అవినీతిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువస్తున్న సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి తిరగాల్సిన పని లేకుండా స్లాట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయడంతోపాటు, నేరుగా భూ హక్కుదారులే స్లాట్ బుక్ చేసుకుని సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేసుకోవచ్చని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
ప్రయోగాత్మకంగా జిల్లా కేంద్రాల్లోని 26 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని ఫలితాలు విశ్లేషణ చేసి తదుపరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరిస్తామని మంత్రి అనగాని తెలిపారు. ప్రజలకు మేలు చేసేందుకే నాలా చట్టాన్ని రద్దు చేశామన్నారు. దీని స్థానంలో మెరుగైన చట్టం తీసుకువస్తామని మంత్రి తెలిపారు.