొట్టేసారు. ఆ ప్రదేశంలో ఒక వాణిజ్య సముదాయం నిర్మించేసారు. ఆ దుశ్చర్యకు పాల్పడింది సమాజ్‌వాదీ పార్టీ అండదండలు ఉన్న గ్యాంగ్‌స్టర్ రాజకీయవేత్త ఆతిక్ అహ్మద్ అన్నది బహిరంగ రహస్యం.
(సశేషం)