(మొదటి భాగం ఇక్కడ)
(రెండవ భాగం ఇక్కడ)
(మూడవ భాగం ఇక్కడ)
మూడవ భాగం తరువాయి…..
ప్రత్యర్థి కాంగ్రెస్ మోసకారి రాజకీయాలు:
ఇలాంటి విప్లవాత్మకమైన సంస్కరణలు అమల్లోకి వస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాల మౌనం, ఇంకా చెప్పాలంటే వ్యతిరేకత, పిడుగుపాటులాగే ఉంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టి, సుదీర్ఘంగా చర్చించారు. ఆ రెండు రోజుల్లో వారు ముగ్గురూ సభలో నోరు విప్పిందే లేదు. కానీ పార్లమెంటు బైట మాత్రం నోటికొచ్చినట్లు ప్రేలాపనలు ప్రేలారు. మాట్లాడవలసిన అవసరం, అవకాశం ఉన్న చోట తమ అభ్యంతరాలను చర్చకు పెట్టడం మానివేసి, పార్లమెంటు బైట గొడవ చేయడంలోని అసంబద్ధత ఏమిటో జనాలకు అర్ధం అవదనుకోవడం మూర్ఖత్వమే.
వక్ఫ్ బోర్డుకు చట్టబద్ధంగా పునాదులు వేసి ఆ బరువును మన నెత్తిన మోపిన రాజకీయ పార్టీని దాదాపు డెబ్భై యేళ్ళుగా పరిపాలిస్తున్న కుటుంబం అది. అయినా, కేవలం హిందువులనే కాదు, ఎందరో పేద ముస్లిములను సైతం బాధితులను చేసిన ఆ వ్యవస్థను వారు ఈనాటికీ సమర్ధిస్తూనే ఉన్నారు. నిజానికి వక్ఫ్ బోర్డుల్లో పాతుకుపోయి ఉన్న పెద్దమనుషుల దౌర్జన్యాల వల్ల వేలాది మంది పేద ముస్లిములు తమ భూములను కోల్పోయారు.
పారదర్శకత, ఆస్తి హక్కులు, జెండర్ న్యాయాలను సమర్ధించే సంస్కరణలను స్వాగతించడానికి బదులు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ఈ అంశాన్ని రాజకీయం చేయాలనే పద్ధతినే ఎంచుకున్నారు. మోదీ ప్రభుత్వం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందంటూ తప్పుడు ఆరోపణలు చేసారు. అలా చేసే క్రమంలో వారు తమ సౌకర్యం కోసం ముస్లిం హక్కులకై పోరాడే ప్రజావేగులను, భూమిలేని రైతులను, వక్ఫ్ ఆక్రమణల నుంచి పరిష్కారం కోసం యేళ్ళ తరబడి పోరాడుతున్న దేవాలయాల ట్రస్టులను విస్మరించారు.
అది కేవలం రాజకీయ ద్వంద్వవైఖరి మాత్రమే కాదు. వారు పరిరక్షిస్తున్నామని చెప్పుకుంటున్న మౌలిక విలువలకు వెన్నుపోటు పొడవడమే. గాంధీలు లౌకికవాదం గురించి, న్యాయం గురించి నిజంగా పట్టించుకుని ఉన్నట్లయితే వాళ్ళు దేశ ప్రజలను మతాలకు అతీతంగా శక్తివంతులను చేసే చట్టాలను సమర్ధించి ఉండేవారు. అంతేతప్ప ఏమాత్రం బాధ్యత వహించని మతపరమైన నిరంకుశమైన అధికార వర్గాలు (బ్యురాక్రసీలు) పరిపాలించే సమాంతర భూ ఆక్రమణదారుల సామ్రాజ్యాన్ని సృష్టించేందుకు దోహదం చేసే చట్టాలను సమర్ధించరు.
న్యాయం వైపు ముందడుగు:
రాజకీయ వ్యాఖ్యాతల్లో కొంతమంది వక్ఫ్ సవరణ చట్టం 2024ను ‘మెజారిటీ వాదానికి అనుకూలమైనది’ అని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసారు. కానీ క్షేత్రస్థాయి నిజాలు చెప్పే కథ వేరేలా ఉంది. ముస్లిం సమాజంలోనే చాలామంది ఈ సంస్కరణలను స్వాగతించారు. ఇప్పటివరకూ ఉన్న వక్ఫ్ చట్టం వల్ల బాధితులుగా మిగిలిన భూముల యజమానులు, ఆస్తులకు వారసురాళ్ళు, సంస్కరణశీలురైన ముస్లిములు, తదితరులకు ఈ సవరణలు కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, విముక్తి మార్గం కూడా.
చట్టపరమైన స్పష్టత, లౌకికవాద పరిపాలన, సమాన హక్కుల కోసం భారతదేశపు అన్వేషణలో వక్ఫ్ సవరణల బిల్లు 2024 ఒక కీలకమైన ముందడుగు. మోదీ ప్రభుత్వం, దశాబ్దాల తరబడి జరిగిన చట్టపరమైన నిర్లక్ష్యం, బుజ్జగింపు వైఖరులను తొలగించింది. తద్వారా భూముల అధికారులకు సమాంతర వ్యవస్థలా వక్ఫ్ బోర్డులను అనుమతించిన ఒక చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దింది. ఆ చర్యను సమర్ధించవలసిన తరుణంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా తదితరులు ఇంకా తమ పార్టీ సృష్టించిన ఆ విచ్ఛిన్నకర వ్యవస్థను పరిరక్షించడం పైనే ఎక్కువ ఆసక్తి చూపుతూ వచ్చారు. వారి మౌనం కేవలం రాజకీయం కాదు, అది ఏకంగా నేరంలో భాగస్వాములు అవడమే.
ప్రజాస్వామ్యంలో వక్ఫ్ లేదా మరే ఇతర మత సంస్థా రాజ్యాంగాన్ని అతిక్రమించి పనిచేయకూడదు. వక్ఫ్ చట్టానికి చేసిన ఈ సవరణలతో భారతదేశం ఆ ఆదర్శానికి చేరువగా మరికొన్ని అడుగులు ముందుకు వేసినట్లయింది.
(సమాప్తం)