కేరళలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వక్ఫ్ బిల్లు కారణంగా తమ పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తి పెరిగిపోతోంది. ఇడుక్కి జిల్లా కాంగ్రెస్ క మిటీ ప్రధాన కార్యదర్శి బెన్నీ పెరువంతనం ఏప్రిల్ 4న పార్టీలో తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసారు. వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ వ్యతిరేకతకు నిరసనగానే బెన్నీ రాజీనామా చేయడం గమనార్హం.
కాంగ్రెస్ నాయకత్వం ముస్లిములను బుజ్జగించే ధోరణిలో క్రైస్తవ సమాజం సమస్యలను ‘వ్యవస్థీకృతంగా విస్మరిస్తోంది’ అని బెన్నీ పెరువంతనం ఆగ్రహం వ్యక్తం చేసారు. కేరళలో తీవ్ర ఆందోళనకు దారి తీసిన మునంబం భూముల వివాదం విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తిస్థాయిలో ముస్లిం అనుకూల వైఖరిని అవలంబించిందని బెన్నీ చెప్పుకొచ్చారు. మునంబంలో చారిత్రకంగా క్రైస్తవులు, హిందువుల అధీనంలో ఉన్న 400 ఎకరాల భూమిని కేరళ వక్ఫ్ బోర్డు తమదేనంటూ ప్రకటించి, వివాదం రాజేసింది.
‘‘కాంగ్రెస్ పార్టీ యేళ్ళ తరబడి క్రైస్తవ మైనారిటీలను నిర్లక్ష్యం చేసింది. కేవలం ముస్లిములను మాత్రమే బుజ్జగిస్తూ వస్తోంది. ఆ వైఖరికి నిరసనగా నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను’’ అని బెన్నీ పెరువంతనం వెల్లడించారు.
కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సహా కేరళలోని యావత్ క్రైస్తవ సమాజం వక్ఫ్ సవరణల బిల్లుకు మద్దతివ్వాలని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలను పదేపదే అభ్యర్ధించింది. కానీ ఆ విజ్ఞప్తులను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్మరించడానికే నిర్ణయించుకున్నాయి. ముస్లిం ఓటుబ్యాంకుకు అనుకూలంగా వ్యవహరించాలని నిశ్చయించుకున్నాయి అని బెన్నీ పెరువంతనం వివరించారు.
తమ ఆందోళనలను పార్టీ అంతర్గత వేదికలపైన పలుమార్లు ప్రస్తావించాననీ, వైఖరి మార్చుకోవలసిందిగా సూచించాననీ బెన్నీ చెప్పారు. అయినా ఎలాంటి చర్యా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
‘‘పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందంటే ఇంక ముందుకు ఒక్క అడుగైనా వేయడం అసాధ్యం. అందువల్లే నేను డిసిసి కార్యదర్శి పదవికి మాత్రమే కాదు, ఏకంగా పార్టీకే రాజీనామా చేసాను’’ అని వివరించారు.
బెన్నీ తను ఇంకా ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని స్పష్టం చేసారు. అంతే కాదు, పార్టీ నుంచి మరెంతో మంది రాజీనామాలు చేస్తారన్న సంకేతాలు కూడా ఇచ్చారు.
‘‘క్రైస్తవ మతానికి చెందిన చాలామంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరాశ చెందారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి’’ అని బెన్నీ చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, కేరళ క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైతే, పార్టీకి మద్దతునిచ్చే క్రైస్తవ వర్గానికి చెందిన వారి సంఖ్య చాలా వేగంగా క్షీణించిపోతుందని బెన్నీ సూచించారు.
మునంబం గ్రామంలోని భూమి అంతా తమదేనంటూ వక్ఫ్ బోర్డు చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు సుమారు ఆరు నెలలకు పైగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతంలోని యాభైకి పైగా క్రైస్తవ కుటుంబాలు ఈ మధ్యనే బీజేపీలో చేరాయి. కేరళ రాజకీయ ముఖచిత్రంలో వస్తున్న మార్పుకు అది నిదర్శనమని బీజేపీ వ్యాఖ్యానించింది.